Devotional : తొలి ఏకాదశి ప్రత్యేకతేంటి.. ఉపవాసం ఎందుకో తెలుసా?
ABN , Publish Date - Jul 17 , 2024 | 12:13 PM
పండగల్లో తొలి ఏకాదశికి(Toli Ekadashi 2024) ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ ఏడాది జులై 16న సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఏకాదశి ఘడియలు జులై 17 బుధవారం సాయంత్రం 5 గంటల 56 నిమిషాలకు ముగుస్తాయి.
హైదరాబాద్: పండగల్లో తొలి ఏకాదశికి(Toli Ekadashi 2024) ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆషాఢ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిరోజు మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. విష్ణువు నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అంటారు. అందుకే ఈ రోజంతా ఉపవాస నియమాలు పాటించి జాగరణ చేస్తారు. అనంతరం మహా విష్ణువు ధ్యానంలో ఉండి ద్వాదశి రోజున దాన, ధర్మాలు చేసి ఉపవాస దీక్ష విరమించాలి. తొలి ఏకాదశి రోజు పాటించే నియమాల వల్ల పాపాలు తొలగిపోతాయిని భక్తుల నమ్మకం. ఈ రోజు యోగనిద్రలోకి వెళ్లే మహావిష్ణువు నాలుగు మాసాల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మెలకువలోకి వస్తాడు.
ఈ ఏడాది జులై 16న సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఏకాదశి ఘడియలు జులై 17 బుధవారం సాయంత్రం 5 గంటల 56 నిమిషాలకు ముగుస్తాయి. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు.
పేరెలా..
సత్యయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మ వరంతో దేవతలను, మహర్షులను హింసించేవాడు. ఆ రాక్షసుడితో వెయ్యేళ్లు పోరాడిన విష్ణువు అలసిపోయి ఓ గుహలో నిద్రించాడట. అప్పుడు విష్ణుమూర్తి శరీరం నుంచి ఓ కన్య ఉద్భవించి రాక్షసుడిని చంపేసిందట. ఆనందంతో విష్ణువు వరం కోరుకోమని చెప్పగా తాను విష్ణుప్రియగా ఉండాలని అడిగిందట. అప్పుడు ఆమెకు ఏకాదశిగా నామకరణం చేసి తిథుల్లో భాగం చేశాడని అలా ఏకాదశి పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.
వర్షాకాలం ప్రారంభానికి సంకేతం..
ఒకప్పుడు తొలి ఏకాదశి రాగానే వానాకాలం ప్రారంభమైందనుకునేవారు. వాతావరణంలో మార్పుల కారణంగా అంటువ్యాధులు, అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. అందుకే తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవారు.
ప్రసాదం..
ఏకాదశి రోజు పేల పిండిని తీసుకుంటారు. మురుమురాల్లో బెల్లం, యాలకులు జతచేసి తయారు చేస్తారు. ఈ పేలపిండి ఆషాఢంలో వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
ఉపవాసం వెనక ప్రయోజనాలు..
తిథుల్లో 11వది ఏకాదశి అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11 ఉంటాయి. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి భగవంతుడికి నివేదించాలి. ఇలా చేస్తే శరీరంలో పేరుకుపోయిన బద్ధకం దూరమవుతుందని, జబ్బులు దరిచేరకుండా ఉంటాయని, అవయవాలపై నిగ్రహం పెరుగుతుందని చెబుతారు. ఉపవాసం వల్ల జీర్ణకోశంలో ఉండే సమస్యలు తొలగిపోతాయని అంటుంటారు. ఇలాంటి సైంటిఫిక్ కారణాలు ఉండటం వల్లే ఉపవాసం చేయడం మంచిదని పెద్దలు చెబుతుంటారు.
For Latest News and National News click here