టాప్ 500 స్టాక్స్‌కు అదే రోజు సెటిల్‌మెంట్
ABN , Publish Date - Dec 11 , 2024 | 05:41 AM
ఈ డిసెంబరు 31 నాటికి మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్-500 కంపెనీల స్టాక్స్ కు ఐచ్ఛిక టీ+0 (షేరు కొనుగోలు చేసిన రోజే) సెటిల్‌మెంట్‌ను దశల వారీగా అందుబాటులోకి తెస్తున్నట్లు...
కొత్త ఏడాది నుంచి దశల వారీగా అమలు: సెబీ
న్యూఢిల్లీ: ఈ డిసెంబరు 31 నాటికి మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్-500 కంపెనీల స్టాక్స్ కు ఐచ్ఛిక టీ+0 (షేరు కొనుగోలు చేసిన రోజే) సెటిల్‌మెంట్‌ను దశల వారీగా అందుబాటులోకి తెస్తున్నట్లు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ తెలిపింది. స్టాక్ బ్రోకర్లందరూ టీ+0 సెటిల్‌మెంట్‌లో పాల్గొనవచ్చని స్పష్టం చేసింది. అంతేకాదు, టీ+1, టీ+0 సెటిల్‌మెంట్‌కు మధ్య వ్యత్యాస బ్రోకరేజీని నియంత్రణ పరిధికి లోబడి వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. సెబీ 2024 మార్చిలో 25 స్టాక్స్‌కు ఈ ఐచ్ఛిక టీ+0 సెటిల్‌మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తాజా ప్రతిపాదిత జాబితాలో తొలుత దిగువ 100 కంపెనీలకు జనవరిలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని సెబీ తన సర్క్యులర్‌లో వెల్లడించింది. ఆ తర్వాత నెలకు 100 కంపెనీల చొప్పున జాబితాను 500కు చేర్చనున్నట్లు సెబీ స్పష్టం చేసింది.
డిజిలాకర్ ద్వారా అన్‌క్లెయిమ్డ్ ఆస్తుల సెటిల్‌మెంట్: సెక్యూరిటీస్ మార్కెట్లో అన్‌క్లెయిమ్డ్ ఆసెట్స్‌ను తగ్గించడంతో పాటు ఆ క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌ను క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్ ప్లాట్‌ఫామ్ డిజిలాకర్‌ను ఉపయోగించుకోవాలని సెబీ ప్రతిపాదించింది. డిపాజిటరీలు, మ్యూచువల్ ఫండ్లు డీమ్యాట్, మ్యూచువల్ ఫండ్ స్టేట్‌మెంట్లను డిజిలాకర్ ద్వారానూ అందుబాటులోకి తేవాలని మంగళవారం విడుదల చేసిన చర్చాపత్రంలో సెబీ ప్రతిపాదించింది. అలాగే, కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీలు (కేఆర్‌ఏ) మదుపరి మరణ సమాచారాన్ని డిజిలాకర్‌తో పంచుకోవాలని కూడా సూచించింది. డిజిలాకర్ వినియోగదారులు తమ ఖాతాలకు ఎవరినైనా నామినీగా ఎంచుకోవచ్చు. దురదృష్టవశాత్తూ వినియోగదారు మరణిస్తే, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్‌జీఐ) లేదా కేఆర్‌ఏ వ్యవస్థలోని మరణ నమోదు సమాచారం ఆధారంగా డిజిలాకర్ అకౌంట్ స్టేట్‌సను అప్‌డేట్ చేస్తుంది.
అలాగే, మరణించిన వినియోగదారు నామినీకి డిజిలాకర్ ఆటోమెటిక్‌గా ఎస్‌ఎంఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తుంది. తద్వారా నామినీ మరణించిన వ్యక్తి డిజిటల్ రికార్డులను యాక్సెస్ చేయగలగడంతోపాటు ఆస్తుల బదిలీకి క్లెయిమ్ ప్రక్రియను ప్రారంభించేందుకు వీలుంటుంది. ఈ ప్రతిపాదనలపై డిసెంబరు 31లో అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా సెబీ ప్రజలను కోరింది.