Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ వ్రతానికి శుభ ముహూర్తం ఇదే..
ABN , Publish Date - Aug 15 , 2024 | 01:47 PM
శ్రావణ మాసంలో మహిళలు పూజలు, వ్రతాలు, నోములు అధికంగా ఆచరిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. శ్రావణమాసంలో రెండో శుక్రవారం.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మాత్రం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు జరుపుకుంటారు. ఈ ఏడాది రెండో శుక్రవారం.. ఆగస్ట్ 16వ తేదీ వచ్చింది.
Varalakshmi Vratham 2024: అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మకు.. ఏడాదిలో అన్ని మాసాలు ప్రీతిపాత్రమైనవే. అయితే ఆవిడకు శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైన మాసం. అందుకే ఈ మాసంలో మహిళలు పూజలు, వ్రతాలు, నోములు అధికంగా ఆచరిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. శ్రావణమాసంలో రెండో శుక్రవారం.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మాత్రం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు జరుపుకుంటారు. ఈ ఏడాది రెండో శుక్రవారం.. ఆగస్ట్ 16వ తేదీ వచ్చింది. మరి.. ఆ రోజున వ్రతం చేసుకోవడానికి శుభ ముహూర్తం ఎప్పుడుంది? వరలక్ష్మీ వ్రతం ఏ విధంగా చేయాలనే అంశాలపై జ్యోతిష్య పండితులు ఈ విధంగా వివరిస్తున్నారు.
శుభ సమయం..
సింహ లగ్న పూజ ముహూర్తం ఉదయం 5. 57 గంట నుంచి 8. 14 గంటల వరకు ఉంది.
వృశ్చిక రాశి పూజ ముహూర్తం మధ్యాహ్నం 12. 50 గంటల నుంచి 3. 08 గంటల వరకు ఉంది.
కుంభ లగ్న పూజ ముహూర్తం సాయంత్రం 6.55 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 8.22 వరకు ఉంది.
వృషభ లగ్న పూజ ముహూర్తం అర్ధరాత్రి 11. 22 గంటల నుంచి తెల్లవారు జాము 1. 18 గంటల వరకు ఉంది.
ఆగస్ట్ 16వ తేదీ.. వరలక్ష్మీ వ్రతం పూజ ఇలా చేయండి:
వ్రతమాచరించే మహిళలు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. బంగారం, ఆకుపచ్చ, గులాబీ వర్ణంలోనున్న కొత్త చీర కట్టుకోవాలి. అనంతరం పూజ గదిలో వ్రతం చేసుకునే ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. అందుకు ఆ ప్రదేశాన్ని గంగాజలాన్ని చల్లి శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత పూజ గదిలో ముగ్గు వేయాలి. అలాగే ఇంటి ప్రధాన ద్వారాన్ని మామిడి తోరణాలతోపాటు బంతి పూలతో అలంకరించాలి. ఆ తర్వాత చెక్క పీటపై కొత్త ఎరుపు వస్త్రాన్ని పరిచి.. మీ ఇంట్లోని శ్రీ లక్ష్మీదేవితోపాటు వినాయకుడి విగ్రహాలను లేకుంటే వారు కలిసి ఉన్న చిత్ర పటాన్ని పెట్టాలి.
అమ్మవారి విగ్రహం వద్ద బియ్యం పోసి.. దానిపై నీటితో నింపిన కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. శ్రీలక్ష్మీదేవి, వినాయకుల విగ్రహాలను పూలమాలలుతో అలంకరించాలి. అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇక అగరబత్తిలను వెలిగించి ముందుగా వినాయకుడికి పూజ నిర్వహించాలి. ఈ సందర్భంగా పూలు, కొబ్బరికాయ, చందనం, పసుపు, కుంకుమ, అక్షింతలు సమర్పించాలి.
అనంతరం వరలక్ష్మీ పూజను ప్రారంభించాలి. ఈ సమయంలో వరలక్ష్మీ వ్రత కథను చదవాలి. అలాగే శ్రీలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిని కూడా పఠించాలి. ఆ తర్వాత కొబ్బరి కాయ కొట్టాలి. ఈ వ్రతం పూర్తి కాగానే హారతి ఇవ్వాలి. తర్వాత అమ్మవారికి ఇష్టమైన తొమ్మిది లేదా ఐదు రకాల నైవేద్యాలు.. పులిహోర, పాయసం, శనగలు, చలిమిడి, వడపప్పు, బూరెలు సమర్పించాలి. ఈ సందర్భంగా ఇంటి వచ్చిన వారికి తీర్థ ప్రసాదాలు అందించాలి. అనంతరం పసుపు, కుంకుమ, శనగలతో తాంబూలం పెట్టి.. వాయినంగా ముత్తైదువులకు ఇవ్వాల్సి ఉంటుంది.