Share News

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెరగనున్న పన్ను వసూళ్లు ఇప్పటికే

ABN , Publish Date - Dec 03 , 2024 | 05:45 AM

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఆదాయ పన్ను (ఐటీ) వసూళ్లు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తెలుగు రాష్ట్రాల నుంచి రూ.1.21 లక్షల కోట్ల ఆదాయ పన్ను వసూలు చేయాలని...

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెరగనున్న పన్ను వసూళ్లు ఇప్పటికే

రూ.59,000 కోట్ల వసూళ్లు

ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ మధుస్మిత

2024-25లో రూ.1.21 లక్షల కోట్ల లక్ష్యం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఆదాయ పన్ను (ఐటీ) వసూళ్లు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తెలుగు రాష్ట్రాల నుంచి రూ.1.21 లక్షల కోట్ల ఆదాయ పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ (ఏపీ అండ్‌ తెలంగాణ) మితాలి మధుస్మిత తెలిపారు. వివాదాల్లో ఉన్న పన్ను బకాయిల వసూలు కోసం ఐటీ శాఖ ప్రారంభించిన ‘వివాద్‌ సే విశ్వాస్‌ 2.0’ పథకంపై తెలంగాణ వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఎఫ్‌టీసీసీ) ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆమె ఈ విషయం వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో వసూలైన మొత్తంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీ, తెలంగాణ నుంచి ఆదాయ పన్ను వసూళ్లు 15 శాతం ఎక్కువగా ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. అయితే గత ఆర్థిక సంవత్సరం నమోదైన 22 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే ఇది తక్కువే. తెలంగాణలో వసూళ్లు బాగున్నా, ఏపీలో పన్ను వసూళ్ల వృద్ధి రేటు తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని మధుస్మిత తెలిపారు.


ఈ ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా నిర్ణయించిన రూ.1.21 లక్షల కోట్లలో ఇప్పటికే రూ.59,000 కోట్లు వసూలు చేసినట్టు వెల్లడించారు. మిగతా మొత్తం వసూళ్లలో పెద్ద సమస్యలేమీ ఉండక పోవచ్చన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు రూ.2 లక్షల కోట్ల పన్ను బకాయిల వసూళ్లు వివాదాల్లో ఉన్నట్టు ఆమె వెల్లడించారు. వివాద్‌ సే విశ్వాస్‌ పథకం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఈ వివాదాలు పరిష్కరించుకోవాలని సూచించారు.

Updated Date - Dec 03 , 2024 | 05:56 AM