జనవరి 28న విచారణకు రండి
ABN , Publish Date - Dec 25 , 2024 | 04:39 AM
అదానీ గ్రూప్ వ్యవహారంలో సెబీ చీఫ్ మాధవి పురి బుచ్, ఆమె భర్తపై వచ్చిన అవినీతి ఆరోపణల విషయంలో వాంగ్మూలం ఇచ్చేందుకు జనవరి 28వ తేదీన తన ముందు హాజరు కావాలని లోక్‌పాల్...
సెబీ చీఫ్‌కు లోక్‌పాల్ నోటీసు
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ వ్యవహారంలో సెబీ చీఫ్ మాధవి పురి బుచ్, ఆమె భర్తపై వచ్చిన అవినీతి ఆరోపణల విషయంలో వాంగ్మూలం ఇచ్చేందుకు జనవరి 28వ తేదీన తన ముందు హాజరు కావాలని లోక్‌పాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆమెపై ఫిర్యాదు చేసిన టీఎంసీ ఎంపి మహువా మొయిత్రా సహా ఫిర్యాదుదారులందరూ కూడా అదే రోజు కోర్టుకు హాజరు కావాలంటూ లోక్‌పాల్ కార్యాలయం సమన్లు జారీ చేసింది. లోక్‌సభ సభ్యురాలైన మొయిత్రా, మరో ఇద్దరు దాఖలు చేసిన అవినీతి, ప్రయోజన వైరుధ్యం ఆరోపణలపై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని నవంబరు 8వ తేదీన బుచ్‌కు లోక్‌పాల్ నోటీసు జారీ చేసింది. దానికి సమాధానంగా డిసెంబరు 7వ తేదీన ఆర్‌పీఎస్ (రెస్పాండెంట్ పబ్లిక్ సర్వెంట్) అఫిడవిట్ రూపంలో సమాధాన ఇచ్చినట్టు లోక్‌పాల్ తెలిపారు.
తదుపరి చర్యగా నోటిమాట ద్వారా తమ వాదన వినిపించేందుకు ఆర్‌పీఎ్‌సకు, ఫిర్యాదుదారులకు అవకాశం ఇవ్వాలని భావించినట్టు లోక్‌పాల్ చైర్‌పర్సన్ జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, ఐదుగురు సభ్యులు డిసెంబరు 19వ తేదీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగానే వాంగ్మూలం ఇచ్చేందుకు జనవరి 28న లోక్‌పాల్ ముందు హాజరు కావాలని తాజా ఉత్తర్వులు జారీ చేశారు.