Share News

కులగణన జరగాలి, వివరాలు తెలియాలి!

ABN , Publish Date - Dec 20 , 2024 | 01:27 AM

మాజీ డీజీపీ అరవిందరావు ఆంధ్రజ్యోతిలో కులగణనను వ్యతిరేకిస్తూ ఒక వ్యాసం రాశారు (‘ఈ విభజనలతో దేశం ఏమయ్యేట్టు?’ నవంబర్‌ 23, 2024). కులగణన చేయడం భారతీయ సమాజాన్ని విడగొట్టే కుట్రగా...

కులగణన జరగాలి, వివరాలు తెలియాలి!

మాజీ డీజీపీ అరవిందరావు ఆంధ్రజ్యోతిలో కులగణనను వ్యతిరేకిస్తూ ఒక వ్యాసం రాశారు (‘ఈ విభజనలతో దేశం ఏమయ్యేట్టు?’ నవంబర్‌ 23, 2024). కులగణన చేయడం భారతీయ సమాజాన్ని విడగొట్టే కుట్రగా ఆయన అభివర్ణించారు. ఇది బ్రిటిష్‌ పాలకులు భారతీయ సమాజాన్ని విభజించటానికి వాడిన ఎజెండా లాంటిదని అన్నారు. అలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, కులగణన జరిగితే సమాజంలో అల్లకల్లోలం ఏర్పడుతుందని అక్కసు వెళ్లగక్కారు. తన వాదనను సమర్థించుకోవడానికి అబద్ధాలు వల్లె వేశారు.

అరవిందరావు వర్ణవ్యవస్థ అనాదిగా ఉందని, అదేమీ భారతదేశ ప్రత్యేకత కాదని, ఇలాంటి వ్యవస్థలు ప్రపంచమంతా ఉన్నాయనీ అన్నారు. ఆయన చెప్పింది పాక్షిక సత్యమే. బ్రిటీషువారు వచ్చాకే భారత దేశంలో వర్ణవ్యవస్థ ఉనికిలోకి వచ్చిందనడం, బ్రిటిష్‌ వారు రాకముందు అస్పృశ్యత లేదనడం, చరిత్రను వక్రీకరించడమే.


బ్రిటీషు వారికి నల్ల జాతీయులంటే చులకన భావన ఉండొచ్చు. దేశ సంపద కొల్లగొట్టి ఉండొచ్చు, ఉద్యమాలను అణచివేసి ఉండొచ్చు; కాని వారు తమ అవసరార్థం ఈ దేశ ప్రజలకు ఉపయోగపడే సంస్కరణలు అనేకం చేశారన్నదీ వాస్తవమే. వేల ఏండ్లుగా సాగుతున్న బ్రాహ్మణిజాన్ని, దాని ఆధిపత్యాన్ని దెబ్బతీసే విధంగా మూఢాచారాలను నిషేధించారు. ‘సతీసహగమనం’ రద్దు చేశారు. వర్ణాశ్రమ ధర్మానికి భిన్నంగా విద్యను ప్రజలందరికీ అందించే ప్రయత్నం చేశారు. విద్య అంటే మత గ్రంథాలు, పురాణాలు వల్లె వేయడం కాదని; లోకజ్ఞానాన్ని పెంచే లెక్కలు, సైన్సు, చరిత్ర, భూగోళం, సామాజిక శాస్త్రం వంటి వాటిని భోదనాంశాలుగా చేశారు. ఫలితంగానే ఫూలే, పెరియార్‌, అంబేడ్కర్‌ లాంటి మహనీయులు నాటి భారతీయ సమాజం నుంచి అంకురించిన విషయం అరవిందరావుకు తెలియనట్లు ఉంది.

కులవ్యవస్థ ఇస్లాం వచ్చాకో, క్రైస్తవం వచ్చాకో ప్రారంభమయినట్లు చెప్పడం మోసకారితనం. ఈ విషయంపై స్వామి వివేకానంద ఏమి చెప్పారో వినండి: ‘‘అస్పృశ్యులు అనబడే ప్రజలను ఈనాటి అధ్వాన్న స్థితికి దిగజార్చింది ఎవరు? ఎవరు దీనికి బాధ్యులు? దీనికి ఆంగ్లేయులు మాత్రం కారణం కాదు. అనేక పారమార్థిక, వ్యవహారిక సిద్ధాంతాలను కనిపెట్టిన హిందూమతంలోని కుటిలులే ఇందుకు కారణం’’. రామకృష్ణ మఠం ప్రచురించిన ‘స్వామి వివేకానంద’ పుస్తకంలోని 16వ పేజీలో ఈ విషయం స్పష్టంగా ఉంది.


వర్ణవ్యవస్థగా చెప్పబడేది కేవలం సమాజ అవసరాల కోసం, సౌలభ్యం కోసం ఏర్పడ్డ వృత్తుల విభజన మాత్రమేననీ; ఆ వృత్తులు వంశ పారంపర్యం కాదనీ; అక్కడ ఉచ్చం నీచం అంటరానితనం అంటూ తారతమ్యాలు లేవనీ; ఒక వృత్తి నుండి మరే వృత్తికైనా మారే స్వేచ్ఛ వుండేదనీ; ఎలాంటి వివక్షలు లేవనీ అరవిందరావు వాదన. ఆయన నిజంగానే ఆ వాదనను నమ్మేవారయితే మనుస్మృతినీ; రామాయణ మహాభారతాల్లో వర్ణవ్యవస్థకు అనుకూలంగా ఉన్న అంశాలను విమర్శించేవారు. మన సమాజంలోని వర్ణకుల వ్యవస్థకూ గ్రీస్‌ ఇంకా మరికొన్ని ప్రాచీన నాగరిక దేశాలకు చెందిన బానిస వ్యవస్థలకూ మౌలిక తేడాలున్నవి. ప్రధాన తేడా ఏమిటంటే అక్కడ దోపిడీ బానిసల పేరిట జరిగేది. ఇక్కడ వర్ణం, కులం ముసుగులో దోపిడీ జరిగింది. ఈ వ్యవస్థలను నిలబెట్టడానికి, దీర్ఘకాలిక ప్రయోజనాలను బలపర్చుకోవడానికి ఒక సైద్ధాంతిక, తాత్విక మత చట్రం నిర్మితమైంది. బయటి ప్రపంచ దేశాలలో కుల వివక్ష, అంటరానితనం, మైల సిద్ధాంతం వగైరాల్లేవు. అవి ఆర్థిక అవసరాల కొరకు ఏర్పాటు చేసుకున్న తాత్కలిక నిర్బంధ చట్టాలు మాత్రమే.

దేవుడి నోటి నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు పుట్టారని హిందువులు పవిత్రంగా భావించే గ్రంథాలన్నీ చెపుతాయి. శూద్రుల పట్ల వివక్ష పాటించాలని, దళితులను అంటరాని వారిగా చూడాలని, మహిళలను అణిచిపెట్టాలని చెపుతాయి. ఇతర వ్యవస్థలలో ఇది మనకు కనపడదు. కాని అరవిందరావు రెంటినీ ఒకే గాట కట్టి మాటల మాయ చేస్తున్నారు. యూరప్‌లో కూడా కులవ్యవస్థ ఉన్నట్లు, అది పారిశ్రామిక విప్లవం ద్వారా అంతమైనట్లు ఆధారం లేని వాదనలు చేస్తున్నారు.


కులగణన ద్వారా ప్రస్తుత ఆధిపత్య వర్ణాలకు ప్రయోజనకారిగా ఉన్న వర్ణ, కుల వ్యవస్థలు నిర్వీర్యమవుతాయన్నది అరవిందరావు ఆందోళన. ప్రస్తుత నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియులకు ఎలాంటి ఇబ్బందులూ లేవు. చదువు, సంపదలు కింది కులాలకు నిషేధించి తాము సమాజంపై పెత్తనం చేస్తూ సుఖ సౌఖ్యాలు అనుభవించారు, ఇప్పటికీ అనుభవిస్తున్నారు. వారు ఈ సౌకర్యాలు కొనసాగాలనుకోవడం సహజం. మన సమాజంలో కులం కొందరికి వరమైతే, కోట్లాను కోట్ల మందికి అది శాపం! సంపన్నులంతా దాదాపు అగ్రకులాల నుండే ఉన్నారు. పేదలంతా దాదాపు ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల నుండే ఉన్నారు. కులం ప్రభావితం చేయని రంగమంటూ లేదు. ఒక ఉదాహరణ చూస్తే ఇదెంత వాస్తవమో గమనించవచ్చు. ఈ సంవత్సరం విడుదలైన ప్రపంచ అసమానతల నివేదిక ప్రకారం– భారతదేశంలోని వందమంది కోటీశ్వరులలో 88శాతం అగ్రకులస్థులే. జనాభాలో 15శాతం కూడా లేని అగ్రకులాలకు చెందినవారే సంపన్నుల్లో 88శాతం ఉన్నారు. మిగతా కులాలన్నింటి నుండి ఉన్న సంపన్నులు కేవలం 12శాతం మాత్రమే.

గత మూడు, నాలుగు తరాల నుండే బహుజన కులాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వారు చదువుకొని విజ్ఞానవంతులవుతున్నారు. ఆర్థికంగా మధ్య తరగతి వర్గాలలోకి చేరగలుగుతున్నారు. చైతన్యవంతులు కాగలుగుతున్నారు. తరతరాలుగా తమ పూర్వీకులకు జరిగిన అన్యాయాలను గుర్తిస్తున్నారు. ఇప్పటికీ తాము అన్ని రంగాల్లో వెనుకబడిన విషయాన్ని గమనించగలుగుతున్నారు. జనాభాలో తాము ఎంత శాతం ఉన్నామో అంత మేరకు అన్ని రంగాలలో వాటా కావాలంటున్నారు. అనేక రూపాల్లో ఆ ఉద్యమాలు సాగుతున్నాయి. కులగణన జరిగితే వాస్తవాలు బయటికొస్తాయి.


సామాజిక న్యాయం కావాలని, కులగణన జరగాలని జరుగుతున్న ఉద్యమాలు అరవిందరావు లాంటి వారిని కలవరపెడుతున్నాయి. కాబట్టే అబద్ధాలను అక్షరీకరిస్తున్నారు. ఎవరూ కోరకున్నా పాలకులే ఓట్ల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కులగణన చేపడుతున్నారని ఆక్రోశిస్తున్నారు. ప్రస్తుత సామాజిక వ్యవస్థ పట్ల అందరూ సంతృప్తికరంగా ఉన్నారని అవాస్తవాలు చెపుతున్నారు. ఎంత చదివినా, ఎంత పెద్ద పదవులు నిర్వహించినా తాము పుట్టిన సామాజిక, ఆర్థిక పునాదులు వదులుకోవడం ఎంతో కష్టమని అరవిందరావు గారి వ్యాసం చూశాక అర్థమవుతుంది.

వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లను కొనసాగించవద్దని, తీసి వేయాలని అగ్రకుల సంపన్న వర్గాలవారు ఎప్పటి నుండో తమకున్న ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కులగణనను ఆపడం ద్వారా ఆయా కులాలవారీ వివరాలు, వారి పరిస్థితీ తెలియకుండా చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక ఉద్యమకారులు, వామపక్ష వాదులు ఈ ప్రమాదాన్ని గుర్తించాలి. ఈ కుట్రలను తిప్పికొట్టి బలమైన ఉద్యమాన్ని నిర్మించాలి.

జి. రాములు

గౌరవాధ్యక్షులు,

తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం

Updated Date - Dec 20 , 2024 | 01:27 AM