ఎఫ్‌ఎంసీజీ వస్తువుల ధరలు సుర్రు?
ABN , Publish Date - Nov 04 , 2024 | 06:01 AM
వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువుల (ఎఫ్‌ఎంసీజీ) మార్కెట్ నీరసిస్తోంది. మొత్తం విక్రయాల్లో 65-68 శాతం వాటా ఉండే పట్టణ ప్రాంతాల్లో అమ్మకాలు సెప్టెంబరు త్రైమాసికంలో డీలా పడ్డాయి....
ద్రవ్యోల్బణం సెగ, పట్టణ మార్కెట్లు నిస్తేజం
తగ్గిన మార్జిన్లతో కంపెనీలు అతలాకుతలం
న్యూఢిల్లీ: వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువుల (ఎఫ్‌ఎంసీజీ) మార్కెట్ నీరసిస్తోంది. మొత్తం విక్రయాల్లో 65-68 శాతం వాటా ఉండే పట్టణ ప్రాంతాల్లో అమ్మకాలు సెప్టెంబరు త్రైమాసికంలో డీలా పడ్డాయి. మరోవైపు ఆహార వస్తువుల విభాగంలో ద్రవ్యోల్బణం సెగలు కక్కుతోంది. పామాయిల్, కాఫీ, కోకో వంటి ప్రధాన ముడి పదార్ధాల ధరలు కొండెక్కాయి. దీంతో రెండో త్రైమాసికంలో హెచ్‌యూఎల్, గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (జీసీపీఎల్), మారికో, ఐటీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (టీసీపీఎల్) వంటి ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెలన్నీ డీలా పడ్డాయి. కొన్ని ఎఫ్‌ఎంసీజీ కంపెనీల లాభాలకూ గండి పడింది. ఈ పరిస్థితి నుంచి కొద్దిగానైనా కోలుకునేందుకు ఽస్వల్ప స్థాయిలోనైనా ధరలు పెంచే అవకాశం ఉందని కంపెనీలు సూచనప్రాయంగా తెలియజేస్తున్నాయి.
‘మేము దీన్ని స్వల్పకాలిక ప్రతికూలతగా భావిస్తున్నాం. ధరలు స్థిరీకరించడం, స్వల్ప స్థాయిలో ధరలు పెంచడం ద్వారా ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చని భావిస్తున్నాం’ అని జీసీపీఎల్ ఎండీ, సీఈఓ సుధీర్ సీతాపతి ఇటీవల కంపెనీ క్యూ2 ఆర్థిక ఫలితాలు వెల్లడిస్తూ చెప్పారు.
గ్రామీణ డిమాండూ అంతంతే : ప్రస్తుతం పట్టణ ప్రాంత డిమాండ్‌తో పోలిస్తే గ్రామీణ డిమాండ్ కొద్దిగా మెరుగ్గానే ఉంది. అయితే ఇది కూడా ఆశించిన స్థాయిలో మాత్రం లేదు. ప్రాంతం ఏదైనా ప్రస్తుతం ప్రీమియం/ఈ-కామర్స్ ఉత్పత్తులు జోరుగా అమ్ముడవుతున్నాయి. అధిక వాటా గల మాస్ ఉత్పత్తుల అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నట్టు ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆహార ద్రవ్యోల్బణం, పట్టణ ప్రాంత డిమాండ్ పడకేయడం క్యూ2లో తాము ఎదుర్కొన్న పెద్ద సవాల్ అని డాబర్ ఇండియా తెలిపింది. దీంతో డాబర్ కంపెనీకి చెందిన చవన్‌ప్రాశ్, పుదీనాహర, రియల్ జ్యూస్ అమ్మకాలు క్యూ2లో 17.65 శాతం పడిపోయాయి. మరో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియాదీ ఇదే పరిస్థితి. క్యూ2లో ఈ కంపెనీకి చెందిన ఆహార, పానీయాల విభాగం అమ్మకాల వృద్ధిరేటు సింగిల్ డిజిట్‌కు పడిపోయినట్టు కంపెనీ సీఎండీ సురేశ్ నారాయణన్ చెప్పారు. ముడి పదార్ధాల ధరల పెరుగుదల, పట్టణ ప్రాంత డిమాండ్ పడకయేయడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఎడతెగని వర్షాలు కూడా సెప్టెంబరు త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ కంపెనీల అమ్మకాలను దెబ్బతీశాయి.
సిమెంట్‌దీ అదే పరిస్థితి: సిమెంట్ కంపెనీల పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదు. ధరలు తక్కువగా ఉండడం, అమ్మకాలు పడిపోడం ఇందుకు ప్రధాన కారణం. దీంతో క్యూ2లో కంపెనీల అమ్మకాలు, లాభాలకూ గండి పడింది. అలా్ట్రటెక్, అంబుజా సిమెంట్ కంపెనీల అమ్మకాలు మాత్రమే కొద్దిగా పెరిగాయి. ఇది కూడా వేరే కంపెనీల కొనుగోళ్ల పుణ్యమే తప్ప, మరోటి కాదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. నైరుతీ రుతుపవనాలతో ఎక్కువ రోజులు వర్షాలు కొనసాగడం, దేశంలోని కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తడం, ప్రభుత్వ శాఖల నుంచి డిమాండ్ పెరుగుదలతో మందకొడితనం ఇందుకు ప్రధాన కారణం. ఇదే సమయంలో విద్యుత్, ఇంధన, ఇతర ఖర్చులు పెరిగిపోవడం సిమెంట్ కంపెనీలను మరింత కుంగదీసింది. ఈ ఏడాది జూన్‌లో రూ.348 వరకు ఉన్న 50 కిలోల బస్తా సిమెంట్ ధర సెప్టెంబరులో రూ.330కి పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఇది రూ.35 నుంచి రూ.45 తక్కువ. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు కొన్ని కంపెనీలు గత నెల మొదటి వారంలో ధరలు కొద్దిగా పెంచాయి. అయితే కొన్ని కంపెనీలు కలిసి రాకపోవడంతో ఆ ప్రయత్నం పెద్దగా విజయవంతం కాలేదు. ధరలతో పాటు అమ్మకాలు కూడా తగ్గడంతో కంపెనీల ఉత్పత్తి సామర్ధ్య వినియోగమూ పడిపోయింది.
నవంబరులోనూ పండగ ఆఫర్లు : మారుతీ
నవంబరు నెలలో కూడా తమ కార్లపై పండగల ఆఫర్లు కొనసాగుతాయని మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ తెలిపింది. ఈ నెల దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో పెళ్లిళ్లుండడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. పండగల సీజన్ కలిసి రావడంతో గత నెల కంపెనీ రికార్ఢు స్థాయిలో 2,02,402 వాహనాలు విక్రయించింది. ఈ నెల పెద్ద ఎత్తున జరిగే పెళ్లిళ్లు భారీ అమ్మకాలకు దోహదం చేస్తాయని భావిస్తున్నట్టు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) పార్థో బెనర్జీ చెప్పారు. అయితే ఈ పెళ్లిళ్ల సీజన్ ఆఫర్లు ప్రాంతాన్ని బట్టి మారతాయని తెలిపారు.