Share News

దాతృత్వంలో మేటి నాడార్‌

ABN , Publish Date - Nov 08 , 2024 | 06:20 AM

ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్‌ వ్యవస్థాపకులు శివ్‌ నాడార్‌.. భారత దాతల జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. గురువారం విడుదలైన ‘ఎడెల్‌గివ్‌-హురున్‌ ఇండియా ఫిలాంత్రఫీ లిస్ట్‌- 2024’ ప్రకారం..

దాతృత్వంలో మేటి నాడార్‌

  • రోజుకు 5.9 కోట్ల విరాళం జూ గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2,153 కోట్ల దానం

  • జాబిజాలో 18 మంది తెలుగు రాష్ట్రాల వారు

  • ఆ తర్వాత స్థానంలో అంబానీ

  • సీఎ్‌సఆర్‌లో రిలయన్స్‌ టాప్‌

  • ఎడెల్‌గివ్‌-హురున్‌ లిస్ట్‌ విడుదల

న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్‌ వ్యవస్థాపకులు శివ్‌ నాడార్‌.. భారత దాతల జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. గురువారం విడుదలైన ‘ఎడెల్‌గివ్‌-హురున్‌ ఇండియా ఫిలాంత్రఫీ లిస్ట్‌- 2024’ ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో నాడార్‌ మొత్తం రూ.2,153 కోట్ల విరాళాలిచ్చారు. అంటే, రోజుకు సగటున రూ.5.9 కోట్లు దానం చేశారు. శివ్‌ నాడార్‌ ఫౌండేషన్‌ సంస్థల ద్వారా నాడార్‌, ఆయన కుటుంబం విద్య, సాంకేతిక సంబంధిత కార్యక్రమాలకు అధికంగా సాయం చేశారు. ఎడెల్‌గివ్‌-హురున్‌ దాతల జాబితాలో నాడార్‌ అగ్రస్థానంలో నిలవడం గత ఐదేళ్లలో ఇది మూడోసారి. ఈ లిస్ట్‌లోని మరిన్ని ముఖ్యాంశాలు..

  • భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఫౌండేషన్‌ గత ఆర్థిక సంవత్సరంలో రూ.407 కోట్ల విరాళాలిచ్చింది. దాంతో అంబానీ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. రూ.352 కోట్ల విరాళాలతో బజాజ్‌ కుటుంబం మూడో స్థానంలో ఉంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా (రూ.334 కోట్లు), అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ (రూ.330 కోట్లు) టాప్‌-5లో చోటు దక్కించుకున్నారు.

  • ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు నందన్‌ నీలేకని (రూ.307 కోట్లు), తెలుగు తేజం కృష్ణ చివుకుల (రూ.228 కోట్లు), వేదాంత గ్రూప్‌ అధిపతి అనిల్‌ అగర్వాల్‌ (రూ.181 కోట్లు), సుస్మిత, సుబ్రతో బాగ్చీ (రూ.179 కోట్లు), రోహిణి నీలేకని (రూ.154 కోట్లు) టాప్‌ టెన్‌లోని మిగతా స్థానాల్లో నిలిచారు.

    Untitled-4 copy.jpg


  • జూదేశంలోని మహిళా దాతల్లో రోహిణి నీలేకని (నందన్‌ నీలేకని భార్య) అగ్రస్థానంలో ఉండగా.. సుస్మితా బాగ్చీ (రూ.90 కోట్లు), బయోకాన్‌ చైర్మన్‌ కిరణ్‌ మజుందార్‌ షా (రూ.85 కోట్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.

  • ఆన్‌లైన్‌ బ్రోకరేజీ సేవల సంస్థ జీరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌ (38 ఏళ్లు) దాతల జాబితాలో అత్యంత పిన్న వయస్కుడు, తన సోదరుడు నితిన్‌ కామత్‌తో కలిసి ఆయన రూ.120 కోట్ల విరాళాలిచ్చారు.

  • ఈ ఏడాది జాబితాలో మొత్తం 203 మందికి చోటు దక్కగా.. వారి మొత్తం విరాళాలు రూ.8,783 కోట్లుగా ఉన్నాయి. రెండేళ్ల క్రితంతో పోలిస్తే 55 శాతం అధికమిది. జాబితాలోని వ్యక్తుల్లో 18 మంది రూ.100 కోట్లకు పైగా దానం చేయగా.. 30 మంది రూ.50 కోట్లకు పైగా, 61 మంది రూ.20 కోట్లకు పైగా విరాళాలిచ్చారు.

  • కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్‌) కార్యక్రమాల కోసం అత్యధికంగా ఖర్చు చేసిన కంపెనీల జాబితాలో ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అగ్రస్థానంలో నిలిచింది. 2023 -24లో ఆర్‌ఐఎల్‌ ఇందుకోసం రూ.900 కోట్లు వెచ్చించింది. నవీన్‌ జిందాల్‌కు చెందిన జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ (రూ.228 కోట్లు) ఆ తర్వాత స్థానంలో ఉంది.

  • హురున్‌ దాతల జాబితాలో 18 మంది తెలుగువారికి చోటు దక్కిగా.. కృష్ణ చివుకుల అగ్రస్థానంలో ఉన్నారు. ఐఐటీ మద్రా స్‌కు ఈ ఏడాది రూ.228 కోట్లు విరాళంగా ఇచ్చారు. చివుకుల 1970లో ఐఐటీ మద్రాస్‌ నుంచే ఎం.టెక్‌ పూర్తి చేశారు. ఏపీలోని బాపట్లలో పుట్టి పెరిగిన చివుకుల ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. కాగా, మేఘా ఇంజనీరింగ్‌ (ఎంఈఐఎల్‌) ప్రమోటర్లు పీవీ కృష్ణా రెడ్డి, పీ పిచ్చి రెడ్డి ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.

Updated Date - Nov 08 , 2024 | 06:23 AM