Share News

రఘు వంశీ చేతికి యూకే కంపెనీ

ABN , Publish Date - Nov 12 , 2024 | 06:02 AM

వైమానిక, రక్షణ రంగ కంపెనీలకు కీలకమైన ప్రెషిసన్‌ ఇంజనీరింగ్‌ పరికరాలు సరఫరా చేసే రఘు వంశీ గ్రూప్‌ తన కార్యకలాపాలను...

రఘు వంశీ చేతికి యూకే కంపెనీ

పీఎంసీ గ్రూప్‌లో 100% వాటా కొనుగోలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వైమానిక, రక్షణ రంగ కంపెనీలకు కీలకమైన ప్రెషిసన్‌ ఇంజనీరింగ్‌ పరికరాలు సరఫరా చేసే రఘు వంశీ గ్రూప్‌ తన కార్యకలాపాలను బ్రిటన్‌కు విస్తరిస్తోంది. ఇందుకోసం బ్రిటన్‌ కేంద్రంగా పనిచేసే పీఎంసీ గ్రూప్‌ ఈక్విటీలో 100 శాతాన్ని కొనుగోలు చేసింది. ఇందుకు దాదాపు రూ.100 కోట్లు చెల్లించినట్టు సమాచారం. పీఎంసీ గ్రూప్‌ ప్రపంచంలోని మేటి ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీలకు అవసరమైన కీలక విడి భాగాలు తయారుచేసి సరఫరా చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీకి బ్రిటన్‌లో మూడు ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి. దాదాపు 100 మంది ఉద్యోగులతో గత ఏడాది రూ.180 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసింది.


వ్యూహాత్మక ముందడుగు

పీఎంసీ గ్రూప్‌ను కొనుగోలు చేయడం వ్యూహాత్మక ముందడుగు అని రఘు వంశీ గ్రూప్‌ తెలిపింది. ఇప్పటికే వైమానిక, రక్షణ రంగాల్లో పట్టున్న తమకు పీఎంసీ కొనుగోలు ద్వారా ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాల్లోనూ అంతర్జాతీయ మార్కెట్లో ముఖ్యంగా యూరోపియన్‌ మార్కెట్లో మరింత బలం పెంచుకునే అవకాశం ఏర్పడిందని రఘు వంశీ గ్రూప్‌ ఎండీ వంశీ వికాస్‌ చెప్పారు. ప్రస్తుతం రఘు వంశీ గ్రూప్‌ ఆదాయంలో 95 శాతం వైమానిక, రక్షణ రంగాల ద్వారా, ఐదు శాతం ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీలకు ప్రెషిసన్‌ పరికరాల సరఫరా ద్వారా సమకూరుతోంది. పీఎంసీ కొనుగోలుతో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ పరిశ్రమ వాటా వెంటనే 25 శాతానికి చేరుతుందని వికాస్‌ చెప్పారు.

Updated Date - Nov 12 , 2024 | 06:02 AM