Bengaluru: మహిళ శరీరాన్ని 30 ముక్కలు చేసి.. వెలుగులోకి దారుణాతి దారుణ ఘటన
ABN , Publish Date - Sep 22 , 2024 | 12:37 PM
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రద్ధా వాకర్ హత్య తరహాలో జరిగిన ఈ నేరం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. వయాలికావల్ ప్రాంతంలో ఓ మహిళను హత్య చేసి శరీరాన్ని ఏకంగా 30 ముక్కలుగా ఖంచించి రిఫ్రిజిరేటర్లో దాచిపెట్టారు. ఈ షాకింగ్ ఘటన గురువారం వెలుగుచూసింది.
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. 2022లో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య తరహాలో జరిగిన ఈ హత్య ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. నగరంలోని వయాలికావల్ ప్రాంతంలో ఓ మహిళను హత్య చేసి శరీరాన్ని ఏకంగా 30 ముక్కలుగా ఖంచించి రిఫ్రిజిరేటర్లో దాచిపెట్టారు. ఈ షాకింగ్ ఘటన గురువారం వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులు తాజాగా వెల్లడించారు. వీరనాభవన్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. హత్యకు గురైన మహిళ పేరు మహాలక్ష్మి అని, ఆమె వయసు 29 సంవత్సరాలు అని సెంట్రల్ బెంగళూరు డిప్యూటీ కమిషనర్ శేఖర్ టెక్కన్నవర్ వెల్లడించారు.
మహాలక్ష్మి మృతదేహాన్ని 30 ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్లో దాచి పెట్టారని అధికారి వివరించారు. హత్య జరిగిన సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో బాధితురాలు ఒంటరిగా నివాసం ఉండేదని, దర్యాప్తులో భాగంగా ఘటనా స్థలం వైపు దారిని బ్లాక్ చేశామని. వివరాలు సేకరిస్తున్నట్టు వివరించారు. కాగా ఈ హత్య వారం రోజుల క్రితం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నామని, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేస్తున్నట్టు సతీష్ కుమార్ అనే పోలీసు వివరించారు.
కాగా హత్యకు గురైన మహిళ తన భర్తకు దూరంగా జీవిస్తోందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ తర్వాత మరింత సమాచారం చెబుతామని ఆయన వెల్లడించారు. చనిపోయిన మహిళ వేరే రాష్ట్రానికి చెందినవారని, ఆమె కర్ణాటకలో స్థిరపడ్డారని పేర్కొన్నారు. ఒంటరిగా నివసిస్తూ ఓ మాల్లో పనిచేస్తోందని, ఆమె భర్త నగరానికి దూరంగా ఉన్న ఒక ఆశ్రమంలో పనిచేసేవారని, విషయం తెలుసుకున్న అతడు కూడా ఘటనా స్థలానికి వచ్చాడని వివరించారు.
కాగా 2022 మే 18న ఢిల్లీలో వెలుగుచూసిన శ్రద్ధా వాకర్ హత్య తరహాలోనే ఈ హత్యోదంతం వెలుగుచూసింది. శ్రద్ధా వాకర్‌ను ఆమె లివ్- ఇన్ పార్ట్నర్ ఆఫ్తాబ్ పూనావాలా దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి 300 లీటర్ల కెపాసిటీ ఉన్న ఫ్రిజ్‌లో దాదాపు మూడు వారాల పాటు దాచి పెట్టాడు. శరీర భాగాలను ఒక్కొక్కటిగా నగరంలో పలు చోట్ల పడేశాడు.
ఇవి కూడా చదవండి
సీఎం చంద్రబాబును కలిసిన టీటీడీ ఈవో
ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్.. కీలక వ్యాఖ్యలు