టెక్ వ్యూ : మద్దతు స్థాయి 23,500 చేరువలో...
ABN , Publish Date - Dec 23 , 2024 | 12:56 AM
నిఫ్టీ గత వారం రియాక్షన్‌లో ప్రారంభమై అన్ని రోజులూ డౌన్‌ట్రెండ్‌లోనే ట్రేడవుతూ చివరికి సుమారు 1,200 పాయింట్ల నష్టంతో వారం కనిష్ఠ స్థాయి 23,580 వద్ద ముగిసింది. రెండేళ్ల కాలంలో...
టెక్ వ్యూ : మద్దతు స్థాయి 23,500 చేరువలో...
నిఫ్టీ గత వారం రియాక్షన్‌లో ప్రారంభమై అన్ని రోజులూ డౌన్‌ట్రెండ్‌లోనే ట్రేడవుతూ చివరికి సుమారు 1,200 పాయింట్ల నష్టంతో వారం కనిష్ఠ స్థాయి 23,580 వద్ద ముగిసింది. రెండేళ్ల కాలంలో ఒక వారంలో ఏర్పడిన అత్యధిక నష్టం ఇదే. మొత్తం మీద నిఫ్టీ గత రెండు వారాల్లో 2,600 పాయింట్ల మేరకు నష్టపోయింది. అమెరికన్ మార్కెట్లు రికార్డు స్థాయిలో వరుసగా పది రోజుల పాటు నష్టాలు నమోదు చేయడం కూడా భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. గత వారం మిడ్‌క్యాప్-100 సూచీ 2100 నష్టపోగా స్మాల్‌క్యాప్-100 సూచీ 690 పాయింట్లు నష్టపోయింది. టెక్నికల్‌గా మార్కెట్ కొద్ది కాలం క్రితం నమోదు చేసిన కనిష్ఠ స్థాయి 23,500 చేరువకు వస్తోంది. ఇదే గతంలో ఏర్పడిన మేజర్ బాటమ్. ఇక్కడి నుంచే మార్కెట్ తిరిగి అప్‌ట్రెండ్‌లో ప్రయాణం ప్రారంభించింది. గత శుక్రవారం నాటి ప్రపంచ మార్కెట్ల ధోరణిని బట్టి చూస్తే ఈ వారంలో రికవరీ ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మార్కెట్ గత వారం నిట్టనిలువుగా పడిపోయినందు వల్ల సానుకూలత కోసం తొలుత కన్సాలిడేట్ కావాలి.
బుల్లిష్ స్థాయిలు: మార్కెట్లో ఆటుపోట్లు తీవ్రంగా ఉన్నాయి. పాజిటివ్‌గా ప్రారంభమైనా భద్రత కోసం నిరోధ స్థాయి 23,850 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 24,000. మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ కావచ్చు.
బేరిష్ స్థాయిలు: బలహీనతను కొనసాగించినా ప్రధాన మద్దతు స్థాయి వద్ద కన్సాలిడేట్‌కు ఆస్కారం ఉంది. విఫలమైతే స్వల్పకాలిక బలహీనత ఏర్పడవచ్చు. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. దిగువన మద్దతు స్థాయిలు 23,350, 23,200, 23,000.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ గత వారం భారీ స్థాయిలో 2,800 పాయింట్లు నష్టపోయి 50,750 వద్ద ముగిసింది. గత ఆరు నెలలుగా జీవితకాల గరిష్ఠ స్థాయి 54,000 వద్ద విఫలమవుతూ వస్తోంది. ప్రస్తుతం ఇటీవల ఏర్పడిన కనిష్ఠ స్థాయి 50,000కి చేరువవుతోంది. రికవరీ బాట పడితే ట్రెండ్‌లో సానుకూలత కోసం ప్రధాన నిరోధం 51,400 కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం 52,000. మరింత బలహీనపడినా 50,000 వద్ద నిలదొక్కుకుని కన్సాలిడేట్ కావాలి.
పాటర్న్: గత వారం నిఫ్టీ 200 డిఎంఏ కన్నా స్వల్పంగా దిగజారింది. ఇప్పుడు స్వల్పకాలంలో అక్కడ పరీక్షకు గురి కావచ్చు. మార్కెట్‌కు 23,500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ వద్ద ప్రధాన మద్దతు ఉంది. సానుకూలత కోసం ఇక్కడ కన్సాలిడేట్ కావాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 23,800, 23,850
మద్దతు : 23,500, 23,430
వి. సుందర్ రాజా