టీసీఎస్ అదుర్స్
ABN , Publish Date - Apr 13 , 2024 | 02:44 AM
మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (క్యూ4) టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స (టీసీఎస్) ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను మించి నమోదయ్యాయి. కంపెనీ నికర లాభం...
లాభం రూ.12,434 కోట్లు
మార్కెట్ అంచనాలను మించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు
రూ.61,237 కోట్లకు పెరిగిన ఆదాయం
1,320 కోట్ల డాలర్ల విలువైన కొత్త ఆర్డర్లు
12.5%కి తగ్గిన ఉద్యోగుల వలసల రేటు
ఒక్కో షేరుకు రూ.28 తుది డివిడెండ్
ముంబై: మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (క్యూ4) టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స (టీసీఎస్) ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను మించి నమోదయ్యాయి. కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 9 శాతం వృద్ధితో రూ.12,434 కోట్లకు చేరుకుంది. సమీక్షా కాలానికి లాభాల మార్జిన్లు పుంజుకోవడంతో పాటు భారత మార్కెట్లో కంపెనీ బలమైన పనితీరు కనబర్చడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కంపెనీ నికర లాభం రూ.11,392 కోట్లుగా ఉంది. కాగా, ఈ క్యూ4లో టీసీఎస్ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 3.5 శాతం పెరిగి రూ.61,237 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికానికి గడించిన ఆదాయం రూ.60,583 కోట్లుగా ఉంది. మరిన్ని ముఖ్యాంశాలు..
గడిచిన మూడు నెలల్లో కంపెనీ నిర్వహణ లాభాల మార్జిన్ 1.50 శాతం పెరుగుదలతో 26 శాతానికి చేరుకుంది.
ఈ కాలానికి కొత్తగా 1,320 కోట్ల డాలర్ల విలువైన కొత్త ఆర్డర్లను దక్కించుకున్నట్లు టీసీఎస్ వెల్లడించింది. కంపెనీ త్రైమాసిక ఆర్డర్లలో ఇప్పటి వరకిదే అత్యధిక విలువ. గత ఆర్థిక సంవత్సరానికి మొత్తానికి లభించిన ఆర్డర్ల విలువ 4,270 కోట్ల డాలర్లుగా నమోదైంది.
2023-24 ఆర్థిక సంవత్సరం మొత్తానికి సంస్థ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 9 శాతం పెరిగి రూ.45,908 కోట్లకు ఎగబాకింది. ఆదాయం 6.8 శాతం వృద్ధితో రూ.2,40,893 కోట్లకు పెరిగింది.
బీఎస్‌ఎన్‌ఎల్‌తో రూ.15,000 కోట్లకు పైగా డీల్ కుదిరిన నేపథ్యంలో భారత మార్కెట్ వ్యాపార ఆదాయం 38 శాతం పెరిగింది. దాంతో కంపెనీ మొత్తం ఆదాయంలో భారత మార్కెట్ వాటా 6.7 శాతానికి పెరిగింది. 2022-23 క్యూ4లో ఈ వాటా 5 శాతంగా నమోదైంది.
కంపెనీకి అతిపెద్ద మార్కెట్ అయిన ఉత్తర అమెరికా ఆదాయం మాత్రం ఈ క్యూ4లో 2.3 శాతం తగ్గింది. దాంతో మొత్తం ఆదాయంలో ఈ మార్కెట్ వాటా 52.4 శాతం నుంచి 50 శాతానికి తగ్గింది.
జూ క్యూ4లో ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు మరింత తగ్గి 12.5 శాతానికి పరిమితమైనట్లు కంపెనీ తెలిపింది. క్యూ3లో ఇది 13.3 శాతంగా నమోదైంది.
బీఎస్‌ఈలో టీసీఎస్ షేరు ధర శుక్రవారం 0.45 శాతం పెరిగి రూ.4,000.30 వద్ద ముగిసింది.
గడిచిన త్రైమాసికానికి నమోదైన లాభాల మార్జిన్, కొత్త ఆర్డర్లు కంపెనీ వ్యాపార విధాన పటిష్ఠత, కార్యకలాపాల నిర్వహణ శ్రేష్ఠతను ధ్రువీకరిస్తుంది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో కంపెనీ సేవల పోర్టుఫోలియో, ఆవిష్కరణల సామర్థ్యం, ఆలోచనతో కూడిన నాయకత్వం ద్వారా మేం మా కస్టమర్లతో మరింత సన్నింతగా పనిచేయడంతో పాటు వారి కీలక ప్రాధాన్యాలను అమలు చేయడంలో తోడ్పడుతున్నాం.
కే కృతివాసన్,
టీసీఎస్ ఎండీ,సీఈఓ
వాటాదారులకు రూ.46,223 కోట్ల బొనాంజా
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.28 తుది డివిడెండ్ చెల్లించనున్నట్లు టీసీఎస్ ప్రకటించింది. త్వరలో నిర్వహించనున్న 29వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో వాటాదారుల ఆమోదం పొందిన తర్వాత డివిడెండ్ చెల్లించనున్నట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరానికి గాను టీసీఎస్ ఇప్పటికే రూ.45 మధ్యంతర డివిడెండ్ చెల్లించింది. తాజాగా ప్రకటించిన దానితో కలిపి మొత్తం డివిడెండ్ రూ.73కు చేరుకోనుంది. అంతేకాదు, 2023-24లో కంపెనీ రూ.17,000 కోట్ల విలువైన సొంత షేర్లను బహిరంగ మార్కెట్ నుంచి తిరిగి కొనుగోలు (బైబ్యాక్) చేసింది. అంటే, ఆర్థిక సంవత్సరం మొత్తానికి కంపెనీ తన వాటాదారులకు డివిడెండ్లు, బైబ్యాక్‌ల రూపంలో రూ.46,223 కోట్లు పంచింది.
19 ఏళ్లలో తొలిసారిగా తగ్గిన ఉద్యోగుల సంఖ్య
గడిచిన మూడు నెలల్లో టీసీఎ్‌సలో నికరంగా 1,759 మంది ఉద్యోగులు తగ్గారు. దాంతో మార్చి 31 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,01,546 మందికి పరిమితమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొత్తానికి కంపెనీలో ఉద్యోగులు 2022-23తో పోలిస్తే 13,249 మంది తగ్గారు. గడిచిన 19 ఏళ్లలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య తగ్గడం ఇదే తొలిసారి. 2022-23లో కంపెనీ ఉద్యోగుల నికర పెరుగుదల 22,600గా నమోదైంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలోనైతే కంపెనీ ఉద్యోగులు రికార్డు స్థాయిలో 1.03 లక్షల మంది పెరిగారు.
వేతన పెంపు 4.5-7 శాతం
ఈ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చేలా ఉద్యోగుల వేతనాలను వారి పనితీరు ఆధారంగా 4.5 శాతం నుంచి 7 శాతం వరకు పెంచినట్లు టీసీఎస్ తెలిపింది. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి జీతాన్ని రెండంకెల స్థాయిలో పెంచడం జరిగిందని కంపెనీ చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ వెల్లడించారు.
40,000 మంది ఫ్రెషర్ల నియామకం
ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ సేవల డిమాండ్ మళ్లీ పుంజుకోవచ్చని భావిస్తోన్న టీసీఎస్.. తొలి దశలో ఇప్పటికే 10,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకున్నట్లు తెలు స్తోంది. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 40,000 మంది ఫ్రెషర్లను నియమించు కోనున్నట్లు చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ (ఎన్‌క్యూటీ) ద్వారా ఫ్రెషర్ల నియామక ప్రక్రియను ప్రారంభించినట్లు గత నెలలో టీసీఎస్ ప్రకటించింది. ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు గడువు ఈ నెల 10తో ముగిసింది. 26న పరీక్ష నిర్వహించనున్నారు. టీసీఎస్ ఈ పరీక్ష ద్వారా మూడు విభాగాల (నింజా, డిజిటల్ , ప్రైమ్) కోసం ఫ్రెషర్ల నియామకాలు చేపడుతోంది.