భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మళ్లీ చైనా కంపెనీలదే హవా
ABN , Publish Date - May 12 , 2024 | 03:13 AM
కేంద్ర ప్రభుత్వం నిఘా కొనసాగుతున్నప్పటికీ దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా బ్రాండ్ల హవా మళ్లీ పెరుగుతోంది. 2020 నాటి గరిష్ఠ స్థాయి నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చిన చైనా కంపెనీల మొబైళ్ల అమ్మకాలు...
క్యూ1 విక్రయాల్లో 75% వాటా వీటిదే..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిఘా కొనసాగుతున్నప్పటికీ దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా బ్రాండ్ల హవా మళ్లీ పెరుగుతోంది. 2020 నాటి గరిష్ఠ స్థాయి నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చిన చైనా కంపెనీల మొబైళ్ల అమ్మకాలు ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో మళ్లీ పెరిగాయి. 2020లో మార్చితో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1)లో నమోదైన స్మార్ట్‌ఫోన్ సేల్స్‌లో షామీ, వివో, ఒప్పో, రియల్‌మీ, ట్రాన్షన్‌తో పాటు గతంలో చైనా కంపెనీ కొనుగోలు చేసిన మోటోరోలా బ్రాండ్ల మొత్తం వాటా 77 శాతంగా ఉండగా.. 2023 క్యూ3 (జూలై-సెప్టెంబరు) నాటికి 61 శాతానికి తగ్గింది. కానీ, ఈ ఏడాది క్యూ1లో మళ్లీ 75 శాతానికి పెరిగిందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది.
విక్రయాల విలువపరంగా తగ్గుముఖం..
స్మార్ట్‌ఫోన్ల విక్రయాల సంఖ్య పరంగా చైనా కంపెనీలదే మెజారిటీ వాటా అయినప్పటికీ, విక్రయాల విలువపరంగా వీటి వాటా మరింత తగ్గింది. 2020 క్యూ1లో నమోదైన ఫోన్ల విక్రయాల విలువలో చైనా బ్రాండ్ల వాటా 70 శాతంగా ఉండగా.. 2023 క్యూ1 నాటికి 50 శాతానికి తగ్గింది. 2024 క్యూ1లో 48 శాతానికి జారుకుంది. దేశీయ మార్కెట్లోనూ ప్రీమియమైజేషన్ (యాపిల్ ఐఫోన్, సామ్‌సంగ్ వంటి ఖరీదైన ఫోన్లకు గిరాకీ పెరుగుతుండటం) ట్రెండ్ ఊపందుకోవడం ఇందుకు కారణం.
క్యూ1 విక్రయాల్లో 5జీ ఫోన్లదే 70@ వాటా
ఈ ఏడాది క్యూ1లో దేశీయ మార్కెట్లోకి సరఫరా అయిన మోడళ్లలో 5జీ ఫోన్ల వాటా ఆల్‌టైం రికార్డు స్థాయి 71 శాతానికి పెరిగిందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లు భారీ డిస్కౌంట్లతో ఆకర్షిస్తున్నప్పటికీ, మొత్తం సరఫరాలో ఆఫ్‌లైన్ మార్కెట్ వాటానే 64 శాతమని పేర్కొంది. అంతేకాదు, ఈ జనవరి-మార్చి కాలానికి స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో 19.20 శాతం మార్కెట్ వాటాతో చైనా బ్రాండ్ వివో అగ్రస్థానానికి చేరుకుంది. మరో చైనా బ్రాండ్ షామీ 18.80 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో నిలవగా.. గత ఏడాది క్యూ1లో 20 శాతానికి పైగా మార్కెట్ షేర్‌తో టాప్ ప్లేస్‌లో ఉన్న దక్షిణ కొరియా కంపెనీ సామ్‌సంగ్.. ఈ క్యూ1లో 17.50 శాతం వాటాతో మూడో స్థానానికి పరిమితమైందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది.