పేటీఎంపై పునరాలోచన లేదు
ABN , Publish Date - Feb 13 , 2024 | 05:46 AM
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై (పీపీబీఎల్) తీసుకున్న చర్య విషయంలో పునఃసమీక్షించే అవకాశం లేనేలేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. అన్ని కోణాల నుంచి ఎంతో ఆలోచించిన...
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై (పీపీబీఎల్) తీసుకున్న చర్య విషయంలో పునఃసమీక్షించే అవకాశం లేనేలేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. అన్ని కోణాల నుంచి ఎంతో ఆలోచించిన తర్వాతనే ఆ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఆర్‌బీఐ ఏ ఫిన్‌టెక్ కంపెనీకి వ్యతిరేకం కాదని, ఆ రంగానికి మద్దతు ఇవ్వడంతో పాటు అది వేగంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన సహకారం అందిస్తుందని ఆయన అన్నారు. అదే సమయంలో డిపాజిటర్లు, కస్టమర్ల ప్రయోజనాలు కాపాడడం తమ ప్రధాన బాధ్యత అని దాస్ గుర్తు చేశారు. ఏ సంస్థ అయినా నియంత్రణలను పదేపదే ఉల్లంఘిస్తూ, ఎన్నిసార్లు హెచ్చరించినా తన వైఖరి మార్చుకోని సందర్భంలో మాత్రమే ఆర్‌బీఐ చర్యలకు పాల్పడుతుందని దాస్ స్పష్టం చేశారు. అన్ని కోణాల నుంచి పేటీఎం వ్యవహారాన్ని సమగ్రంగా పరిశీలించిన అనంతరం మాత్రమే తాము చర్య తీసుకున్నట్టు తెలిపారు. ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు 606వ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి పీపీబీఎల్ ఎలాంటి డిపాజిట్లు స్వీకరించరాదని, కస్టమర్ ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లలో టాప్ అ్‌పలు చేయరాదని ఆదేశిస్తూ గత నెల 31వ తేదీన ఆర్‌బీఐ నిషేధం విధించింది. పేటీఎంకు ఎన్నో సార్లు నిబంధనల ఉల్లంఘన విషయంలో హెచ్చరికలు చేశామని, అయినా అదే స్థితి కొనసాగుతూ ఉండడంతో చర్యకు పాల్పడక తప్పలేదని ఆ ప్రకటనలో స్పష్టంగా తెలియచేసింది. దీనిపై విలేకరుల ప్రశ్నలకు స్పందిస్తూ ఆ నిర్ణయానికి ఎలాంటి సడలింపులు ఇచ్చే అవకాశం ప్రస్తుతానికి లేదని అన్నారు.
త్వరలో ఎఫ్‌ఏక్యూల జారీ: తమ నిర్ణయం వల్ల అసౌకర్యానికి గురవుతున్న డిపాజిటర్లు, కస్టమర్లు, వ్యాలెట్ యూజర్లు, ఫాస్టాగ్ హోల్డర్లకు గల సందేహాలు తీర్చడం లక్ష్యంగా త్వరలో ఎఫ్‌ఏక్యూలు జారీ చేయనున్నట్టు దాస్ స్పష్టం చేశారు. కస్టమర్ల ప్రయోజనాలన్నింటినీ ఈ ఎఫ్‌ఏక్యూలలో పరిగణనలోకి తీసుకుంటామన్నారు. కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదన్నదే ఆర్‌బీఐ వైఖరి అని ఆయన చెప్పారు. అందుకే ఆ ఎఫ్‌ఏక్యూల్లో అన్ని రకాల వివరణలు ఉంటాయని ఆర్‌బీఐ గవర్నర్ దాస్ అన్నారు.