Share News

షేర్‌.. బేజార్‌!

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:37 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు మంగళవారం భారీ పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 1,000 పాయింట్లకు పైగా క్షీణించినప్పటికీ, చివరికి 930.55 పాయింట్ల (1.15 శాతం) నష్టంతో...

షేర్‌.. బేజార్‌!

స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనం

  • సెన్సెక్స్‌ 930 పాయింట్లు డౌన్‌

  • 2 వారాల కనిష్ఠ స్థాయికి సూచీ

  • 24,500 దిగువకు జారిన నిఫ్టీ

  • రూ.9.19 లక్షల కోట్ల సంపద ఫట్‌

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు మంగళవారం భారీ పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 1,000 పాయింట్లకు పైగా క్షీణించినప్పటికీ, చివరికి 930.55 పాయింట్ల (1.15 శాతం) నష్టంతో 80,220.72 వద్ద స్థిరపడింది. ఆగస్టు 14 తర్వాత సూచీకిదే కనిష్ఠ ముగింపు స్థాయి. నిఫ్టీ 309 పాయింట్లు (1.25 శాతం) కోల్పోయి 24,472.10 వద్ద ముగిసింది. నిరాశాజనక త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఈక్విటీ మదుపరులు అన్ని రంగాల, విభాగాల షేర్లలో భారీగా అమ్మకాలకు పాల్పడటం ఇందుకు కారణమైంది. ఇందుకుతోడు, అమెరికాలో బాండ్ల రేట్ల పెరుగుతుండటం, చైనా వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మన ఈక్విటీల నుంచి మరిన్ని పెట్టుబడులను ఉపసంహరించడం మార్కెట్‌ను మరింత కుంగదీసింది.


అమ్మకాల హోరులో ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.9.19 లక్షల కోట్లు తగ్గి రూ.444.45 లక్షల కోట్లకు (5.29 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌ మినహా అన్నీ నష్టపోయాయి.

హ్యుండయ్‌..ప్చ్‌

తొలిరోజే 7.12 శాతం క్షీణించిన షేరు ధర

వాహన తయారీ సంస్థ హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) లిస్టింగ్‌ ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. మంగళవారం కంపెనీ తన షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసింది. ఐపీఓ ధర రూ.1960తో పోలిస్తే, బీఎ్‌సఈలో సంస్థ షేరు 1.47 శాతం తగ్గుదలతో రూ.1,931 వద్ద లిస్టయింది. ప్రారంభ ట్రేడింగ్‌లో కొద్దిగా తేరుకుని మళ్లీ 1,968.80 వద్దకు చేరిప్పటికీ, మళ్లీ భారీగా పతనమైంది. ఒక దశలో 7.80 శాతం క్షీణించి రూ.1,807.058 వద్దకు జారిన షేరు ధర.. తొలిరోజు ట్రేడింగ్‌ ముగిసేసరికి 7.12 శాతం నష్టంతో రూ.1,820.40 వద్ద స్థిరపడింది.


ఎన్‌ఎ్‌సఈలోనూ హ్యుండయ్‌ షేరు 7.16 శాతం నష్టంతో రూ.1,819.60 వద్ద క్లోజైంది. బీఎ్‌సఈలో 15.87 లక్షల షేర్లు ట్రేడవగా.. ఎన్‌ఎ్‌సఈలో 286.20 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ ఐపీఓ భారత మార్కెట్‌ పట్ల తమ కమిట్‌మెంట్‌కు నిదర్శనమని షేర్ల లిస్టింగ్‌ కార్యక్రమంలో హ్యుండయ్‌ మోటార్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ యుయిసున్‌ చంగ్‌ అన్నారు.

ఐదో అత్యంత విలువైన వాహన సంస్థ: తొలిరోజు ట్రేడింగ్‌ నిలిచేసరికి, హ్యుండయ్‌ మోటార్‌ మార్కెట్‌ విలువ (క్యాపిటలైజేషన్‌) దాదాపు రూ.1.48 లక్షల కోట్లకు చేరుకుంది. దాంతో దేశంలోనే ఐదో అత్యంత విలువైన వాహన కంపెనీగా హ్యుండయ్‌ అవతరించింది.

Updated Date - Oct 23 , 2024 | 12:37 AM