Share News

వాణిజ్య లోటు రికార్డు గరిష్ఠం

ABN , Publish Date - Dec 17 , 2024 | 01:17 AM

ఎగుమతుల రంగం మరోసారి నిరాశావహమైన పనితీరు ప్రదర్శించింది. అక్టోబరు నెలలో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్న ఈ రంగం నవంబరులో మరోసారి తిరోగమనం బాట పట్టింది...

వాణిజ్య లోటు  రికార్డు గరిష్ఠం

  • నవంబరులో రూ.3.21 లక్షల కోట్లకు..

  • ఎగుమతుల క్షీణత, దూసుకుపోయిన దిగుమతులే కారణం

  • పసిడి దిగుమతుల్లోనూ కొత్త రికార్డు

న్యూఢిల్లీ: ఎగుమతుల రంగం మరోసారి నిరాశావహమైన పనితీరు ప్రదర్శించింది. అక్టోబరు నెలలో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్న ఈ రంగం నవంబరులో మరోసారి తిరోగమనం బాట పట్టింది. కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం..నవంబరు నెలలో ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 4.85 శాతం తగ్గి 3,211 కోట్ల డాలర్లకు (రూ.2,72,646 కోట్లు) పడిపోయాయి. అదే సమయంలో దిగుమతులు 27 శాతం పెరిగి రికార్డు స్థాయి 6,995 కోట్ల డాలర్లకు (రూ.5,93,945 కోట్లు) చేరుకున్నా యి. ఫలితంగా వాణిజ్య లోటు ఆల్‌ టైం గరిష్ఠ స్థాయి 3,784 కోట్ల డాలర్లకు (రూ.3.21 లక్షల కోట్లు) పెరిగింది.


ఏప్రిల్‌-నవంబరు కాలానికి..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-నవంబరు కాలానికి ఎగుమతులు 2.17 శాతం వృద్ధితో 28,431 కోట్ల డాలర్లకు (రూ.24.14 లక్షల కోట్లు), దిగుమతులు 8.35 శాతం పెరుగుదలతో 48,673 కోట్ల డాలర్లకు (రూ.41.33 లక్షల కోట్లు) చేరాయి. వాణిజ్య లోటు 20,242 కోట్ల డాలర్లుగా నమోదైంది.

చమురు ధరల్లో హెచ్చుతగ్గుల వల్లే

ఎగుమతుల క్షీణత

ముడిచమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు మన ఎగుమతులపై ప్రభావం చూపాయని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ భరత్వాల్‌ అన్నారు. గత నెలలో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 50 శాతం తగ్గి 371 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయని ఆయన వెల్లడించారు. అంతేకాదు, గడిచిన 8 నెలల కాలానికి పెట్రో ఉత్పత్తుల ఎగుమతులు 19 శాతం తగ్గి 4,460 కోట్ల డాలర్లకు పడిపోయాయని ఆయన తెలిపారు. చమురేతర ఉత్పత్తుల ఎగుమతులు మాత్రం మంచి వృద్ధిని నమోదు చేయగలిగాయన్నారు. సేవల ఎగుమతులతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు 80,000 కోట్ల డాలర్లకు చేరవచ్చన్నారు. గత నెలలో సేవల ఎగుమతులు 3,567 కోట్ల డాలర్ల (రూ.3.03 లక్షల కోట్లు) స్థాయిలో జరిగి ఉండవచ్చని అంచనా. 2023 నవంబరులో సేవల ఎగుమతులు 2,811 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.


44-Bussss.jpg

బంగారం దిగుమతులు నాలుగింతలు

గత నెలలో పసిడి దిగుమతులు నాలుగింతలై (331ు) రికార్డు గరిష్ఠ స్థాయి 1,486 కోట్ల డాలర్లకు (రూ.1.26 లక్షల కోట్లు) చేరాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ డిమాండ్‌ నేపథ్యంలో బులియన్‌ స్టాకిస్టులు బంగారాన్ని భారీగా దిగుమతి చేసుకోవడం ఇందుకు కారణం. 2023 నవంబరులో గోల్డ్‌ దిగుమతులు కేవలం 344 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. కాగా, ఈ ఏప్రిల్‌-నవంబరు కాలానికి బంగారం దిగుమతులు వార్షిక ప్రాతిపదికన 49 శాతం వృద్ధితో 4,900 కోట్ల డాలర్లకు (రూ.4.16 లక్షల కోట్లు) చేరాయి.

Updated Date - Dec 17 , 2024 | 01:17 AM