నిష్పాక్షికత లోపించిన చరిత్ర
ABN , Publish Date - Mar 01 , 2024 | 05:21 AM
చరిత్ర అంటే భూతకాలంలో ఏం జరిగిందో తెలియజెప్పే శాస్త్రం. అలాంటి చరిత్ర పరిశోధన నిష్పక్షపాతంగా జరగాలి. ఏదో ఒక సిద్ధాంతానికి లోబడి చేసే పరిశోధన నిష్పాక్షిక పరిశోధన అవ్వదు...
చరిత్ర అంటే భూతకాలంలో ఏం జరిగిందో తెలియజెప్పే శాస్త్రం. అలాంటి చరిత్ర పరిశోధన నిష్పక్షపాతంగా జరగాలి. ఏదో ఒక సిద్ధాంతానికి లోబడి చేసే పరిశోధన నిష్పాక్షిక పరిశోధన అవ్వదు. ముఖ్యంగా భారతదేశ చరిత్ర పరిశోధన విషయానికి వస్తే, నిష్పక్షపాతంగా, ఏ సిద్ధాంతానికీ లోబడకుండా పరిశోధన చేసిన వారు తక్కువే. భారతదేశ చరిత్ర రచనలో మార్క్సిస్ట్ ధోరణితో రచన చేసిన చరిత్రకారులు ఒకవైపు ఉంటే, పురాణాలను యథాతథ చరిత్రగా అభివర్ణించేవారు మరొకవైపు ఉన్నారు. ఇంకోవైపు పాశ్చాత్యులు తమదైన దృక్పథంతో చేసిన చారిత్రక రచనలు, తీర్మానాలు భారతదేశ చరిత్ర పరిశోధనపై మిశ్రమ ఫలితాలు చూపించాయి. మరీ ముఖ్యంగా ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి పాశ్చాత్యులు చేసిన కాలనిర్ణయాల విశ్వసనీయత ప్రశ్నార్థకం. ఎందుకంటే భారతదేశ చరిత్ర గురించి పాశ్చాత్యులు చేసిన కాలనిర్ణయాలకు పునాది మతపరమైనదేగానీ శాస్త్రీయమైనది కాదు. బైబిలికల్ గ్రంథాల ప్రకారం క్రీ.పూ. 4004లో ప్రపంచం సృష్టించబడింది. దీన్ని అనుసరించే పాశ్చాత్యులు రామాయణ, మహాభారత కాలాలను తిరస్కరించడమే కాకుండా, ప్రాచీన కాలంలో సుమారు పన్నెండు వందల సంవత్సరాల భారతదేశ చరిత్రను కలగాపులగం చేసేశారు.
మనం ఇప్పుడు అకడమిక్‌గా చదువుతున్న చరిత్రపై పాశ్చాత్య చరిత్రకారుల, మార్క్సిస్టు చరిత్రకారుల ప్రభావమే ఎక్కువ. పురాణాలన్నీ హిందూ ధార్మిక గ్రంథాలుగా చెలామణి అవుతున్నాయి. మతం ముసుగేసుకోవడం వల్ల పురాణాలను చారిత్రక కోణం నుంచి పరిశీలించడమనేది జరగవలసినంతగా జరగలేదు. పురాణాలన్నిటిలోనూ చరిత్ర కల్పనలతో కలసిపోయి ఉండటం వల్ల, అవన్నీ పూర్తి కల్పిత గాథలేనని కొట్టి పారేశారు. భారతదేశంలోని అనేక దేవాలయాల స్థల పురాణాల కింద పాతిబెట్టబడిన చారిత్రక వాస్తవాలను వెలికితీస్తే చరిత్రలో కొత్త కోణాలు ఆవిష్కృతమవుతాయి.
పురావస్తు ఆధారాలతో చరిత్ర రచన చేయాలనుకున్నపుడు అలాంటి రచన సాపేక్షికమైనదని చరిత్రకారుడు గుర్తుంచుకోవాలి. కొత్త ఆధారాలు దొరికినపుడు అవి తన నమ్మకాలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ పాత నిర్ణయాలు మార్చుకోవాలి. ముందుగా లిఖిత లేదా మౌఖిక ఆధారాలేమైనా ఉన్నాయేమో చూసుకుని, తరువాత వాటిని బలపరిచేందుకు ఏమైనా పురావస్తు ఆధారాలున్నాయేమో పరిశోధించడం మంచి పద్ధతి. మన దేశంలో ‘ముస్లింల రాక మునుపటి భారతదేశపు గతం’ ఉత్తమోత్తమమైనదని రుజువు చేయడానికి ఒక వర్గం, అలాంటిదేం లేదని రుజువు చేయడానికి మరొక వర్గం తాపత్రయపడుతున్నాయి. ఇదే మన చరిత్రలో నిష్పాక్షికత లోపించడానికి కారణం.
గౌరాబత్తిన కుమార్ బాబు