Share News

సెన్సెక్స్‌ @: 81,000

ABN , Publish Date - Jul 19 , 2024 | 03:22 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ సరికొత్త శిఖరాలకు ఎగబాకాయి. సెన్సెక్స్‌ తొలిసారిగా 81,000 మైలురాయిని దాటగా.. నిఫ్టీ 24,800 స్థాయిని అధిగమించింది...

సెన్సెక్స్‌ @: 81,000

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ సరికొత్త శిఖరాలకు ఎగబాకాయి. సెన్సెక్స్‌ తొలిసారిగా 81,000 మైలురాయిని దాటగా.. నిఫ్టీ 24,800 స్థాయిని అధిగమించింది. ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లలో కొనుగోళ్లు ఇందుకు దోహదపడ్డాయి. గురువారం నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. 326 పాయింట్ల మేర క్షీణించి 80,390 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం నుంచి కొనుగోళ్లు పుంజుకోవడంతో సూచీ మళ్లీ లాభాల్లో పయనించి ఏకంగా 81,000 స్థాయిని దాటేసింది. ఒక దశలో 806 పాయింట్ల లాభంతో 81,522.55 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును నమోదు చేసింది. చివరికి సెన్సెక్స్‌ 626.91 పాయింట్ల లాభంతో 81,343.46 వద్ద స్థిరపడింది. సూచీకిది సరికొత్త జీవితకాల గరిష్ఠ ముగింపు కూడా. నిఫ్టీ సైతం ప్రారంభ నష్టాల నుంచి తేరుకుని ఒక దశలో 224.75 పాయింట్ల వృద్ధితో 24,837.75 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును, చివరికి 187.85 పాయింట్ల లాభంతో 24,800.85 వద్ద జీవితకాల గరిష్ఠ ముగింపును నమోదు చేసింది.


జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి దేశీయ ఐటీ దిగ్గజాలు అంచనాలకు మించిన పనితీరు కనబర్చడంతో పాటు రూపాయి మరింత క్షీణించడంతో ఈ రంగ షేర్లలో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరిపారని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.454.32 లక్షల కోట్లకు (5.43 లక్షల కోట్ల డాలర్లు) పరిమితమైంది.

Updated Date - Jul 19 , 2024 | 03:22 AM