Share News

చిన్న షేరు.. తళుక్కు!

ABN , Publish Date - Dec 27 , 2024 | 01:25 AM

ఈ ఏడాదీ దలాల్‌ స్ట్రీట్‌లో చిన్న, మఽధ్య స్థాయి కంపెనీల షేర్లే తళుక్కుమన్నాయి. ప్రధాన కంపెనీల స్టాక్స్‌ కంటే ఆకర్షణీయ ప్రతిఫలాలు పంచాయి. మార్కెట్లో ఆశావహ ట్రెండ్‌తోపాటు రిటైల్‌ ఇన్వెస్టర్ల పాత్ర గణనీయంగా పెరగడం ఇందుకు...

చిన్న షేరు.. తళుక్కు!

ఈ ఏడాది 28.45ు పెరిగిన బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్‌ సూచీ

  • మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 25.61% అప్‌

  • వచ్చే ఏడాదీ కొనసాగనున్న జోరు!?

ఈ ఏడాదీ దలాల్‌ స్ట్రీట్‌లో చిన్న, మఽధ్య స్థాయి కంపెనీల షేర్లే తళుక్కుమన్నాయి. ప్రధాన కంపెనీల స్టాక్స్‌ కంటే ఆకర్షణీయ ప్రతిఫలాలు పంచాయి. మార్కెట్లో ఆశావహ ట్రెండ్‌తోపాటు రిటైల్‌ ఇన్వెస్టర్ల పాత్ర గణనీయంగా పెరగడం ఇందుకు దోహదపడింది. 2024లో ఈక్విటీ సూచీలు వరుస రికార్డుల మోత మోగించాయి. మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా, ముఖ్యంగా క్రమానుగత పెట్టుబడుల (సిప్‌) రూపంలో మార్కెట్లోకి ద్రవ్య ప్రవాహం భారీగా పెరగడంతోపాటు బలమైన ఆర్థిక మూలాలు, విధానపరమైన సానుకూలత తోడ్పడ్డాయని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రభుత్వ విధానపరమైన చర్యలు, సానుకూల పరిస్థితులతో లబ్ది పొందిన రియల్టీ, మౌలికం, హెల్త్‌కేర్‌, పునరుత్పాదక ఇంధనం రంగా లు మెరుగైన పనితీరు కనబరచడం ఈ ఏడాది స్మాల్‌, మిడ్‌క్యాప్‌ సూచీల వృద్ధికి ప్రధానంగా దోహదపడ్డాయని మాస్టర్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ ఆరోరా చోప్రా అన్నారు. దేశంలో వినియోగం పుంజుకోవడంతో పాటు సాంకేతిక పురోగతి, ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ) వంటి పథకాలతో చిన్న కంపెనీల పనితీరు మెరుగైందన్నారు.


వచ్చే ఏడాదిలోనూ స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ హవా కొనసాగనుందని వారు భావిస్తున్నారు. దేశీయంగా బలమైన వినియోగం, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం భారీగా వెచ్చిస్తుండటం ఇందుకు కలిసిరానున్నాయని వారు అభిప్రాయపడ్డారు. అయితే, స్మాల్‌, మిడ్‌క్యాప్‌ విభాగాల్లో ఇప్పటికే చాలా కంపెనీల షేర్లు అధిక ధరల వద్ద ట్రేడవుతుడటంతోపాటు కొన్ని రంగాల వృద్ధి మందగించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకర్షణీయ ధరకు లభిస్తున్న నాణ్యమైన స్టాక్స్‌ను ఎంచుకోవడం ద్వారా భవిష్యత్‌లో మెరుగైన ప్రతిఫలాలు అందుకునే వీలుంటుందన్నారు.


  • ఈ ఏడాదిలో ఇప్పటివరకు (ఈ నెల 23 నాటికి) బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీ 12,144.15 పాయింట్లు (28.45 శాతం) వృద్ధి చెందగా.. మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 9,435.09 పాయింట్లు (25.61 శాతం) ఎగబాకింది. కాగా, ప్రధాన కంపెనీల ప్రాతినిథ్య సూచీ బీఎ్‌సఈ సెన్సెక్స్‌ మాత్రం 6,299.91 పాయింట్లు (8.72 శాతం) పెరిగింది.

  • ఈ నెల 12న స్మాల్‌క్యాప్‌ సూచీ 57,827.69 పాయింట్ల వద్ద సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేయగా.. మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ సెప్టెంబరు 24న 49,701.15 వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని రికార్డు చేసింది. కాగా, సెన్సెక్స్‌ రికార్డు గరిష్ఠం సెప్టెంబరు 27న 85,978.25 వద్ద నమోదైంది.

  • 2023లో సెన్సెక్స్‌ 11,399.52 పాయింట్లు (18.73 శాతం) వృద్ధి చెందగా.. స్మాల్‌క్యాప్‌ సూచీ 13,746.97 పాయింట్లు (47.52 శాతం), మిడ్‌క్యాప్‌ 11,524.72 పాయింట్లు (45.52 శాతం) ఎగబాకాయి.

  • 2022లో మాత్రం స్మాల్‌క్యాప్‌ 1.80 శాతం, మిడ్‌క్యాప్‌ 1.37 శాతం వృద్ధికి పరిమితం కాగా.. సెన్సెక్స్‌ 4.44 శాతం పెరిగింది.


2025లో రూ.2 లక్షల కోట్ల పైనే!

ఐపీఓ ద్వారా నిధుల సమీకరణపై

పాంటోమత్‌ గ్రూప్‌ అంచనా

అత్యధిక కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూల (ఐపీఓ)కు వస్తున్న దేశాల్లో భారత్‌దే అగ్రస్థానం. ఈ ఏడాది అమెరికాతో పోలిస్తే రెండింతలు, యూరప్‌ కంటే 2.5 రెట్ల కంపెనీలు భారత్‌లో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చాయని పాంటోమత్‌ గ్రూప్‌ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఈ ఏడాదిలో నవంబరుతో ముగిసిన 11 నెలల్లో 76 కంపెనీలు ఐపీఓల ద్వారా మొత్తం రూ.1.3 లక్షల కోట్లు సమీకరించాయి. వచ్చే ఏడాది ఐపీఓ నిధుల సమీకరణ రూ.2 లక్షల కోట్ల మైలురాయిని దాటవచ్చని పాంటోమత్‌ గ్రూప్‌ అంచనా వేసింది. వచ్చే ఏడాదిలో ఆఫర్‌ను ప్రారంభించేందుకు వీలుగా 34 కంపెనీలు ఇప్పటికే సెబీ అనుమతి పొందాయని.. వాటి మొత్తం నిధుల సమీకరణ లక్ష్యం రూ.41,462 కోట్లుగా ఉందని రిపోర్టులో వెల్లడించింది. మరో రూ.98,672 కోట్ల విలువైన 55 కంపెనీల ఐపీఓలు సెబీ అనుమతి కోసం వేచి చూస్తున్నాయని.. వచ్చే ఏడాదిలో వీటికీ గ్రీన్‌సిగ్నల్‌ లభించే అవకాశాలున్నాయంది.

Updated Date - Dec 27 , 2024 | 01:25 AM