Share News

Ashada Masam Bonalu : తొలి బోనం ఎత్తిన గోల్కొండ..!

ABN , Publish Date - Jul 08 , 2024 | 09:29 AM

బోనాలు సమర్పించేందుకు భక్తులు వందలాది మంది ఇక్కడకు తరలివస్తారు. గోల్కొండ ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఈ బోనాలు జరుగుతాయి.

Ashada Masam  Bonalu : తొలి బోనం ఎత్తిన గోల్కొండ..!
Ashada Masam Bonalu

ఆషాఢం మొదలవగానే తెలంగాణ నగరాలకు, గ్రామాలు, సందడి తెచ్చే ఉత్సవం బోనాలు. ఎన్నో వ్యయప్రాయాసలకోర్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులతో ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ కిక్కిరిసిపోతాయి. బోనాలు అనగానే గోల్కొండ కోటలో మొదటి బోనం ఎత్తగానే మిగిలిన మహంకాళి, మహాకాళితో పాటు తెలంగాణలో గ్రామాలన్నీ డప్పుల మోతలతో, గజ్జల లయ బద్దమైన శబ్దాలతో మారు మోగిపోతాయి. వీధులన్నీ బోనాలు ఎత్తిన ఆడవారితో, ఉత్సాహంగా అడుగులు కలిపే పోతురాజులతో కిటకిటలాడతాయి. ఈ ఉత్సవం కోసం తెలంగాణ నగరాలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఎదురుచూస్తుంటాయి. ఆషాఢం అమావాస్య తరువాత వచ్చే ఆదివారం నాడు జరుపుకునే ఈ బోనాలు గోల్కొండ ఆలయంతో మొదలయ్యి ఈ సంబరం మళ్ళీ అదే ఆలయంలో ఆఖరి బోనంతో ముగుస్తుంది. ఈరోజు నుంచి పదకొండు రోజుల పాటు ఈ సందడి ఉంటుంది.

బోనాలంటే సంబరం, ఉత్సాహాన్ని రెండింతలు చేసే దేవతల జాతర. కోరిన కోర్కెలు తీర్చే గ్రామ దేవతల ఆరాధన. ఈ పండగను ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుపుకుంటారు. వండిన అన్నం, పాలు, పెరుగు, బెల్లం, ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి పాత్రల్లో పెట్టి డప్పు మోతలతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. దీనినే బోనం అంటారు. ఈ బోనాలు ఇచ్చే పాత్రలను లేదా కుండలను పసుపు, కుంకుమతో, ముగ్గుతో అలంకరించి వేప రెమ్మలు కడతారు. పాత్ర పైన దీపాన్ని వెలిగిస్తారు. గ్రామ దేవతలైన పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలన్న, మహంకాళి, పోలేరమ్మ, మారెమ్మల పేర్లమీద ఈ బోనాలు జరుపుకుంటారు.

ప్రత్యేకించి ఈ ఆషాఢమాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళుతుందని నమ్ముతారు. తమ సొంత కూతురు ఇంటికి వచ్చిందనే భావనతో ఈ పండుగ జరుపుకుంటారు. ఒకప్పుడు దుష్టశక్తులను పారద్రోలాలని దున్నపోతుని బలి ఇచ్చేవారు. ఇప్పటి రోజుల్లో పొట్టేళ్ళను, కోళ్ళను బలి ఇస్తున్నారు. ఉత్సవానికి ఊపు తెచ్చే విధంగా అంతా ఆనంద నాట్యం చేస్తారు. అందంగా ముస్తాబైన స్త్రీలు డప్పు మోతలకు లయబద్ధంగా నాట్యం ఆడుతారు, పోతురాజులు పసుపు పూతలతో నాట్యం చేస్తారు. ఈ హఢావుడి మధ్య బోనాలను అమ్మవారి దగ్గరకు చేరుస్తారు.

అమ్మవారి ఆకారంలో అలంకరించిన రాగి కలశాన్ని ఘటం అని పిలుస్తారు. సాంప్రదాయ వస్త్రధారణలో, ఒంటి పై పసుపు రాసుకున్న పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి, చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళతాళాల మధ్య ఊరేగిస్తారు.

ఆషాఢంలోనే ప్రారంభం అయ్యే బోనాల సంబరాలు అమావాస్య తర్వాత మొదలవుతాయి. హైదరాబాద్ లోని గోల్కొండ కోటలోని శ్రీ జగదంబిక (ఎల్లమ్మ) ఆలోయంలో తొలి పూజ చేసిన తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా గోల్కొండ తర్వాత ఉజ్జయిని మహంకాళికి, లాల్ దర్వాజ మాహాకాళికి బోనాలు నిర్వహిస్తారు. ఆషాఢమాసం చివరి రోజున తిరిగి గోల్కొండ కోటలో చివరి బోనంతో పూజలు చేసి ఈ ఉత్సవాలను ముగిస్తారు.


Skin Brightens : పసుపు నీటితో ముఖాన్ని కడిగితే చాలు.. ముఖం మెరిసిపోవడం ఖాయం...!

గోల్కొండ ఎల్లమ్మ జాతర..

బోనాలు సమర్పించేందుకు భక్తులు వందలాది మంది ఇక్కడకు తరలివస్తారు. గోల్కొండ ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఈ బోనాలు జరుగుతాయి. ఇది ఊరేగింపుతో ప్రారంభం అవుతుంది. బంజారా దర్వాజా నుండి బోనం ఊరేగింపు విగ్రహపీఠం ఆచారం. అమ్మవారికి ప్రతి ఆది, గురువారాల్లో మొత్తం తొమ్మిది రకాల పూజలను చేస్తారు. ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణ గుసాడి నృత్యం నుంచి పేరిణి నృత్యకారుల వరకూ జానపద కళాకారులు ప్రదర్శనలు సందడిని మరింత పెంచుతాయి. లంబాడీ నృత్యకారులు లయబద్దంగా ఆడే ఆటలు, డప్పుల మోతతో, యువకుల డాన్స్ చేయడం ఇదంతా అక్కడి వాతావరణాన్ని మరింత అందంగా మార్చేస్తుంది. డోలు శబ్దాలు భక్తుల్లో పూనకం వచ్చినట్టే అవుతుంది.

గోల్కొండ బోనాల తరువాత ఉజ్జయిని మహంకాళి బోనాలు, లాల్ దర్వాజ మహంకాళి పండుగ కొనసాగుతుంది. ఈ వేడుకులకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు హాజరవుతారు. జూలై 7, 11, 14, 18, 21,25, 28 ఆగష్టు 1, 8, 9 తోదీల్లో పూజతో బోనాల జాతర ముగుస్తుంది.

Ashada masam : ఆషాఢానికి అంత ప్రత్యేకత ఎందుకు? ఈ మాసంలో ఆ ఆకుకూరలనే ఎందుకు తింటారు..!

Updated Date - Jul 08 , 2024 | 09:31 AM