Share News

2027 నాటికి మస్క్‌ ట్రిలియనీర్‌?

ABN , Publish Date - Sep 10 , 2024 | 02:59 AM

కుబేరుల సంపద మరింత పెరిగి పోతోంది. విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లా, స్పేస్‌ఎక్స్‌ల అధినేత ఎలాన్‌ మస్క్‌ సంపద 2027 నాటికి లక్ష కోట్ల డాలర్లకు చేరనుంది. ఇదే జరిగితే ప్రపంచ చరిత్రలో తొలి ట్రిలియనీర్‌గా (లక్ష కోట్ల డాలర్లు) మస్క్‌ రికార్డు సృష్టిస్తారు. ప్రస్తుత డాలర్‌-రూపాయి మారకం...

2027 నాటికి మస్క్‌  ట్రిలియనీర్‌?

ప్రపంచంలో ఆ ఘనత సాధించనున్న తొలి వ్యక్తి

2028 నాటికి అదానీ, 2033 నాటికి అంబానీ

న్యూఢిల్లీ: కుబేరుల సంపద మరింత పెరిగి పోతోంది. విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లా, స్పేస్‌ఎక్స్‌ల అధినేత ఎలాన్‌ మస్క్‌ సంపద 2027 నాటికి లక్ష కోట్ల డాలర్లకు చేరనుంది. ఇదే జరిగితే ప్రపంచ చరిత్రలో తొలి ట్రిలియనీర్‌గా (లక్ష కోట్ల డాలర్లు) మస్క్‌ రికార్డు సృష్టిస్తారు. ప్రస్తుత డాలర్‌-రూపాయి మారకం రేటు ప్రకారం ఆయన సంపద విలువ రూ.83.96 లక్షల కోట్లకు సమానం. అయితే ఇందుకోసం మస్క్‌ సంపద 2027 వరకు ఏటా సగటున 110 శాతం చొప్పున పెరగాల్సి ఉంటుందని ‘ఇన్ఫార్మా కనెక్ట్‌ అకాడమీ’ ఒక నివేదికలో తెలిపింది. మస్క్‌ ఇప్పటికే 23,700 కోట్ల డాలర్ల (సుమారు రూ.19.89 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు.


అదే రేసులో అదానీ, అంబానీ

మన దేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు గౌతం అదానీ, ముకేశ్‌ అంబానీ కూడా ఈ స్థాయికి చేరేందుకు పోటీపడుతున్నారు. గౌతం అదానీ 2028 నాటికి, ముకేశ్‌ అంబానీ 2033 నాటికి ఈ స్థాయికి చేరే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా. అయితే ఇందుకోసం అదానీ సంపద ఏటా ప్రస్తుత వృద్ధిరేటు 123 శాతం చొప్పున పెరగాల్సి ఉంటుంది. గౌతం అదానీ ప్రస్తుతం 10,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.8.39 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచ కుబేరుల్లో 13వ స్థానంలో ఉన్నారు. ముకేశ్‌ అంబానీ 11,100 కోట్ల డాలర్ల (సుమారు రూ.9.32 లక్షల కోట్లు) సంపదతో ప్రస్తుతం ఆసియాలో అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. ఇక 2035 కల్లా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ షేర్ల మార్కెట్‌ విలువ (మార్కెట్‌ క్యాప్‌) కూడా లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరి, ఆ స్థాయికి చేరిన తొలి బారత కంపెనీగా రికార్డు సృష్టించనుందని తెలిపింది.


రేస్‌లోని ఇతరులు

ఎలాన్‌ మస్క్‌, గౌతంఅదానీ, ముకేశ్‌ అంబానీలతో పాటు మరికొంత మంది ప్రపంచ పారిశ్రామికవేత్తలు కూడా వెనకా ముందుగా ట్రిలియనీర్ల జాబితాలో చేరే అవకాశం ఉందని ‘ఇన్ఫార్మా కనెక్ట్‌ అకాడమీ’ తెలిపింది. అమెరికా టెక్‌ దిగ్గజం ఎన్‌విడియా అధినేత జెన్సెన్‌ హువాంగ్‌, ఇండోనేషియా పారిశ్రామికవేత్త ప్రజోగో పంగెస్తు, ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త బెర్నార్డ్‌ అర్నాల్ట్‌, ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్క్‌ కూడా ఈ జాబితాలో చేరే అవకాశం ఉందని పేర్కొంది.

Updated Date - Sep 10 , 2024 | 02:59 AM