మహా నైవేద్యం
ABN , Publish Date - Oct 15 , 2024 | 12:44 AM
స్వయంభువుగా వెలసిన యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడు నైవేద్యప్రియుడు. నిత్యం మూడుపూటలా ఆరగింపులతో విశేష నైవేద్యాల నివేదన ఆలయ విశిష్టతల్లో ఒకటి. ఆలయంలో లడ్డూ ప్రసాదాలకు ప్రత్యేక స్థానం ఉంది.
స్వయంభువుగా వెలసిన యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడు నైవేద్యప్రియుడు. నిత్యం మూడుపూటలా ఆరగింపులతో విశేష నైవేద్యాల నివేదన ఆలయ విశిష్టతల్లో ఒకటి. ఆలయంలో లడ్డూ ప్రసాదాలకు ప్రత్యేక స్థానం ఉంది. వారం రోజుల పాటు నిల్వ ఉన్నా రుచిలో ఏమాత్రం మార్పు ఉండదు. కొండపై వెలసిన ఆ దేవదేవుడిని భక్తులు లడ్డూ ప్రసాదం రూపంలో దర్శించుకుంటారు. ఎంతో ప్రాముఖ్యం గల ప్రసాదాన్ని భక్తుల రద్దీకి తగ్గట్టుగా అందించేందుకు ఆలయ అధికారులు కృషి చేస్తూనే ఉంటారు. భక్తులు మొక్కు బడిగా స్వామికి సమర్పించుకునే భోగాలను ప్రాకార మండపంలోని రామానుజ కూటమిలో తయారు చేసి నివేదిస్తారు.
(ఆంధ్రజ్యోతి-భువనగిరి అర్బన్)
స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి శయనోత్సవ సేవ వరకు జరుగు అన్ని రకాల పూజల్లో భక్తులు పాల్గొనే సౌకర్యం ఉంది. దంపతులు రూ. 5,116 చెల్లించి పాల్గొనే అవకాశం దేవస్థానం కల్పించింది. అదేవిధంగా కొండకింద తులసీ కాటేజీ పాత బస్టాండ్ ఎదురుగా దేవస్థానం అద్దె గదులు అందుబాటులో ఉండగా దివ్య విమాన రాజగోపురం బంగారు తాపడానికి ఇండియన్ బ్యాంకు ఖాతా నంబరు 6814884695, ఐఎ్‌ఫఎ్‌ససీ : ఐడీఐబీ000వై011, అన్నప్రసాద విరాళాల కోసం యూనియన్ బ్యాంకు ఖాతా నంబరు 006110100000016, ఐఎ్‌ఫఎ్‌ససీ : యుబీఐ0828092 దాతలు విరాళాలు అందజేయాలి.
యాదాద్రి క్షేత్రంలో ప్రసాదాల్లో పులిహోర, లడ్డూ అత్యంత ముఖ్య మైనవి. పులిహోర 12 పదార్థాలతో, తొమ్మిది పదార్థాలతో లడ్డూ తయారుచేస్తారు. నిత్యం సుమారు 30వేల పులిహోర, 20 నుంచి 30వేలు ప్రత్యేక, పర్వదినాల్లో 50నుంచి 60వేల లడ్డూలు అనుభవం గల వంట ఆధ్వర్యంలో యంత్రాల ద్వారా తయారు చేయి స్తుంటారు. యంత్రాల ద్వారా లడ్డూ తయారు చేసే ఏకైక ఆలయంగా యాదాద్రి నిలిచింది. 28 మార్చి 2023లో కేంద్ర ప్రభుత్వం ఇక్కడి లడ్డూ నాణ్యతకు గుర్తింపుగా ‘భోగ్’ ధ్రువపత్రం కూడా అందజేసింది. లడ్డూ తయారీకి 40 ఏళ్లుగా మదర్ డెయిరీ నిత్యం 700కిలోల నెయ్యిని ల్యాబ్ నివేదికతో సరఫరా చేస్తోంది. అదే నెయ్యిని దేవస్థానం వారు హైదరాబాద్‌లోని నాచారం ప్రభుత్వ ఫుడ్ పరీక్షల కేంద్రానికి ప్రతి నెలా పంపిస్తుంది.
1960 నుంచే లడ్డూ విక్రయాలు
15వ శతాబ్దం నుంచి క్షేత్రంలో లడ్డూ, పులిహోర సమర్పించే సంప్రదాయం ఉంది. 1960 నుంచి భక్తులకు లడ్డూప్రసా దాలు దేవస్థానం విక్రయిస్తోంది. స్వామి వారికి నైవేద్యాలకు సంబంధించి వంటలు రామానుజ కూటమి, భక్తుల కోసం ప్రసాదాల కౌంటర్‌లో తయారు చేసే ఈ ప్రసాదాలు ముందుగా స్వామివారికి సమర్పించడం ఆనవాయితీ. మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం మిల్లెట్ లడ్డూ, బెల్లం లడ్డూలు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మిల్లెట్ల లడ్డూ మాత్రమే అందుబాటులో ఉంది.
ప్రత్యేక రోజుల్లో
మార్ఘళి వేడుకలు జరిపే ముప్పై రోజుల పాటు స్వామివారికి విశేషప్రసాదంగా కట్టె పొంగలి నివేదిస్తారు.
తిరుప్పావై మాసంలో 25వ పాశురం రోజున సిరా ప్రసాదం, 27వ పాశురం కూడారై రోజున క్షీరాన్న ప్రసాదాన్ని బంగారు, వెండి గంగాళాలలో నివేదించడం ఆలయ సంప్రదాయం.
ముక్కోటి ఏకాదశి రోజున కేసరీబాత్, శ్రీరామనవమి రోజున శీతలం, వడపుప్పు, ఉగాదిన ఉగాదిపచ్చడి, భక్ష్యాలు, కార్తీకపౌర్ణమి పర్వదినాన మధ్యాహ్నం అన్నంరాశిగా పోసి అన్నకూటం, కదంబం, దీపావళికి లడ్డూ ప్రసాదం, శరత్‌పౌర్ణమికి ఖీర్(పాయసం), కృష్ణాష్టమి, ఆండాల్ తిరునక్షత్రం, అధ్యయనోత్సవాల సందర్భంగా ప్రత్యేక నివేదనలు జరుగుతాయి.
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజు జరిగే శ్రీపుష్పయాగం సందర్భంగా పన్నెండు రకాల ప్రసాదాలు నివేదిస్తారు. చక్కెర పొంగలి, బెల్లం పొంగలి, బజ్జీలు, కారబూందీ, కేసరీబాత్, పూర్ణాలు, క్షీరాన్నం, జిలేబీ, సిర, కట్టె పొంగలి, లడ్డూ, వడతో పాటు భక్తుల మొక్కుబడి భోగాలు సమర్పిస్తారు.
నిత్యభోగాలు
వేకువజామున బాలభోగం
(దద్దోజనం)
మధ్యాహ్నం రాజభోగం
(పులిహోర, లడ్డూ, వడ)
రాత్రికి మహానివేదన
(శీతలం, వడపప్పు, శొండెలు, దోశ)
వీటితో భక్తులు సమర్పించిన ప్రసాదాలూ..
ఏడాది బరువు ధర
(గ్రాముల్లో) (రూపాయల్లో)
1982 165 0.50
1984 165 .60
1987 165 2.25
1990 165 3
1993 160 6
1995 80 5
2010 100 6
2011 100 10
2017 100 15
2018 100 20
2020 100 30
ఫ 2006లో ప్రవేశ పెట్టిన 500 గ్రాముల స్పెషల్ లడ్డూ రూ.50లు ఉండగా ఆ తర్వాత రూ.100 నుంచి ప్రస్తుతం రూ.150కి పెరిగింది.
ఫ 1982 నుంచి రోజువారీగా 60 కిలో లతో 200 లడ్డూలు తయారు చేసేవారు. కాగా, శని, ఆదివారాలతో పాటు ప్రత్యేక పర్వదినాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా 10 మంది లడ్డూలను తయారు చేస్తుండేవారు. ప్రస్తుతం యంత్రాల ద్వారా 10 మంది పర్మినెంట్, 20 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందితో లడ్డూలు తయారు చేస్తున్నాయి. రోజుకు 50 వేలకు పైగా లడ్డూలు తయారవుతున్నాయి.