Share News

SEBI : ప్రజలు శాట్‌ను ఆశ్రయించకుండా జాగ్రత్తపడాల్సింది సెబీనే

ABN , Publish Date - Dec 14 , 2024 | 06:02 AM

ప్రజలు విభేదించలేని విధంగా, తన నిర్ణయాలను సెక్యూరిటీస్‌ అప్పిల్లేట్‌ ట్రైబ్యునల్‌ (శాట్‌) లో సవాలు చేయాల్సిన అవసరం లేకుండా నియమావళిని రూపొందించాల్సిన బాధ్యత మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీదేనని ఈ నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) వీ

SEBI : ప్రజలు శాట్‌ను ఆశ్రయించకుండా జాగ్రత్తపడాల్సింది సెబీనే

ఈడీ సుందరేశన్‌

ముంబై: ప్రజలు విభేదించలేని విధంగా, తన నిర్ణయాలను సెక్యూరిటీస్‌ అప్పిల్లేట్‌ ట్రైబ్యునల్‌ (శాట్‌) లో సవాలు చేయాల్సిన అవసరం లేకుండా నియమావళిని రూపొందించాల్సిన బాధ్యత మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీదేనని ఈ నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) వీ సుందరేశన్‌ అన్నారు. సెబీకి మూడు దశాబ్దాలకు పైగా సేవలందిస్తోన్న సుందరేశన్‌.. ప్రపంచ హిందూ ఎకనామిక్‌ ఫోరమ్‌లో శుక్రవారం ప్రసంగించారు. మూలధన పెట్టుబడుల రాకకు తోడ్పడటంతో పాటు ఇన్వెస్టర్లలో భరోసా నింపడమే సెబీ ప్రాథమిక బాధ్యతని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ‘‘సెబీ మైదానంలోని అంపైర్‌. కాగా, శాట్‌ థర్డ్‌ అంపైర్‌. మైదానంలోని అంపైర్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ థర్డ్‌ అంపైర్‌ను ఆశ్రయించకుండా చూడాల్సిన బాధ్యత మైదానంలోని అంపైర్‌దే’’నని ఆయన అభిప్రాయపడ్డారు. అంపైర్‌ (సెబీ) నిష్పక్షపాతంగా వ్యవహరిస్తేనే ఆట (మార్కెట్లో కార్యకలాపాలు) సజావుగా సాగుతుంది. తత్ఫలితంగా మన మార్కెట్‌పై ఇన్వెస్టర్లలో భరోసా పెరుగుతుందన్నారు. గడిచిన కొన్ని త్రైమాసికాల్లో సెబీ జారీ చేసిన పలు ఆదేశాలపై శాట్‌ స్టే విధించడం లేదా రద్దు చేయడం జరిగిన నేపథ్యంలో సుందరేశన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఆల్గో ట్రేడింగ్‌లోకి రిటైల్‌ మదుపరులు

ఆల్గోరిథమిక్‌ ట్రేడింగ్‌లో రిటైల్‌ మదుపరులు సైతం తగిన భద్రతతో పాల్గొనేందుకు అనుమతించాలని సెబీ ప్రతిపాదించింది. ఇందులో స్టాక్‌ బ్రోకర్లు, ఎక్స్ఛేంజీల పాత్ర, బాధ్యతలను నిర్దేశిస్తూ నియంత్రణ నియమావళితో కూడిన చర్చా పత్రాన్ని విడుదల చేసింది. తాజా ప్రతిపాదనలపై వచ్చే నెల 3 నాటికి ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది. ఆల్గో ట్రేడింగ్‌లో వేగంగా ఆర్డర్ల ఎగ్జిక్యూషన్‌తోపాటు లావాదేవీల వ్యయం తగ్గి, ద్రవ్య లభ్యత కూడా మెరుగుపడుతుంది. మార్కెట్‌ దక్షతతోపాటు పారదర్శకతను పెంచేందుకు డైరెక్ట్‌ మార్కెట్‌ యాక్సె్‌స (డీఎంఏ) వసతి ద్వారా సెబీ 2008లో ఆల్గో ట్రేడింగ్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ వసతి సంస్థాగత ఇన్వెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

Updated Date - Dec 14 , 2024 | 06:02 AM