Share News

November 1: నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే

ABN , Publish Date - Oct 31 , 2024 | 04:18 PM

నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రజల రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే పలు కీలక మార్పులు ఆచరణలోకి రాబోతున్నాయి. వివిధ అంశాలతో ముడిపడిన ఈ మార్పులపై అవగాహన ఉండడం చాలా ముఖ్యం. మరి గురువారం నుంచి అమల్లోకి వస్తున్న ఈ కీలక మార్పులపై మీరు కూడా ఒక లుక్కేయండి.

November 1: నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే

ఆర్‌బీఐ డీఎంటీ రూల్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్ 1 నుంచి డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్‌కు (DMT) సంబంధించిన కొత్త రూల్‌ని ప్రవేశపెట్టింది. వివిధ ఫైనాన్సియల్ విభాగాలు ఆర్థిక చట్టాలకు మరింత కచ్చితంగా కట్టుబడి ఉండేలా, దేశీయ నగదు బదిలీల భద్రతను పెంచేలా ఆర్బీఐ ఈ రూల్స్‌ను రూపొందించింది. 24 జూలై 2024న విడుదల చేసిన సర్క్యూలర్ ప్రకారం.. బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ల లభ్యత మరింత పెరగుతుంది. అంతేకాదు మనీ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన చెల్లింపు వ్యవస్థలు మరింత మెరుగవుతాయి. కేవైసీ అవసరాలను మరింత సులభతరం చేయనుంది. ఈ కొత్త నిబంధనలపై ఆర్బీఐ ఇటీవలే సమీక్ష నిర్వహించింది.


ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు పెంపు..

నవంబర్ 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎస్‌బీఐ కార్డ్ తన వినియోగదారులపై ప్రభావం చూపేలా యుటిలిటీ బిల్లు చెల్లింపులు, ఫైనాన్స్ ఛార్జీల విషయంలో మార్పులు అమలు చేయబోతోంది. అన్‌సెక్యూర్డ్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లపై ఫైనాన్స్ ఛార్జీలు నెలకు 3.75 శాతానికి పెరుగుతాయి. ఇక బిల్లింగ్ పిరియడ్‌లో యుటిలిటీ చెల్లింపుల మొత్తం రూ.50,000 మించితే అదనంగా 1 శాతం ఛార్జి విధించనుంది. అయితే 1 శాతం అదనపు ఛార్జి వసూలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.


ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మార్పులు

ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫీజు విధానం, క్రెడిట్ కార్డ్ రివార్డ్ విధానంలో మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పులు బీమా, కిరాణా కొనుగోళ్లు, విమానాశ్రయ లాంజ్ యాక్సెస్, ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపులు, ఆలస్య చెల్లింపు రుసుము వంటి సేవలను ప్రభావితం చేస్తాయి. నవంబర్ 15 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. స్పా బెనిఫిట్స్ నిలిపివేత, రూ.1,00,000 కంటే ఎక్కువ ఖర్చులకు ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు తొలగింపు, ప్రభుత్వ లావాదేవీలపై రివార్డ్ పాయింట్‌లు తొలగింపుతో పాటు థర్డ్ పార్టీ మార్గాల ద్వారా విద్యా ఫీజులు చెల్లింపుపై 1 శాతం ఛార్జీలు విధింపు వంటి మార్పులు అమల్లోకి రానున్నాయి.


ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక ఎఫ్‌డీ గడువు

ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ నవంబర్ 30, 2024గా ఉంది. ఇండియన్ బ్యాంక్ ‘ఇండ్ సూపర్ 300 డేస్’ ప్రత్యేక ఎఫ్‌డీలో జనరల్ పబ్లిక్‌కు కూడా 7.05 శాతం వడ్డీ అందించనుంది. సీనియర్‌ సిటిజన్లకు 7.55 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 7.80 శాతం వడ్డీ అందించనున్నట్టు పేర్కొంది. ఇక 400 రోజుల ఎఫ్‌డీపై జనరల్ పబ్లిక్‌కు 7.25 శాం, సీనియర్‌ సిటిజన్‌లకు 7.75 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 8 శాతం వడ్డీ రేట్లను అందించనుంది.


రైలు టికెట్ అడ్వాన్స్ బుకింగ్ సమయం కుదింపు..

అడ్వాన్ రైలు టికెట్ బుకింగ్ కాలపరిమితిని తగ్గిస్తున్నట్లు భారతీయ రైల్వే ఇదివరకే ప్రకటించింది. గతంలో 120 రోజులుగా ఉన్న బుకింగ్ పీరియడ్‌ను 60 రోజులకు తగ్గించింది. దీంతో 2 నెలల ముందు మాత్రమే అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ కొత్త నిబంధన నవంబర్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులపై ఎలాంటి ప్రభావం ఉండదు.


ట్రాయ్ కొత్త రూల్

నవంబర్ 1 నుంచి టెలికం కంపెనీలు మెసేజ్ ట్రేసబిలిటీని అమలు చేయాల్సి ఉంటుంది. స్పామ్ మెసేజ్, వాటి ద్వారా జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ట్రాయ్ ఈ నిబంధనను అమలు చేయబోతోంది. మెసేజ్ అసలు ఎక్కడి నుంచి వచ్చించి, గుర్తింపు విషయంలో ప్రమాణాలు పాటించని మెసేజులను బ్లాక్ చేయడం వంటి పనులను టెలికం ఆపరేటర్లు చేయాలి.


ఎల్‌పీజీ సిలిండర్ ధరలు..

ప్రతి నెలా మొదటి తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ ధరలను సవరిస్తుంటాయి. కాబట్టి నవంబర్ 1న కూడా ఎల్‌పీజీ సిలిండర్లను సవరించి కొత్త రేట్లను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. పెట్రోలియం కంపెనీలు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాయో ఎదురుచూడాలి.

Updated Date - Oct 31 , 2024 | 04:18 PM