Share News

రూ.404 లక్షల కోట్లు

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:26 AM

స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా ఐదో రోజూ లాభాల్లో పయనించాయి. ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాల కారణంగా గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ మధ్యాహ్నం వరకు...

రూ.404 లక్షల కోట్లు

సరికొత్త రికార్డు స్థాయికి స్టాక్‌ మార్కెట్‌ సంపద

మళ్లీ 74,000 పైకి సెన్సెక్స్‌ ... 22,550 ఎగువకి నిఫ్టీ

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా ఐదో రోజూ లాభాల్లో పయనించాయి. ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాల కారణంగా గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ మధ్యాహ్నం వరకు స్వల్ప లాభ, నష్టాల మధ్య ఊగిసలాడాయి. ఆ తర్వాత బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, లోహ రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో రివ్వున ఎగిశాయి. ఒక దశలో 718 పాయింట్ల వరకు ఎగబాకి 74,500 ఎగువ స్థాయిలో ట్రేడైన సెన్సెక్స్‌.. చివరికి 486.50 పాయింట్ల లాభంతో 74,339.44 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 167.95 పాయింట్ల వృద్ధితో 22,570.35 వద్ద ముగిసింది. గడిచిన ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 1,850.45 పాయింట్లు (2.55 శాతం) పుంజుకోగా.. ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.11.29 లక్షల కోట్లకు పైగా పెరిగి సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి రూ.404.18 లక్షల కోట్లకు(4.87 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది.

కోటక్‌ బ్యాంక్‌ షేరు ఢమాల్‌ : ఆర్‌బీఐ ఆంక్షల ఫలితంగా కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేరు ధర బీఎ్‌సఈలో ఒక దశలో 12.10 శాతం పతనమై సరికొత్త ఏడాది కనిష్ఠ స్థాయి రూ.1,620 వద్దకు జారుకుంది. చివరికి 10.85 శాతం నష్టంతో రూ.1,643 వద్ద ముగిసింది. దాంతో బ్యాంక్‌ మార్కెట్‌ విలువ (క్యాపిటలైజేషన్‌) ఒక్క రోజులోనే రూ.39,768.36 కోట్ల మేర తరిగిపోయి రూ.3.26 లక్షల కోట్లకు పరిమితమైంది. సెన్సెక్స్‌ నమోదిత కంపెనీల్లో కోటక్‌ బ్యాంక్‌ షేరు టాప్‌ లూజర్‌గా మిగిలింది. అంతేకాదు, మార్కెట్‌ విలువపరంగా దేశంలోని అతిపెద్ద బ్యాంక్‌ల్లో ఐదో స్థానానికి జారుకుంది. యాక్సిస్‌ బ్యాంక్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది.


స్విగ్గీ రూ.10,400 కోట్ల ఐపీఓ

ఆన్‌లైన్‌లో ఆహారం, కిరాణా సరుకుల బుకింగ్‌, డెలివరీ సేవలందించే స్విగ్గీ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు వచ్చేందుకు వాటాదారుల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఐపీఓ ద్వారా రూ.10,414 కోట్ల వరకు సమీకరించే ప్రతిపాదనకు ఈనెల 23న నిర్వహించిన అసాధారణ సమావేశం (ఈజీఎం)లో ప్రత్యేక తీర్మానం ద్వారా ఈ ప్రతిపాదనకు వాటాదారుల నుంచి ఆమోదం పొందినట్లు తెలిసింది.

ఐపీఓలో రూ.3,750 కోట్ల తాజా ఈక్విటీ జారీ చేయడంతోపాటు రూ.6,664 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిన విక్రయించాలని కంపెనీ భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2014లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన స్విగ్గీ ప్రస్తుతం 1,270 కోట్ల డాలర్ల (రూ.1.06 లక్షల కోట్లు) స్థాయి మార్కెట్‌ విలువను కలిగి ఉంది.

Updated Date - Apr 26 , 2024 | 04:26 AM