Share News

వెండి.. బంగారమాయనే

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:34 AM

బులియన్‌ ధరలు మరింత ఎగబాకి సరికొత్త రికార్డు గరిష్ఠ స్థాయికి చేరాయి. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర మంగళవారం మరో రూ.350 పెరిగి రూ.81,000కు చేరుకుంది. కిలో వెండి ఏకంగా రూ.1,500 పెరుగదలతో...

వెండి.. బంగారమాయనే

  • రూ.లక్ష దాటిన కేజీ సిల్వర్‌ రేటు

  • తులం బంగారం ః రూ.81,000

న్యూఢిల్లీ: బులియన్‌ ధరలు మరింత ఎగబాకి సరికొత్త రికార్డు గరిష్ఠ స్థాయికి చేరాయి. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర మంగళవారం మరో రూ.350 పెరిగి రూ.81,000కు చేరుకుంది. కిలో వెండి ఏకంగా రూ.1,500 పెరుగదలతో రూ.1.01 లక్షలు పలికింది. వెండి రేటు పెరగడం వరుసగా ఇది ఐదో రోజు. అంతేకాదు, ఢిల్లీ మార్కెట్లో వెండి రూ.లక్ష మైలురాయిని చేరడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లోనూ వీటి ధరలు సరికొత్త జీవితకాల గరిష్ఠానికి పెరగడంతో పాటు పండగ సీజన్‌ నేపథ్యంలో ఆభరణ వర్తకులు, స్టాకిస్టులు బులియన్‌ కొనుగోళ్లు పెంచడం ఇందుకు కారణమని ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ ఒక దశలో 0.53 శాతం పెరుగుదలతో 2,753.30 డాలర్లు, సిల్వర్‌ 1.74 శాతం వృద్ధితో 34.675 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.


దేశమంతటా ఒకే రేటు: దేశవ్యాప్తంగా ఒకే బంగారం రేటును అమలు చేసేందుకు కృషిచేస్తున్నట్లు ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జువెలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ (జీజేసీ) వెల్లడించింది. ప్రస్తుతం రేటు నగరాన్ని బట్టి మారుతుంటుంది. మనం బంగారాన్ని ఒకే రేటుకు దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, విక్రయ ధర మాత్రం. నగరాన్ని బట్టి మారుతోంది. ఇకపై దేశమంతా ఒకే రేటును అమలు చేసేందుకు బులియన్‌ మార్కెట్‌ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు జీజేసీ కార్యదర్శి మితేశ్‌ ధోర్డ తెలిపారు.


రికార్డు ధరలతో పండగ గిరాకీకి గండి

బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరగడం పండగ సీజన్‌లో ఆభరణ విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని జువెలర్లు వాపోతున్నారు. ఈ ధనత్రయోదశి, దీపావళికి ఆభరణాలకు గిరాకీ గణనీయంగా తగ్గవచ్చని వారంటున్నారు. ధరలు పెరిగిన కారణంగా ఈసారి సేల్స్‌ విలువ పరంగా 12-15 శాతం పెరిగే అవకాశమున్నప్పటికీ, విక్రయాల పరిమాణం 10-12 శాతం వరకు తగ్గవచ్చని సెన్‌కో గోల్డ్‌ ఎండీ, సువంకర్‌ సేన్‌ అంచనా వేశారు.

Updated Date - Oct 23 , 2024 | 12:34 AM