Share News

ఆధ్యాత్మిక ఆధునిక సరస్వతీ పుత్రీకలు

ABN , Publish Date - Oct 16 , 2024 | 12:28 AM

కఠినతరమైన వేదమంత్రాలను అనర్ఘళంగా పారాయణం చేస్తున్నారీ అక్కాచెల్లెళ్లు. భగవద్గీత శ్లోకాలను కంఠస్థంతో ఔరా అనిపిస్తున్నారు. కేవలం ఆధ్యాత్మిక, ధార్మిక విభాగాల్లోనే కాకుండా కరాటే, యోగాలోనూ సత్తా చాటుతున్నారు. ఆధ్యాత్మిక, ఆధునిక విషయాల్లో ప్రావీణ్యం సాధించిన అక్కాచెల్లెళ్లు సంజన, సౌమ్యల స్ఫూర్తిదాయక కధనం.

 ఆధ్యాత్మిక  ఆధునిక సరస్వతీ పుత్రీకలు

(ఆంధ్రజ్యోతి- నార్కట్‌పల్లి)

నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం(పూర్వం నార్కట్‌పల్లి మండలం) అవురవాణికి చెందిన దాసో జు నర్సింహాచారి, లక్ష్మీప్రసన్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె సౌమ్య హైదరాబాద్‌లో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతుండగా, రెండో కుమార్తె సంజన నార్కట్‌పల్లి మండలం బీ.వెల్లెంల జడ్పీ ఉన్న త పాఠశాలలో 10వ తరగతి అభ్యసిస్తోంది.వృత్తిరీత్యా నర్సింహాచారి స్వర్ణకారుడే అయినా ప్రవృత్తి రీత్యా కరాటే, యోగా శిక్షకుడు. ఆడపిల్లలు ఎందులోనూ తీసిపోరని కానీ దేహరక్షణ, ఆత్మరక్షణకు కరాటే, యో గా అవసరమని నమ్మిన నర్సింహాచారి కుమార్తెలకు చిన్నవయసు నుంచి వాటిని నేర్పిస్తూ తొలి గురువుగా మారాడు. కరాటే పోరాటాలు, యోగాసాధనలో మెళకువలు నేర్పించాడు. ఆయన తర్ఫీదులో 100కు పైగా యోగాసనాలను అవలీలగా వేయగలరు ఈ అక్కాచెల్లెళ్లు. తమ ప్రావీణ్య ప్రదర్శనతో ఎన్నో మెడల్స్‌, సర్టిఫికెట్లు, అభినందనలు అందుకున్నారు.

సత్సంగాలతో వేదాలపై ఆకర్షణ

నల్లగొండ జిల్లాకేంద్రంలోని ఆర్యసమాజ్‌లో ప్రతీ ఆదివారం కరాటే శిక్షణ ఇచ్చేందుకు తండ్రి నర్సింహాచారి వెళ్తుంటారు. అదే సందర్భంలో సత్సంగాలు జరగడం చూసి తమ పిల్లలను సత్సంగానికి తీసుకువస్తే మంచి నడవడి, ప్రవర్తన, ఆధ్యాత్మికత అలవడుతుందని భావించి తీసుకువెళ్లేవాడు. ఆ సత్సంగాల్లో వేదపండితులు చేస్తున్న మంత్రోచ్ఛారణలు సంజన, సౌ మ్యలను ఎంతగానో ఆకర్షించి వాటిని తామూ చదివేందుకు ఆసక్తిని కలిగించాయి. వీరి ఆసక్తిని గుర్తించి న జగన్‌అనే వ్యక్తి యజ్ఞకృతువు, మంత్రాలకు సంబంధించిన పుస్తకాన్ని అందజేశాడు. దీంతో ఆ పుస్తకంలో ఉన్న శ్లోకాలను, మంత్రాలను చదివి సత్సంగాల్లో చె ప్పడం, చదవడం చూసిన తండ్రి వీరికి మరిన్ని పుస్తకాలను అందజేశారు. కుమార్తెల్లో ఉన్న జిజ్ఞాసను, జ్ఞాపకశక్తిని గమనించిన తండ్రి వీరికి ఆధ్యాత్మికత గ్రంథాలు, పుస్తకాలను తీసుకువచ్చి ఇచ్చి ఇవ్వడంతో అవలీలగా నేర్చుకుని అప్పజెబుతూ ఆశ్చర్యపర్చారు.

మొదటి పదం చెబితే చాలు

కంప్యూటర్‌ విద్యవైపు ఆసక్తి చూపిస్తున్న నేటి యువతకు భగవద్గీత గురించి సరిగా తెలియదు. అలాంటిది భగవద్గీతలోని 18 అధ్యాయాలను ఈ అక్కా చెల్లెళ్లు ఎంచక్కా చదివేస్తున్నారు. అదీనూ ఏ అధ్యా యంలోని శ్లోకం మొదటి పదాలను చెబితే చాలు ఆ శ్లోకాలను పూర్తిగా చెప్పగలరు. పలు వేదికలపై భగవద్గీత పారాయణాలను వినిపించి అభినందనలు అందుకున్నారు. 2022 సెప్టెంబరు 2న హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో లీడ్‌ వరల్డ్‌ 18,000ల పేరిట జరిగిన భగవత్‌ గీతాపారాయణంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4గంటల్లోపు 18అధ్యాయాలు, 700 శ్లోకాలను పారాయణం చేశారు.

మనుస్మృతి చదవాలనే సంకల్పం

వేదాలు, గ్రంథాలు, ఆధ్యాత్మిక పుస్తకాలను ఎన్నింటిని వల్లెవేసినా మనుస్మృతి లాంటి పుస్తకాన్ని చదవాలన్నదే ఈ అక్కాచెల్లెళ్ల ఆకాంక్ష. భారత రాజ్యాంగానికి మూలమైనదిగా భావించే మనుస్మృతిని చదవాలనే సంకల్పాన్ని ప్రారంభించారు. 2,650 శ్లోకాలు 12 అఽధ్యాయాలతో కూడిన ఈ పుస్తకాన్ని కనీసం ఏడాదిన్నర లోపైనా పూర్తిగా చదవాలనే లక్ష్యంతో ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఎంత కష్టపడైనా అఖిల భారత సర్వీసుల వరకు చదువులో చేరుకోవాలనే లక్ష్యంతో విద్యను అభ్యసిస్తున్నారు. సన గ్రంథాలు

కంఠస్థం చేసిన గ్రంథాలు

సంజన, సౌమ్యలు కంఠస్థం చేసిన గ్రంథాలు చాలానే ఉన్నాయి. భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు, వ్యాస మహర్షి రచించిన వేదాంత దర్శనంలోని 4 అధ్యాయాలు, 16 పాదాలు, 555 బ్రహ్మసూత్రాలు, పతంజలి మహర్షి రచించిన యోగ దర్శనంలోని సమాధి, సాధన, విభూదీ, కైవల్య పాదాలు, 195 మూల సూత్రాలు, యజుర్వేదంలోని 450 మంత్రాలు, అథర్వణ వేదంలోని శాంతి సూక్తం, లక్ష్మీ సూక్తం, సంధ్యా శివసంకల్పం, బ్రహ్మయజ్ఞం, శివతాండవం, దుర్గాదేవి స్థుతి, లింగాకష్టకం, బ్రహ్మాస్తోత్రం, ఈశ్వర స్తుతి, స్వస్తివాచన మంత్రాలు, శాంతికరణ మంత్రాలు, ఉపస్థాన మంత్రాలు, గాయత్రి, నమస్కార, మృత్యుంజయ మంత్రాలతో పాటు రాష్ట్రీయ ప్రార్థన, ధ్వజగీతము, ప్రాతఃస్మరణ మంత్రాలను, 60 ధర్మాచరణ శ్లోకాలు, దశావతార స్తోత్రం, ఆశీర్వచన మంత్రాలు, దైవిక ప్రార్థనలు, దీపస్తుతి, మంత్ర పుష్పం ఇలా ఏవైనా 10 గంటలకు పైగా ఏకధాటిగా పూర్తి కంఠస్థంతో చెప్ప గల ప్రజ్ఞావంతులు.

Updated Date - Oct 16 , 2024 | 12:28 AM