Kartika Amavasya 2024: కార్తీక అమావాస్య.. ఆ రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు
ABN , Publish Date - Nov 29 , 2024 | 04:25 PM
రానున్న అమావాస్య ఎంతో శక్తిమంతమైనది. ఈ రోజున పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఎంతో అనువైనది. ఈరోజున కచ్చితంగా చేయవలసినవేంటో తెలుసుకోండి..
కార్తీక మాసంలో వచ్చే అమావాస్య చుట్టూ ఎన్నో నమ్మకాలు, రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ ఏడాది కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యను కార్తీక అమావాస్యగా జరుపుకుంటున్నారు. నవంబర్ 30న.. అంటే శనివారం ఉదయం 10: 29 గంటలకు మొదలై డిసెంబర్ 1.. ఆదివారం ఉదయం 11:50 నిమిషాల వరకు ఉండనుంది. ఈ రోజును సద్వినియోగం చేసుకుని విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు పితృదేవతల ఆశీర్వచనాలను కూడా పొందవచ్చని పండితులు చెప్తున్నారు.
ఈ రోజున ఏం చేయాలి..
అమావాస్య రోజున ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించి ఉతికిన బట్టలను మాత్రమే కట్టుకోవాలి. ఈ రోజున సూర్యుడికి నల్ల నువ్వులతో అర్ఘ్యం ఇవ్వడం ఎంతో శ్రేష్ఠమైనదిగా భావిస్తారు.ఇలా చేయడం ద్వారా దుష్ట శక్తలు, గ్రహపీడ బాధలు తొలగుతాయంటారు. విష్ణుమూర్తిని కానీ, శివుడిని కానీ ఆరాధించడం మేలు చేస్తుంది. చీకటి పడిన తర్వాత నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. పేదవారికి బట్టలు, ఆహారం ధానం ఇస్తారు. చీమలకు ఆహారం అందిస్తారు.
ఈ రోజున చేయకూడని పనులు..
రానున్న అమావాస్య ఎంతో శక్తిమంతమైనది. ఈ రోజున పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఎంతో అనువైనది. అయితే, ఆ రోజున పూర్వీకులు తమవారి కోసం ఇంటి ముందుకు వస్తారని నమ్ముతారు. అయితే, ఆరోజు ఇంటి ముందు శుభ్రం చేయొచ్చు కానీ.. ముగ్గులతో అలంకరణలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇంటి ముందు ముగ్గు ఉంటే ఆ ఇంట శుభకార్యం జరుగుతుందని భావించి మన పూర్వీకులు వెనుదిరుగుతారని చెప్తారు. అందుకే ఈ రోజుల్లో గుమ్మం ముందు ముగ్గును వేయరు.