ఒక శ్వాస.. కొన్ని అంతర్లయలు
ABN , Publish Date - Nov 11 , 2024 | 01:39 AM
దూరాన్ని నువ్వే నిర్ణయిద్దువు గాని ప్రయణాన్ని ఇవ్వు చాలు గుండెలో విరిగిన గడియారం ముల్లును పీకిపారేసి కొద్దికొద్దిగా కదులుతున్న కాలాన్నివ్వు చాలు అనేకానేక...
దూరాన్ని నువ్వే నిర్ణయిద్దువు గాని
ప్రయణాన్ని ఇవ్వు చాలు
గుండెలో విరిగిన
గడియారం ముల్లును పీకిపారేసి
కొద్దికొద్దిగా కదులుతున్న కాలాన్నివ్వు చాలు
అనేకానేక నవ్వు తెరల మధ్య
వేళ్ళతో మీటితే
ఒలికిపోయి ప్రవహించే
నిండు పాత్రల పరిచయాల్ని ఇవ్వు చాలు
హంగుల నింగి నీడల కుబుసాల్ని
విదుల్చుకొని వచ్చేస్తాను–
రైతుతో పాటు
బురదలో కూరుకుపోయి
బరువెక్కే పాదాల్నివ్వు చాలు
ఇరుకిరుకు లోయల మధ్య
కలిసి పరీవాహకత్వమైన
పురాజ్ఞాపకపు
పరిమళాన్నివ్వు చాలు
నీటి ఎడారి మేటల మీద
మోకరిల్లి ప్రార్థిస్తాను
నా పెదాలకు
ప్రకృతికి అర్థమయ్యే
నాలుగు పదాలనివ్వు చాలు
-కందుకూరి దుర్గాప్రసాద్
96189 29018