ఈ ఏడాది వృద్ధి 6.8 శాతం
ABN , Publish Date - Apr 17 , 2024 | 02:23 AM
అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) 2024 సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాను జనవరిలో ప్రకటించిన 6.5 శాతం నుంచి 6.8 శాతానికి పెంచింది...
అంచనాలు పెంచిన ఐఎంఎఫ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) 2024 సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాను జనవరిలో ప్రకటించిన 6.5 శాతం నుంచి 6.8 శాతానికి పెంచింది. వస్తు సేవలకు అంతర్గత డిమాండ్ బలంగా ఉండడంతో పాటు పనిచేసే వయసులోని జనాభా పెరగడం ఇందుకు కారణమని తాజా నివేదికలో తెలిపింది. ఈ వృద్ధి రేటుతో భారత్ ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని కూడా పేర్కొంది. చైనా వృద్ధి 4.6 శాతంగా అంచనా వేసింది. అయితే వర్థమాన ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి రేటు 2023 సంవత్సరంలోని 5.6 శాతం నుంచి ఈ ఏడాది 5.2 శాతానికి, 2025 నాటికి 4.9 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ప్రపంచ వృద్ధి కూడా 2023 నాటి 3.2 శాతం స్థాయిలోనే కొనసాగవచ్చని పేర్కొంది.