Share News

సెన్సెక్స్‌ @ : 78,000

ABN , Publish Date - Jun 26 , 2024 | 04:52 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు మంగళవారం సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించాయి. సెన్సెక్స్‌ తొలిసారిగా 78,000 మైలురాయిని చేరగా.. నిఫ్టీ 23,700 స్థాయిని దాటింది....

సెన్సెక్స్‌ @ : 78,000

  • 23,700 ఎగువకు నిఫ్టీ

  • సరికొత్త శిఖరాలకు సూచీలు

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు మంగళవారం సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించాయి. సెన్సెక్స్‌ తొలిసారిగా 78,000 మైలురాయిని చేరగా.. నిఫ్టీ 23,700 స్థాయిని దాటింది. మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎస్‌బీఐతో పాటు ప్రైవేట్‌ బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్‌ ర్యాలీకి దోహదపడ్డాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 823.63 పాయింట్లు పెరిగి 78,164.71 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును తాకి చివరికి 712.44 పాయింట్ల లాభంతో 78,053.52 వద్ద సరికొత్త జీవితకాల గరిష్ఠ ముగింపును నమోదు చేసింది. ఈ నెల 10న తొలి సారిగా 77,000 మార్క్‌కు చేరిన సెన్సెక్స్‌.. గడిచిన 15 రోజుల్లోనే మరో 1,000 పాయింట్లు పుంజు కోవడం గమనార్హం. నిఫ్టీ విషయానికొస్తే, 216.3 పాయింట్ల వృద్ధితో 23,754.15 వద్ద సరికొత్త ఇంట్రాడే రికార్డును, చివర్లో 183.45 పాయింట్ల లాభంతో 23,721.30 వద్ద ఆల్‌టైం గరిష్ఠ ముగింపును నమోదు చేసింది.


ఈ ఏడాదిలో ఇప్పటివరకు నిఫ్టీ సరికొత్త రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేయడం ఇది 34వ సారి. కాగా, ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.435.76 లక్షల కోట్లకు (5.22 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 15 లాభపడ్డాయి.

నెఫ్రో కేర్‌ ఐపీఓ ధరల శ్రేణి రూ.85-90

నెఫ్రో కేర్‌ ఇండియా లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 28న ప్రారంభమై జూలై 2న ముగియనుంది. ఐపీఓ ద్వారా కంపెనీ 45.84 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. షేరు ధరల శ్రేణిని రూ.85-90గా నిర్ణయించింది. తద్వారా రూ.41.26 కోట్ల వరకు సమీకరించనుంది.

1:5 నిష్పత్తిలో కిమ్స్‌ షేర్ల విభజన!

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స (కిమ్స్‌) తన షేర్లను విభజించనుంది. రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరును రూ.2 ముఖవిలువతో కూడిన 5 షేర్లుగా విభజించాలని ప్రతిపాదించింది. ఈ నెల 28న (శుక్రవారం) కంపెనీ బోర్డు సమావేశమై ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోనుందని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు కిమ్స్‌ సమాచారం అందించింది. దాంతో కంపెనీ షేరు ఒక దశలో 6.40 శాతం వరకు పెరిగి రూ.2,187.45 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 3.6 శాతం లాభంతో రూ.2,128.50 వద్ద ముగిసింది.


100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి ఐసీఐసీఐ బ్యాంక్‌

ప్రైవేట్‌ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌ తాజాగా మరో రికార్డును సృష్టించింది. బీఎస్‌ఈలో బ్యాంక్‌ షేరు మంగళవారం రెండున్నర శాతం వరకు వృద్ధి చెంది రూ.1,199 వద్దకు ఎగబాకింది. దాంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.8.44 లక్షల కోట్లకు (100 బిలియన్‌ డాలర్లు= 10,000 కోట్ల డాలర్లు) చేరుకుంది. ఇప్పటివరకు దేశీయ స్టాక్‌ మార్కెట్లో 100 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను సాధించిన ఆరో సంస్థగా ఐసీఐసీఐ బ్యాంక్‌ నిలిచింది. ఐసీఐసీఐ కంటే ముందు ఈ మైలురాయికి చేరుకున్న కంపెనీల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌ ఉన్నాయి.


ఏడాది గరిష్ఠానికి అమర రాజా షేరు

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ లిమిటెడ్‌ షేరు మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో దాదాపు 20 శాతం ఎగబాకి రూ.1,655.20 వద్ద సరికొత్త ఏడాది గరిష్ఠాన్ని నమోదు చేసింది. బీఎస్‌ఈలో ట్రేడింగ్‌ నిలిచేసరికి, కంపెనీ షేరు ధర 19.40 శాతం లాభంతో రూ.1,647 వద్ద స్థిరపడింది. లిథియం అయాన్‌ సెల్స్‌ టెక్నాలజీ కోసం స్లొవేకియాకు చెందిన జీఐబీ ఎనర్జీతో అమర రాజా పూర్తి అనుబంధ విభాగమైన అమర రాజా అడ్వాన్స్‌డ్‌ సెల్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ లైసెన్సింగ్‌ అగ్రిమెంట్‌ను కుదుర్చుకోవడం షేర్ల ర్యాలీకి కారణమైంది. అంతేకాదు, ఈ ఏడాదిలో ఇప్పటివరకు అమర రాజా షేరు ధర రెట్టింపైంది.

2014లో 144 శాతం వృద్ధిని నమోదు చేసిన కంపెనీ షేరుకు ఆ తర్వాత ఇదే అత్యుత్తమ ప్రదర్శన.

Updated Date - Jun 26 , 2024 | 04:52 AM