Share News

ఐపీఓకు స్విగ్గీ సిద్ధం!

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:41 AM

మరో ఫుడ్‌ డెలివరీ కంపెనీ ‘స్విగ్గీ’ ఐపీఓకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఈ వారమే సెబీకి దరఖాస్తు చేయబోతున్నట్టు సమాచారం. స్విగ్గీ ఈ ఐపీఓ ద్వారా 100 కోట్ల డాలర్లకు పైగా...

ఐపీఓకు స్విగ్గీ సిద్ధం!

ఈ వారమే సెబీకి దరఖాస్తు

రూ.8,400 కోట్లకు పైగా సమీకరణ

న్యూఢిల్లీ: మరో ఫుడ్‌ డెలివరీ కంపెనీ ‘స్విగ్గీ’ ఐపీఓకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఈ వారమే సెబీకి దరఖాస్తు చేయబోతున్నట్టు సమాచారం. స్విగ్గీ ఈ ఐపీఓ ద్వారా 100 కోట్ల డాలర్లకు పైగా (సుమారు రూ.8,400 కోట్లు) సమీకరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే స్విగ్గీ ఈ వార్తలపై నోరు మెదపడం లేదు. 2014లో ఏర్పాటైన ఈ ఫుడ్‌ డెలివరీ కంపెనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షన్నరకు పైగా రెస్టారెంట్లతో టై అప్‌ పెట్టుకుని భోజనప్రియుల ఆకలి తీరుస్తోంది. జొమాటో, అమెజాన్‌.కామ్‌ ఇండియా యూనిట్‌తో పాటు టాటా గ్రూప్‌ బిగ్‌ బాస్కెట్‌తో ప్రస్తుతం స్విగ్గీ పోటీపడుతోంది.


మరిన్ని ఐపీఓలు: సెకండరీ మార్కెట్‌ జోరుతో ప్రస్తుతం ప్రైమరీ మార్కెట్‌ కూడా మంచి జోరు మీద ఉంది. బజాజ్‌ హౌసింగ్‌తో సహా అనేక మంచి కంపెనీల ఐపీఓలు సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ అయ్యాయి. దీంతో ఈ సంవత్సరం ఇప్పటి వరకు కంపెనీలు ఐపీఓల ద్వారా దాదాపు 700 కోట్ల డాలర్ల (సుమారు రూ.58,500 కోట్లు) వరకు సమీకరించాయి. త్వరలో హ్యుండయ్‌ మోటార్‌ కంపెనీ, ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్‌ వంటి దిగ్గజాలు కూడా ఐపీఓలకు రానున్నాయి. ఇందులో ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్‌ ఒక్కటే రూ.12,500 కోట్ల ఐపీఓ జారీ చేస్తుందని సమాచారం. అయితే కొన్ని ఎస్‌ఎంఈల ఐపీఓలు మాత్రం ఈ బూమ్‌ను అడ్డుపెట్టుకుని మదుపరులకు కుచ్చుటోపీ పెడుతూ నిండా ముంచుతున్నాయి. వాటి వాల్యుయేషన్లకు వత్తాసు పలుకుతున్న మర్చంట్‌ బ్యాంకర్లకు కళ్లెం వేస్తే తప్ప, ఈ గూడు పుఠానీకి తెరపడదని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - Sep 16 , 2024 | 12:41 AM