Share News

తక్కువ వడ్డీకి రుణాల పేరుతో మోసం

ABN , Publish Date - Oct 07 , 2024 | 11:49 PM

బ్యాంకు అధికారులుగా చలామణి అవుతూ తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని రైతులు, వ్యాపారులను మోసం చేస్తోన్న ఏడుగురిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.

తక్కువ వడ్డీకి రుణాల పేరుతో మోసం
నిందితుల వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌

నల్లగొండ క్రైం, అక్టోబరు 7: బ్యాంకు అధికారులుగా చలామణి అవుతూ తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని రైతులు, వ్యాపారులను మోసం చేస్తోన్న ఏడుగురిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రూ.1.65లక్షల నగదు, పలువురు రైతుల పట్టాదారు పాస్‌పుస్తకాలు, అగ్రిమెంట్‌ డాక్యుమెంట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నల్లగొండ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ ముఠా సభ్యుల వివరాలు వెల్లడించారు.

వ్యవసాయం చేస్తూ నకిలీ ఫీల్డ్‌ ఆఫీసర్‌గా అవతారమెత్తి..

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే షేక్‌ నజీర్‌కు పెద్దవూర మండలం వెలుగూడెంకు చెందిన కట్టెబోయిన పరమేష్‌, మిర్యాలగూడ మండలానికి చెందిన రాజేశ్‌., మాడ్గులపల్లి మండలం చిరుమర్తికి చెందిన కొండా శ్రీను, మిర్యాలగూడ బాపూజీనగర్‌కు చెందిన గోగుల సురేష్‌, మిర్యాలగూడ మండలం జప్తీవీరప్పగూడేనికి చెందిన చిలుముల సైదులు, పెద్దవూర మండలం తెప్పలమడుగుకు చెందిన పల్లెబోయిన నాగరాజు, నార్కట్‌పల్లి మండలం అంబేడ్కర్‌ కాలనీకి చెందిన ముప్పిడి సైదులు పరిచయమయ్యారు. వీరు ఆయా బ్యాంకుల్లో ఫీల్డ్‌ ఎంక్వైరీ అధికారులమని నమ్మించి రైతులు, వ్యాపారస్తుల వద్దకు వెళ్లి తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయిస్తామని చెప్పేవారు. భూములు సర్వే చేసి అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసేవారు. ముందస్తుగా రైతులు, వ్యాపారుల నుంచి కొంత నగదును తీసుకునేవారు. వాటి గురించి అడిగినప్పుడు ఏదో సాకు చెప్పి దాట వేస్తూ రుణాలు ఇప్పించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. జిల్లాలోని పెద్దవూర, తిరుమలగిరి(సాగర్‌), నిడమనూరు, నేరేడుగొమ్ము, దేవరకొండ, పీఏపల్లి మండలాల్లో 28మంది రైతులు, హాలియాలో ఓ వ్యాపారికి సాంఘిక సంక్షేమ శాఖల నుంచి నుంచి అధిక మొత్తంలో రుణం ఇప్పిస్తామని చెప్పి అందరినుంచి రూ.26లక్షల నగదు వసూలుచేశారు.

వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా సంచరిస్తూ...

సోమవారం పెద్దవూర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ముఠా సభ్యులు అనుమానంగా కనిపించడంతో పెద్దవూర ఎస్‌ఐ వీరబాబు తన సిబ్బందితో విచారించగా చేసిన నేరాలను అంగీకరించారు. వీరిలో షేక్‌ వజీర్‌ పరారీలో ఉన్నారు. సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు, నాగార్జునసాగర్‌ సీఐ బీసన్న, పెద్దవూర ఎస్‌ఐ వీరబాబు, సిబ్బంది ఉన్నారు. నిందితుల నుంచి రూ.1.65లక్షల నగదు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, అగ్రిమెంట్‌ డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.26లక్షలు నగదు వసూలు చేయగా, మిగిలిన మొత్తం ఎలా ఖర్చుచేశారనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు.

Updated Date - Oct 07 , 2024 | 11:49 PM