Share News

రూ.లక్ష దాటిన వెండి

ABN , Publish Date - May 21 , 2024 | 02:04 AM

దేశీయంగా విలువైన లోహాల ధరలు మరింత ఎగబాకాయి. వెండి సరికొత్త జీవితకాల గరిష్ఠానికి చేరుకుంది. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం రేటు...

రూ.లక్ష దాటిన వెండి

హైదరాబాద్‌లో ఒక్కరోజే 4,500 పెరుగుదల.. సరికొత్త రికార్డు గరిష్ఠానికి కిలో ధర

10 గ్రాముల బంగారం రూ.75,000 ఎగువకు

హైదరాబాద్‌: దేశీయంగా విలువైన లోహాల ధరలు మరింత ఎగబాకాయి. వెండి సరికొత్త జీవితకాల గరిష్ఠానికి చేరుకుంది. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం రేటు సోమవారం మరో రూ.540 పెరిగి రూ.75,160కి చేరుకుంది. 22 క్యారె ట్ల స్వచ్ఛత లోహం రూ.500 పెరుగుదలతో రూ.68,900 కు అమ్ముడైంది. కాగా, కిలో వెండి ఏకంగా రూ.4,500 ఎగబాకి రూ.1,01,000 ధర పలికింది. అంతర్జాతీయంగానూ వీటి ధరలు సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరాయి. ఇంటర్నేషనల్‌ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ సెంటర్‌ (కామెక్స్‌)లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ ఒక దశలో 2,454 డాలర్లు, సిల్వర్‌ 32.75 డాలర్లకు ఎగబాకాయి. మున్ముందు వీటి ధరలు మరింత పెరిగేందుకే అధిక అవకాశాలున్నాయని బులియన్‌ విశ్లేషకులు అంటున్నారు. త్వరలోనే ఔన్స్‌ బంగారం 2,500-2,550 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చన్న అంచనాలున్నాయి.


కారణమేంటి..?

అమెరికాలో రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం అంచనాల కంటే తగ్గిన నేపథ్యంలో ఫెడ్‌ రేట్ల తగ్గింపు ప్రక్రియ త్వరలోనే (జూన్‌ లేదా సెప్టెంబరులో) ప్రారంభం కావచ్చని, ఈ ఏడాదిలో ఫెడరల్‌ రిజర్వ్‌ కనీసం రెండు సార్లు వడ్డీ రేట్లను తగ్గించవచ్చని మార్కెట్లో ఊహాగానాలు ఊపందుకోవడం బులియన్‌ ధరల ర్యాలీకి ప్రధాన కారణమైంది. మళ్లీ పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం ధరలకు ఆజ్యం పోస్తున్నాయి.


ఫెడ్‌ రేటు డౌన్‌.. గోల్డ్‌, సిల్వర్‌ అప్‌!

అమెరికాతో పాటు మిగతా దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లూ త్వరలో వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచనలో ఉన్నాయి. వచ్చే నెలలోనే వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ గవర్నర్‌ ఆండ్రూ బెయిలీ సంకేతాలిచ్చారు. స్వీడన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ కూడా వడ్డీ రేట్ల తగ్గింపును ప్రారంభించింది. సాధారణంగా ఫెడ్‌ రేట్లు-గోల్డ్‌ డిమాండ్‌ది విలోమ సంబం ధం. ఫెడ్‌ రేట్లు పెరుగుతున్న సమయంలో స్థిర ఆదాయాన్ని పంచే బాండ్లు, మార్కెట్‌ ఫండ్స్‌కు డిమాండ్‌ పెరుగుతుంది. దాంతో విలువైన లోహాల నుంచి పెట్టుబడులు వీటిలోకి మళ్లుతుంటాయి. కాగా, వడ్డీ రేట్లు తగ్గే సందర్భంలో బాండ్ల నుంచి పెట్టుబడులు విలువైన లోహాల్లోకి ప్రవహిస్తుంటాయి.

Updated Date - May 21 , 2024 | 02:04 AM