విప్రో బోనస్ బొనాంజా
ABN , Publish Date - Oct 18 , 2024 | 01:37 AM
దేశీయ ఐటీ సేవల కంపెనీ విప్రో బోనస్ షేర్ల బొనాంజా ప్రకటించింది. అమెరికన్ డిపాజిటరీ షేర్స్ (ఏడీఎస్) హోల్డర్లు సహా కంపెనీ వాటాదారులందరికీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు జారీ చేయాలని....
వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీ
దాదాపు 22 లక్షల మంది చిన్న షేర్‌హోల్డర్లకు లబ్ధి
సెప్టెంబరు త్రైమాసిక లాభంలో 21 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశీయ ఐటీ సేవల కంపెనీ విప్రో బోనస్ షేర్ల బొనాంజా ప్రకటించింది. అమెరికన్ డిపాజిటరీ షేర్స్ (ఏడీఎస్) హోల్డర్లు సహా కంపెనీ వాటాదారులందరికీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు జారీ చేయాలని విప్రో బోర్డు సిఫారసు చేసింది. అంటే.. వాటాదారు కలిగిన ప్రతి ఒక్క విప్రో షేరుకు గాను మరో షేరు బోన్‌సగా లభించనుంది. ఈ సెప్టెంబరు 30 నాటికి ఉన్న ఉచిత రిజర్వ్ లేదా సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ లేదా కంపెనీ క్యాపిటల్ రిడంప్షన్ రిజర్వ్ అకౌంట్ నుంచి బోనస్ ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ సమాచారం అందించింది. అయితే, ఈ ప్రతిపాదనను షేర్‌హోల్డర్లు ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కంపెనీ బోనస్ షేర్ల జారీకి అర్హులైన వాటాదారులను గుర్తించేందుకు రికార్డు తేదీని ప్రకటిస్తుంది.
ఈ డిసెంబరు 15 నాటికి కంపెనీ అర్హులైన వాటాదారులకు కేటాయించవచ్చని అంచనా. విప్రో బోనస్ షేర్ల జారీ రిటైల్ షేర్‌హోల్డర్లకు శుభవార్తే. ఈ సెప్టెంబరు 30 నాటికి విప్రో షేర్లు కలిగిన చిన్న షేర్‌హోల్డర్ల సంఖ్య దాదాపు 22 లక్షల స్థాయిలో ఉంది. విప్రో బోనస్ షేర్లు జారీ చేయడం 2019 తర్వాత ఇదే తొలిసారి. అలాగే, కంపెనీ చరిత్రలో ఇది 14వ సారి. గురువారం బీఎ్‌సఈలో కంపెనీ షేరు 0.65 శాతం నష్టపోయి రూ.528.80 వద్ద ముగిసింది.
ఆఫర్ లెటర్లు ఇచ్చినవారందరికీ ఉద్యోగం
గతంలో ఆఫర్ లెటర్లు జారీ చేసిన ఫ్రెషర్లందరినీ ఈ ఏడాది చివరినాటికల్లా ఉద్యోగంలో చేర్చుకుంటామని విప్రో చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ స్పష్టం చేశారు. ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాలను 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు వాయిదా వేస్తూ వస్తున్నాయంటూ ఈ మధ్య వార్తలు వచ్చిన నేపథ్యంలో గోవిల్ వివరణ ఇచ్చారు.
‘‘ఈ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1) నుంచి ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకుంటున్నాం. క్యూ1, క్యూ2లో 2,500- 3,000 మంది చొప్పున కంపెనీలో చేర్చుకోవడం జరిగిందని’’ గోవిల్ అన్నారు. కాగా, సెప్టెంబరు 30 నాటికి కంపెనీలో మొత్తం 2,33,889 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
లాభం రూ.3,209 కోట్లు
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో విప్రో లాభం వార్షిక ప్రాతిపదికన 21.2 శాతం వృద్ధి చెంది రూ.3,208.8 కోట్లకు చేరుకుంది. ఆదాయం మాత్రం 0.95 శాతం తగ్గి రూ.22,301.6 కోట్లకు పరిమితమైంది. అయితే, డిసెంబరుతో ముగియనున్న త్రైమాసికానికి స్థిర కరెన్సీ ఆదాయ వృద్ధి అంచనాను మైనస్ 1-ప్లస్ 1 శాతం స్థాయి నుంచి మైనస్ 2 నుంచి సున్నా శాతానికి తగ్గించింది.