77,000 ఎగువకి సెన్సెక్స్
ABN , Publish Date - Jun 19 , 2024 | 04:05 AM
దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు మంగళవారం సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. సెన్సెక్స్ తొలిసారిగా 77,000 ఎగువన ముగియగా.. నిఫ్టీ 23,500 మార్క్ ను దాటింది. ఇన్ఫోసిస్, విప్రోతో పాటు...
23,500 స్థాయిని దాటిన నిఫ్టీ
సరికొత్త గరిష్ఠాలకు సూచీలు
రూ.437 లక్షల కోట్లకు మార్కెట్ క్యాప్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు మంగళవారం సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. సెన్సెక్స్ తొలిసారిగా 77,000 ఎగువన ముగియగా.. నిఫ్టీ 23,500 మార్క్ ను దాటింది. ఇన్ఫోసిస్, విప్రోతో పాటు ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజ షేర్లలో కొనుగోళ్లు ఇందుకు దోహదపడ్డాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలూ సూచీల ర్యాలీకి కలిసివచ్చాయి. ఒక దశలో సెన్సెక్స్ 374 పాయింట్లు ఎగబాకి 77,366.77 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును తాకి చివరికి 308.37 పాయింట్ల లాభంతో 77,301.14 సరికొత్త గరిష్ఠ ముగింపును నమోదు చేసింది. నిఫ్టీ సైతం ఒకదశలో 113.45 పాయింట్ల వృద్ధితో 23,579.05 వద్ద సరికొత్త ఇంట్రాడే గరిష్ఠాన్ని, చివరికి 92.30 పాయింట్ల లాభంతో 23,557.90 వద్ద ఆల్‌టైం రికార్డు ముగింపును నమోదు చేసింది. అలాగే, ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ సైతం ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.437.24 లక్షల కోట్లకు చేరుకుంది. గడిచిన నాలుగు ట్రేడింగ్ సెషన్లలో మార్కెట్ సంపద రూ.10.29 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 22 లాభపడ్డాయి.
ఇక్సిగో షేర్ల బంపర్ లిస్టింగ్
తొలిరోజే 78 శాతం వృద్ధి
ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఇక్సిగో మాతృసంస్థ లే ట్రావెన్యూస్ టెక్నాలజీ లిమిటెడ్ మంగళవారం షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసింది. ఐపీఓ ధర రూ.93తో పోలిస్తే, ఎన్‌ఎ్‌సఈలో కంపెనీ షేరు 48.49 శాతం ప్రీమియంతో రూ.138.10 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో మరింత పుంజుకున్న షేరు.. తొలిరోజు ట్రేడింగ్ ముగిసేసరికి 78.19 శాతం లాభంతో రూ.165.72 వద్దకు చేరుకుంది. గత బుధవారంతో ముగిసిన లే ట్రావెన్యూస్ ఐపీఓకు ఇష్యూ సైజుతో పోలిస్తే 98.10 రెట్ల సబ్‌స్ర్కిప్షన్ లభించింది.
ఇండస్ టవర్స్‌లో 10% వాటా
విక్రయించనున్న వొడాఫోన్
మొబైల్ టవర్ల నిర్వహణ సంస్థ ఇండస్ టవర్స్‌లో దాదాపు 10 శాతం వాటాకు సమానమైన 26.8 కోట్ల ఈక్విటీ షేర్లను వొడాఫోన్ గ్రూప్ ఓపెన్ మార్కెట్లో బ్లాక్ డీల్ ద్వారా బుధవారం విక్రయించనుంది. తద్వారా వొడాఫోన్‌కు 110 కోట్ల డాలర్ల (రూ.9,185 కోట్లు) వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఇండస్ టవర్స్‌లో వొడాఫోన్ గ్రూప్ 21.5 శాతం వాటా కలిగి ఉంది.