ఇంకా అనిశ్చితే..!
ABN , Publish Date - Nov 11 , 2024 | 02:48 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశాలున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవటం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించటం, క్రూడాయిల్ ధరల్లో మార్పులు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశాలున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవటం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించటం, క్రూడాయిల్ ధరల్లో మార్పులు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాలు సూచీల గమనంపై ప్రభావం చూపించే వీలుంది. ఈ వారం నిఫ్టీకి 24,100 వద్ద మద్దతు, 24.250 వద్ద నిరోధ స్థాయిలున్నాయి. గత వారం ఐటీ, పీఎ్‌సయూ బ్యాంకులు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటో రంగ షేర్లు కొంతమేరకు రాణించగా రియల్టీ, మీడియా, ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
స్టాక్ రికమండేషన్స్
మహీంద్రా అండ్ మహీంద్రా: జీవిత కాల గరిష్ఠం తర్వాత ఈ షేరు 17 శాతం మేర దిద్దుబాటు జరిగింది. కీలకమైన రూ.2,661 వద్ద మద్దతు లభించటంతో అక్కడి నుంచి అప్‌ట్రెండ్ మొదలైంది. తాజా త్రైమాసిక ఫలితాల అనంతరం మూమెంటమ్ పెరిగింది. గత శుక్రవారం ఈ షేరు 2.89 శాతం లాభంతో రూ.2,974 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లోకి రూ.2,960 స్థాయిలో పొజిషన్ తీసుకుని రూ.3,150/3,300 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు.
ఇండియన్ హోటల్స్: ప్రస్తుతం ఈ షేరు జీవితకాల గరిష్ఠ స్థాయిలో కదలాడుతోంది. సెప్టెంబరు త్రైమాసికంలో మెరుగైన ఈపీఎస్, అమ్మకాలు నమోదవటంతో మదుపరులు ఆసక్తి చూపిస్తున్నారు. నిఫ్టీతో పోలిస్తే మంచి పనితీరును కనబరుస్తోంది. గత శుక్రవారం 7.18 శాతం లాభంతో రూ.732 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లోకి మదుపరులు రూ.700 శ్రేణిలో ప్రవేశించి రూ.780/850 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు.
అశోక్ లేలాండ్: జీవిత కాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత 25 శాతం మేర పతనమైన ఈ కౌంటర్‌లో టర్న్ అరౌండ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబరు త్రైమాసికంలో మంచి ఫలితాలు సాధించటం, డివిడెండ్ ప్రకటించటంతో ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. గత శుక్రవారం ఈ షేరు 2.79 శాతం లాభంతో రూ.221.93 వద్ద క్లోజైంది. మూమెంటమ్ ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.210 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.270/290 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు.
మోతీలాల్ ఓస్వాల్: మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఈ షేరు జోరును ప్రదర్శిస్తోంది. జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో అక్యుములేషన్ జరుగుతోంది. ట్రేడింగ్, డెలివరీ వాల్యూమ్ భారీగా నమోదవుతోంది. గత శుక్రవారం ఈ షేరు 6.1 శాతం లాభంతో రూ.997 వద్ద ముగిసింది. మదుపరులు ఈ కౌంటర్‌లో రూ.960 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.1,050/1,250 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు..
పేటీఎం: ఈ కౌంటర్‌లో మే నెలలో మొదలైన బుల్‌రన్ ఇంకా కొనసాగుతోంది. నష్టాల మార్కెట్లో ఈ షేరు మెరుగ్గా రాణించింది. సెప్టెంబరు త్రైమాసికంలో ఈపీఎస్ 211 శాతం, సేల్స్ 11 శాతం పెరగటంతో మదుపరుల ఆసక్తి పెరిగింది. గత శుక్రవారం 6.62 శాతం లాభంతో రూ.848 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.825 వద్ద పొజిషన్ తీసుకుని రూ.990/1,050 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.