Share News

మహోన్నత దేశభక్తుడు

ABN , Publish Date - Nov 05 , 2024 | 03:16 AM

చిత్తరంజన్ దాస్ 1870 నవంబర్ 5న అప్పటి ఉమ్మడి బెంగాల్ రాష్ట్రంలో జన్మించారు. ఇంగ్లాండులో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, 1909లో బాంబు కేసులో అరబిందో ఘోష్‌ను శిక్ష పడకుండా రక్షించారు. 1920 నుండి..

మహోన్నత దేశభక్తుడు

చిత్తరంజన్ దాస్ 1870 నవంబర్ 5న అప్పటి ఉమ్మడి బెంగాల్ రాష్ట్రంలో జన్మించారు. ఇంగ్లాండులో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, 1909లో బాంబు కేసులో అరబిందో ఘోష్‌ను శిక్ష పడకుండా రక్షించారు. 1920 నుండి 1922 వరకు కొనసాగిన సహాయనిరాకరణోద్యమంలో బెంగాల్ ప్రాంతంలో దాస్‌ ప్రముఖ పాత్ర వహించారు. స్వయంగా తన పాశ్చాత్య ఐరోపా వస్త్రాలను తగులబెట్టి స్వదేశ ఖాదీని ధరించి అందరికీ ఆదర్శప్రాయుడయ్యారు. గాంధీతో విభేదించి మోతీలాల్ నెహ్రూతో కలసి స్వరాజ్ పార్టీ స్థాపించారు.

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఆయన ‘ఫార్వర్డ్’ అనే పత్రికను స్థాపించి తర్వాత దాని పేరును ‘లిబర్టీ’గా మార్చారు. కొత్తగా ఏర్పడిన కలకత్తా కార్పొరేషన్‌కు ఆయన మొదటి మేయర్‌గా పనిచేసారు. గయలో జరిగిన ఇండియన్ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించారు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా మొక్కవోని దీక్ష, పట్టుదలతో బ్రిటిష్ వారిపై దాస్‌ పోరాడారు. ఆయన అహింసా విధానాన్ని విశ్వసించారు. స్వాతంత్ర్యాన్ని సాధించడానికి రాజ్యంగబద్ధమైన విధానాలను అనుసరించాలని ఆయన భావించేవారు.


సమాజ సామరస్యానికి పాటుపడిన, జాతీయ విద్యాప్రగతి వాది. ఆయన వారసత్వాన్ని ఆయన శిష్యులు అనుసరించారు. వారిలో సుభాష్ చంద్రబోస్ అగ్రగణ్యుడు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఆనాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారుల తరపున వాదించి దేశ బంధుగా ప్రఖ్యాతి పొందిన చిత్తరంజన్‌ దాస్‌ 1925 జూన్ 16న తుదిశ్వాస విడిచారు.

యం. రాంప్రదీప్

(నేడు దేశబంధు జయంతి)

Updated Date - Nov 05 , 2024 | 03:16 AM