Share News

4 నెలల కనిష్ఠానికి మార్కెట్‌

ABN , Publish Date - Nov 14 , 2024 | 03:36 AM

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మళ్లీ కుప్పకూలాయి. బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 78,000 స్థాయుని కోల్పోగా.. నిఫ్టీ 23,500 స్థాయికి జారుకుంది. ధరల సూచీ 14 నెలల గరిష్ఠానికి ఎగబాకడంతోపాటు విదేశీ పోర్ట్‌ఫోలియో...

4 నెలల కనిష్ఠానికి మార్కెట్‌

సెన్సెక్స్‌ 984 పాయింట్లు డౌన్‌.. 23,500 స్థాయికి జారిన నిఫ్టీ.. 2రోజుల్లో 13 లక్షల కోట్ల నష్టం

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మళ్లీ కుప్పకూలాయి. బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 78,000 స్థాయుని కోల్పోగా.. నిఫ్టీ 23,500 స్థాయికి జారుకుంది. ధరల సూచీ 14 నెలల గరిష్ఠానికి ఎగబాకడంతోపాటు విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు పె ద్ద మొత్తంలో తరలిపోతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు బ్యాంకిం గ్‌, ఆటో, యంత్రపరికరాల రం గాల షేర్లలో అమ్మకాలను పోటెత్తించారు. దాంతో సెన్సెక్స్‌ ఒకదశలో 1,141.88 పాయింట్లు పతనమై 77,533.30 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 984.23 పాయింట్ల నష్టంతో 77,690.95 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ నష్టపోవడం వరుసగా ఇది రెండో రోజు. కాగా, నిఫ్టీ 324.40 పాయింట్లు క్షీణించి 23,559.05 వద్దకు జారుకుంది. సూచీ నష్టపోవడం వరుసగా ఐదో రోజు. జూన్‌ 24 తర్వాత రెండు సూచీలు ఇంత కనిష్ఠ స్థాయిల్లో ముగియడం ఇదే ప్రథమం. గత రెండు రోజుల్లో బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.13 లక్షల కోట్లకు పైగా పతనమై రూ.429.46 లక్షల కోట్లకు (5.09 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.


రూ.50 లక్షల కోట్లు పాయే..

గరిష్ఠాల నుంచి 10 శాతం దిగువకు సెన్సెక్స్‌, నిఫ్టీ కరెక్షన్‌ జోన్‌లోకి ప్రవేశించాయి. ఈ రెండు సూచీలు సెప్టెంబరులో నమోదు చేసి న సరికొత్త ఏడాది (52 వారాల) గరిష్ఠ స్థాయిల నుంచి దాదాపు 10 శాతం క్షీణించాయి. ఏదైనా కంపెనీ షేరు లేదా సూచీ ఏడాది గరిష్ఠం నుంచి పది శాతం పతనమైన పక్షంలో ఆ స్టాక్‌ లేదా ఇండెక్స్‌ కరెక్షన్‌ దశలోకి ప్రవేశించినట్లు భావిస్తారు. 20 శాతం క్షీణిస్తే బేర్‌ పూర్తిగా పట్టు బిగించినట్టే. ఈ సెప్టెంబరు 27న నమోదు చేసిన సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయి 85,978.25 పాయింట్లతో పోలిస్తే, సెన్సెక్స్‌ ఇప్పటివరకు 8,287.3 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ సైతం 26,277 వద్ద నమోదు చేసిన సరికొత్త ఏడాది గరిష్ఠం నుంచి ఇప్పటివరకు 2,718 పాయింట్లు పతనమైంది.


బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కూడా సెప్టెంబరు 27న నమోదైన ఆల్‌టైం గరిష్ఠ స్థాయి రూ.479.10 లక్షల కోట్ల నుంచి బుధవారం నాటికి రూ.429.46 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే, మార్కెట్‌ సంపద రూ.50 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది. ప్రామాణిక సూచీలు మున్ముందు మరింత దిద్దుబాటుకు లోనుకావచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. సూచీలు పది శాతం తగ్గినప్పటికీ, రూ.1,000 కోట్లకు పైగా మార్కెట్‌ విలువ కలిగిన 900కు పైగా కంపెనీల షేర్లు ఇప్పటికే 20 శాతానికి పైగా క్షీణించడంతో మార్కెట్‌ బేర్‌ పట్టులోకి జారుకుందన్న సంకేతాలొస్తున్నాయి. నిఫ్టీ ప్రస్తుత 23,500 స్థాయిని కూడా కోల్పోతే.. మున్ముందు 23,000 వద్దకు జారుకోవచ్చునంటున్నారు.

Updated Date - Nov 14 , 2024 | 03:36 AM