Share News

ఎస్‌బీఐ లాభం రూ.19,325 కోట్లు

ABN , Publish Date - Aug 04 , 2024 | 04:45 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024 -25) జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎ్‌సబీఐ) ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 4.25 శాతం వృద్ధితో...

ఎస్‌బీఐ లాభం రూ.19,325 కోట్లు

రూ.1,22,688 కోట్లకు మొత్తం ఆదాయం .. 2024-25లో రూ.25,000 కోట్ల సమీకరణ

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024 -25) జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎ్‌సబీఐ) ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 4.25 శాతం వృద్ధితో రూ.19,325 కోట్లకు చేరుకుంది. స్టాండ్‌ఎలోన్‌ లాభం మాత్రం కేవలం 0.9 శాతం వృద్ధితో రూ.17,035 కోట్లకు పరిమితమైంది. బ్యాంక్‌ నికర వడ్డీ మార్జిన్‌, ఇతర ఆదాయం తగ్గడంతోపాటు మొండి బాకీల నష్టాలను పూడ్చుకునేందుకు కేటాయింపులు పెరగడం లాభాల వృద్ధిని పరిమితం చేసింది. కాగా, ఈ క్యూ1లో ఎస్‌బీఐ స్టాండ్‌ఎలోన్‌ ఆదాయం రూ.1,22,688 కోట్లకు పెరిగింది. అందులో వడ్డీ ఆదాయం రూ.1,11,526 కోట్లుగా ఉంది. మరిన్ని ముఖ్యాంశాలు..

  • ఏప్రిల్‌-జూన్‌ కాలానికి బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) వార్షిక ప్రాతిపదికన 5.71 శాతం వృద్ధితో రూ.41,125 కోట్లకు చేరుకుంది.

  • నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) మాత్రం 0.11 శాతం తగ్గి 3.22 శాతానికి పరిమితమైంది. క్రితం సంవత్సరంలో ఇదే కాలానికి ఎన్‌ఐఎం 3.33 శాతంగా నమోదైంది.


  • 2023 జూన్‌ 30 నాటికి 2.76 శాతంగా (రూ.91,327.84 కోట్లు) ఉన్న బ్యాంక్‌ మొండి బకాయిలు లేదా స్థూల నిరర్థక ఆస్తులు (గ్రాస్‌ ఎన్‌పీఏ).. ఈ ఏడాది జూన్‌ చివరి నాటికి 2.21 శాతానికి (రూ.84,226.04 కోట్లు) తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 0.71 శాతం (రూ.22,995.37 కోట్లు) నుంచి 0.57 శాతానికి (రూ.21,554.69 కోట్లు) దిగివచ్చాయి.

  • మొండి బకాయిల నష్టాలను పూడ్చుకునేందుకు బ్యాంక్‌ రూ.4,580 కోట్ల కేటాయింపులు జరిపింది. క్రితం ఏడాదిలో జూన్‌ త్రైమాసికానికి జరిపిన రూ.2,488 కోట్ల కేటాయింపులతో పోలిస్తే 70 శాతం అధికమిది. కాగా, ఈ జూన్‌ చివరినాటికి కేటాయింపుల కవరేజీ నిష్పత్తి (పీసీఆర్‌) మాత్రం 91.76 శాతానికి పెరిగింది.

  • ఈ ఏప్రిల్‌-జూన్‌ కాలంలో కొత్తగా రూ.7,903 కోట్ల రుణాలు మొండిపద్దుల్లోకి మళ్లాయి. అందులో రూ.1,600 కోట్లు ఇప్పటికే వసూలైనట్లు ఎస్‌బీఐ చైర్మన్‌ దినేశ్‌ ఖారా వెల్లడించారు.

  • గత త్రైమాసికంలో బ్యాంక్‌ స్థూల రుణాలు 15.39 శాతం వార్షిక వృద్ధితో రూ.38.12 లక్షల కోట్లకు చేరుకోగా.. మొత్తం డిపాజిట్లు 8.18 శాతం పెరుగుదలతో రూ.49.02 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2024-25 మొత్తానికి రుణ వృద్ధి 15 శాతంగా నమోదు కావచ్చని బ్యాంక్‌ భావిస్తోంది.


  • బాసెల్‌-3 ప్రమాణాలకు అనుగుణంగా అదనపు టైర్‌ 1, టైర్‌ 2 బాండ్ల జారీ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.25,000 కోట్ల నిధుల సమీకరణకు ఎస్‌బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లకు ఈ బాండ్ల జారీ ద్వారా దేశీయ కరెన్సీతోపాటు డాలర్లలో నిధులను సమీకరించనుంది. ఈ ప్రతిపాదనకు కేంద్రం అనుమతి కూడా అవసరమని పేర్కొంది.


ఖారా హయాంలో రూ.1.63 లక్షల కోట్ల లాభం

బ్యాంక్‌ షేరు ధర ఇంకా తక్కువేనన్న ఎస్‌బీఐ చైర్మన్‌

గడిచిన కొన్నేళ్లలో బ్యాంక్‌ లాభం భారీగా పుంజుకుందని ఎస్‌బీఐ చైర్మన్‌ దినేశ్‌ ఖారా అన్నారు. చైర్మన్‌గా తన హయాంలోని నాలుగేళ్లలో బ్యాంక్‌ మొత్తం రూ.1.63 లక్షల కోట్ల లాభం గడించిందని.. అంతక్రితం 64 ఏళ్లలో ఆర్జించిన రూ.1.45 లక్షల కోట్ల లాభం కంటే అధికమని ఫలితాల విడుదల సందర్భంగా ఖారా మీడియాకు వెల్లడించారు. తను చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు బ్యాంక్‌ లాభం రూ.14,000 కోట్ల స్థాయిలో ఉండగా.. ఇప్పుడది రూ.17,000 కోట్లు దాటిందన్నారు. అంతేకాదు, 22,000కు పైగా శాఖలతో పాటు భారీగా నిల్వలు, వైవిధ్యభరితమైన ఉత్పత్తులను కలిగి ఉన్నప్పటికీ బ్యాంక్‌ షేరుకు సరైన విలువ మాత్రం లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఖారా పదవీకాలం ఈ నెలలోనే ముగియనుంది. ఆయన స్థానాన్ని తెలంగాణకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి భర్తీ చేయనున్నారు. శెట్టి ప్రస్తుతం ఎస్‌బీఐలో ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Updated Date - Aug 04 , 2024 | 04:45 AM