గవ్వలు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..
ABN , Publish Date - Dec 01 , 2024 | 03:16 PM
హిందూ సంప్రదాయంలో గవ్వలను పూజించే ఆచారం ఎంతో కాలంగా వస్తుంది. వీటి వల్ల సంపద పెరుగుతుందని అంటారు. దీని వెనుక ఉన్న రహస్యమేంటి.. గవ్వలకు నిజంగానే అంత శక్తి ఉందా...
అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో గవ్వలను పెట్టుకుని పూజించాలని చెప్తుంటారు. సముద్రం ఒడ్డున లభించే ఈ గవ్వలకు నిజంగానే అన్ని శక్తులు ఉన్నాయా అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. గవ్వలను పూజగదిలో ఉంచడంతో పాటు ఇంటి గుమ్మాలకు అలంకరణలుగా వాడటం, డబ్బులుంచే పర్సుల్లో ఉంచుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే, వీటి గురించి హిందూ సంప్రదాయంతో పాటు ఫెంగ్ షుయ్ అనే చైనా శాస్త్రంలోనూ అనేక ఆసక్తికర విషయాలను చెప్పారు.
గవ్వలను సాక్షాత్తు లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తుంటారు. గవ్వలను లక్ష్మీ దేవి సోదరిగానూ.. శంఖాలను సోదరుడుగాను కొలుస్తారు. ఇలాంటి గవ్వలను ఇంట్లో ఉంచుకోవడం ద్వారా ధనాన్ని ఆకర్షిస్తాయని చెప్తారు. డబ్బును నిల్వచేసే చోట, లాకర్లు, వ్యాపారాలు చేసే చోటు.. ఇలా అనేక చోట్ల వీటిని తెచ్చి పెట్టుకుంటారు. ఎక్కడైతే వీటిని పూజిస్తారో అక్కడ లక్ష్మీ దేవి కొలువై ఉంటుందనేది కొందరి నమ్మకం. అయితే, గవ్వలను కన్నులు ఉన్న ముఖం వైపును డబ్బులకు తగిలేలా ఉంచుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఫెంగ్ షుయ్ నియమాల ప్రకారం.. వీటిని ఎక్కడ ఉంచితే అక్కడ అదృష్టం వచ్చి చేరుతుందని చెప్తారు. అందుకే అక్కడి బీచుల్లో ఈ గవ్వలను విరివిగా అమ్ముతుంటారు. వీటిలో ఎన్నో రకాల గవ్వలు ఉంటాయి. అయితే, పసుపు రంగులో ఉండేవి అన్నింటిలోనూ శ్రేష్ఠమైనవిగా చెప్తారు. ఇక మార్కెట్లో కొన్ని రకాల ప్లాస్టిక్ గవ్వలు కూడా లభ్యమవుతున్నాయి. వీటి నుంచి జాగ్రత్తగా ఉండాలి.
పెళ్లి కాని యువతీ యువకులు గవ్వలను దగ్గర ఉంచుకోవడం వల్ల శీఘ్రంగా వివాహ ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెప్పే మాట. అంతేకాదు ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు, ముఖ్యమైన పనుల కోసం వెళ్లేవారు కూడా గవ్వలను దగ్గర ఉంచుకోవాలని చెప్తుంటారు.