సాహిత్య విమర్శకి కొత్త దిశ
ABN , Publish Date - Jul 22 , 2024 | 05:33 AM
రెండేళ్ళ క్రితం వెలువడిన సాహిత్యవ్యాసాల సంపుటి ‘దిక్చక్రం’ లోని మొత్తం 48 వ్యాసాల్లో పర్యాప్తమై వున్న రచయిత విస్తృత విషయ పరిజ్ఞానం, దేశవిదేశాల సాహిత్య అధ్యయనసారం మనల్ని ఆశ్చర్య పరుస్తుంది. రెండు కథాసంపుటాలు వెలువరించిన కథారచయితగా, అనువాదకుడిగా...
రెండేళ్ళ క్రితం వెలువడిన సాహిత్యవ్యాసాల సంపుటి ‘దిక్చక్రం’ లోని మొత్తం 48 వ్యాసాల్లో పర్యాప్తమై వున్న రచయిత విస్తృత విషయ పరిజ్ఞానం, దేశవిదేశాల సాహిత్య అధ్యయనసారం మనల్ని ఆశ్చర్య పరుస్తుంది. రెండు కథాసంపుటాలు వెలువరించిన కథారచయితగా, అనువాదకుడిగా మాత్రమే మనకు పరిచితుడైన, ఒక నాన్ అకడెమిక్ ఐన ఆడెపు లక్ష్మీపతి, అకడెమిక్ పండితులకు, పరిశోధకులకు తీసిపోని స్థాయిలో, వివిధ సాహితీప్రక్రియలు- కవిత్వం, కథ, నవల, నాటకం- గురించి, నూతన, పాశ్చాత్యసాహితీ ధోరణులైన మ్యాజికల్ రియలిజం, పోస్ట్ మోడర్నిజం, ఎగ్జిస్టెన్షియలిజం గురించి... పలు రచనల ప్రస్తావింపులతో అనేక అంశాలు సులభశైలిలో చెప్పినతీరు, వర్తమాన తెలుగుకవిత్వం, కథ, నవలలని- కొందరి రచనలు దృష్టాంతంగా తీసుకుని- కొత్త కోణంలో, కొండొకచో నిర్మొహమాటమైన వ్యాఖ్యానాలతో విశ్లేషించిన పద్ధతి అనన్యసామాన్యం. ఎంతో జ్ఞానతృష్ణ వుంటే తప్ప ఇంత లోతైన, విస్తారమైన అధ్యయనం సాధ్యం కావు.
రచయిత పాశ్చాత్య సాహిత్యాన్ని, విమర్శ గ్రంథాల్ని విరివిగా చదివి ఉండటమే కాక ఆ అధ్యయన ప్రభావంతో అలవడిన సరికొత్త చూపుతో తెలుగు సాహిత్యాన్ని విశ్లేషించేందుకు చేసిన ప్రయత్నం ‘దిక్చక్రం’ ప్రతి పేజిలో మనకు కనపడుతుంది. లక్ష్మీపతి ఈ గ్రంథాన్ని చాలా విశిష్టమైన తెలుగు పదజాలంతో రాశారు. కొన్నివ్యాసాలు చదువుతుంటే ఈ తెలుగు కంటే ఇంగ్లిష్ లోనే హాయిగా ఉంటుందేమో అనిపించేలా తెలుగులోని పారిభాషిక పదాలు వాడారు. కానీ కించిత్ శ్రమ తీసుకుని చదివితే సగటు పాఠకులకు, విద్యార్థులకు ఈ పుస్తకం నుంచి అపురూపమైన సాహిత్య సమాచారజ్ఞానం లభిస్తుంది.
‘దిక్చక్రం’లోని వ్యాసాలు కవిత్వం, కథలు, నవలలు, కొత్త రచనా రీతులు, వాదాలు, తాత్విక ధోరణులు అని నాలుగు విభాగాలుగా విభజించి ఉన్నాయి. మొదటి మూడు విభాగాల్లో తెలుగులో తనకు నచ్చిన కొన్ని గ్రంథాల్ని తీసుకొని వాటిని తనవైన తూనికరాళ్ళతో పరిశీలించి చక్కని విమర్శ చేశారు లక్ష్మీపతి. కవిత్వవిభాగంలో, డా.ఏనుగునర్సింహారెడ్డి ‘మూలమలుపు’ సంపుటిలోని కవితలు విస్తారమైన వస్తువిభిన్నతను ప్రదర్శిస్తూ కవిలోని సునిశిత పరిశీలనాశక్తికి, అమితమైన స్పందనాశీలతకు తార్కాణంగా నిలుస్తాయంటారు. ఈ వ్యాసంలో కవిత్వంపై, కవిత్వనిర్మాణంపై సూచనలు, దేశవిదేశాల ప్రముఖ కవుల కొన్ని కవిత్వ చరణాలు ఉన్నాయి. డా.బాణాల ‘కుంపటి’ దీర్ఘకవితపై రాస్తూ కంసాలి వృత్తిపని, గ్రామీణ సమిష్టిచట్రంలో ఆ వృత్తిబాధ్యత, కుటుంబ సంబంధాలు, చిన్ననాటి జ్ఞాపకాలు, సాదాసీదా వ్యక్తిత్వాలు, కల్లోలాలు, జీవనసంక్షోభాల్ని చిత్రించడానికి కవి ‘కుంపటి’ని ఎంతో ఔచిత్యవంతంగా కవితావస్తువుగా తీసుకున్నాడు అని ఉద్ఘాటిస్తాడు. బి.ఎస్.ఎం.కుమార్ ‘నిఘాలు, వృత్తాలు, వెళ్తురారిన కళ్ళు’ కవిత్వ సంపుటికి ముందుమాటలో కుమార్ ప్రత్యేకమైన వ్యక్తీకరణ పద్ధతిని, శైలిని నిష్పాక్షికంగా అంచనా వేస్తూ, ఆ కవిత్వాన్ని వినసొంపైన స్వాప్నిక రాగాలాపనగా అభివర్ణిస్తూ అతని కవిత్వంలోanarchist expressionsట ఉన్నప్పటికీ ఆనదింపచేసే విషయాలు చాలా ఉన్నా యంటూ, అది దేనికి అనుకరణ కాదని, కవిపై ఎవరి ప్రభావంలేదని, అద్భుతమైన ప్రతీకల్తో, అనితరసాధ్యమైన మెటఫర్లతో చిక్కని కవిత్వం రాశాడని ప్రశంసిస్తాడు. కానీ సామాన్య పాఠకులకు అర్థం కానంత జటిలమైన కవిత్వం ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడతాడు.
సిద్ధార్థ ‘బొమ్మలబాయి’ నిండా గత దశాబ్దమున్నర కాలాన్ని రూపుకట్టిన కవిత్వముంది, వస్తువైవిధ్యం, తెలంగాణ అస్తిత్వసోయి, ఉద్యమ తీవ్రత, స్వచ్ఛమైన స్థానిక భాషావాడకం, స్పందనల విస్తృతి, వాటి వ్యక్తీకరణల వినూత్నత... ఇవన్నీ కుప్పలు తెప్పలుగా కనపడతాయి అంటూనే, సిద్ధార్థ గత కవిత్వ సంపుటి ‘దీపశిల’తో పోలిస్తే ‘బొమ్మలబాయి’లో చిక్కదనం, సూటిదనం లోపించినట్లుగా ఉందనీ, అయినా తెలంగాణ కవుల్లో సిద్ధార్థ నిస్సందేహంగా మొదట పేర్కొనదగ్గ ప్రయోగశీల కవి అని చెబుతాడు. తాను Eliotలా రాయలనుకుంటే ఫర్వాలేదుగాని DylanThomasÌê, John Berrymanలా రాయలనుకుంటే కవి సామాన్య పాఠకులకు దూరం కాక తప్పదని తనదైన ధోరణిలో సున్నితంగా హెచ్చరిక చేస్తాడు. ‘డా. అమ్మంగి కవిత్వం, అనువాదాల గురించిన వ్యాసంలో, డా.ఎలనాగ తన అనువాద పటిమని’ "Faded Leaves and Fire Flies'లో చాలా చక్కగా ప్రదర్శించారని, ‘దోమశకం’ లోని వ్యంగ్య ధ్వనిని "Mosquito Era' లోనూ, ‘చెట్టు ఆత్మఘోష’ లోని ఆర్తిని, ఆవేదనను "The Soliloquy of a Tree' లోనూ, ‘చివరియుద్ధం’ లోని డిజిటల్ యుగపు భీభత్సాన్ని"The Final Battle' లోనూ సంపూర్ణంగా పునఃసృజియించారని కొనియాడతారు. ఈ వ్యాసంలో భాష పుట్టుక, తెలుగు భాష ఆవిర్భావ వికాసాల గురించిన విషయాలు ఆలోచనీయంగా వున్నాయి.
21 వ్యాసాలున్న కథల విభాగం లో ఆయన ‘మెతుకు కథలు’ సంకలనానికి రాసిన ముందుమాట ఉంది. ‘తెలంగాణ కథా సాహిత్యానికి పరిపుష్టి అందించిన రచయితలు ఇక్కడ గణనీయంగా ఉన్నారనటానికి ఈ సంకలనం నిదర్శనం’ అంటూ తెలంగాణా సాహిత్య వికాసానికి అవరోధంగా నిలిచిన అంశాల్ని ఏకరువు పెడతారు. ఉప్పల నరసింహం ‘మట్టిమనిషి’ కథా సంపుటికి రాసిన ముందుమాటలో అతని కథన నైపుణ్యాన్ని పొగుడుతూనే ఇతివృత్త నిర్మాణంలో చాలా తీరికైన శైలి, కథన పద్ధతిని అవలంబించడం మూలాన కొన్ని కథలు పాత వాటిలాగా ముక్క వాసన వేస్తుంటాయి అంటారు లక్ష్మీపతి. ‘అలుపెరుగని అక్షరశిల్పి’ వ్యాసంలో పులికంటి కృష్ణారెడ్డి కథా సాహిత్యాన్ని, బహుముఖ ప్రజ్ఞను క్లుప్తంగా విశ్లేషించి ‘పులికంటి సాహితీ సంస్కృతి’ పేరు మీద ఉత్తమ సాహిత్యకారుల్ని సత్కరించడాన్ని కొనియాడతారు. ‘కూరాడు’ కథా సంకల నాన్ని వస్తువైవిధ్యంగల కథల సమాహా రంగా విశ్లేషిస్తారు, ‘నూనెసుక్క’ కథా సంపుటి ముందుమాటలో కొట్టం రామకృష్ణారెడ్డినిPromising short story writer అని అభినందిస్తారు. డా.అయోధ్యరెడ్డి ‘అక్కన్నపేట రైల్వేస్టేషన్’ కథల్ని విశ్లేషిస్తూ అవి తెలంగాణ జీవితాన్ని చక్కగా పట్టుకున్న కథలనీ, రచయిత కథాశిల్పంపట్ల మంచి పట్టు ఉన్న కథకుడనీ పేర్కొంటూనే, చివర్న కథల్ని ట్రాజెడీగా ముగించే ఆబ్సెషన్‌ను అయోధ్యరెడ్డి వదులుకోవాలని సూచన చేస్తారు. శీలా వీర్రాజు కథల్లోని మనస్తత్వ చిత్రణని ఆకట్టుకునేలా వివరిస్తారు. ఈ విభాగంలోని ‘2008 కథాసాహిత్య సింహావలోకనం’, ‘ఆధునిక సాహిత్య ప్రక్రియగా కథ - సంవిధాన, ఉపాంగాల పరిచయం’, ‘క్రొంగొత్త రంగులు కలబోసిన కాన్వాసు: కథ - 2002’, ‘సమకాలీన తెలుగు కథ ప్రయోగాలు (2000-2010)’, ‘సాహిత్యం - వస్తుశైలీ శిల్పాల పరిశీలన’, ‘సాహిత్యం నీతిశాస్త్రానికి ప్రత్యామ్నాయం కాదు, అరాచకాన్ని ప్రోత్స హించకూడదు’... తదితర వ్యాసాలు రచయితలకు పాఠ్యంశాల్లాంటివి. కథ నిర్వచనం, మంచి కథని తూచే ప్రాతిపదిక, వస్తువు, ప్లాట్, శైలి, శిల్పం , ప్రయోగం... గురించిన వివరణలు, కథానిర్మాణ క్రమంలోని దశల్ని సూచించే ‘ఫ్రేట్యాగ్స్ ట్రయాంగిల్’, సమీక్ష-విమర్శల మధ్య తేడా, ఇతర భాషాకథల క్లుప్త పరిచయం... తదితర అంశాలన్నీ మన రచయితల అవగాహనని పెంచే విధంగా వున్నాయి.
నవలల విభాగంలో రాసిన ఏడు వ్యాసాల్లో ముఖ్యంగా ‘తెలంగాణ నవల - శిల్పం’ లో తెలంగాణా నవలలని సబ్జెక్ట్ వారీగా విభజించి ఇక్కడి రచయితలు రియలిజానికి ప్రాధాన్యం ఇస్తారని తేలుస్తారు. జ్వాలాముఖి నవల ‘వేలాడిన మందారం’ తెలుగులో మరణశిక్ష రద్దు గురించి రాసిన మొదటి నవలగా పేర్కొంటారు. దీన్ని గంభీరమైన ఇతివృత్తంతో ఉత్కంటభరితంగా సాగిన నవలగా అభివర్ణిస్తారు. గోపీచంద్ ప్రసిద్ధ తాత్విక నవలలు అసమర్థుని జీవ యాత్ర, మెరుపుల మరకలు, చీకటి గదులు ప్రత్యేకతను వివరి స్తారు. నవీన్ ‘అంపశయ్య’ సమస్యల వలయంలో చిక్కుకున్న ఒక యువకుని సంఘర్షణను చిత్రించి subjective mind and objective worldల మధ్య వుండే కార్యకారణ సంబంధ సార్వకాలీనతను స్ఫురింప చేస్తున్న నవలగా తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచి ఉంటుందంటారు. అసలు సమస్యను స్పృశించడమే రచయిత కర్తవ్యం అంటూ సలీం నవల ‘పడగనీడ’ గురించి రాస్తూ ఈ నవల మంచి రచయిత రాసింది అయినప్పటికి సమస్య అసలు మూలాల్ని స్పృశించని వెలితి ఈ నవలలో కొట్టొచ్చినట్టు కన్పిస్తుందని ఖరాఖండిగా చెబుతారు. మరో వ్యాసంలో, ‘తానా’ బహుమతి - 2017’ అందుకున్న ‘నీల’, ‘శప్తభూమి’, ‘ఒంటరి’ నవలలపై న్యాయనిర్ణేతగా తన కామెంట్స్ రూపంలో క్లుప్తంగా విశ్లేషణ చేశారు. భాస్కరభట్ల కృష్ణరావు నవల ‘వెల్లువలో పూచిక పుల్లలు’లో ఏ కోణంలో అస్తిత్వ వాద ఛాయలున్నాయో చెబుతారు.
14 వ్యాసాలుగా విస్తరించిన ‘కొత్త రచనారీతులు, వాదాలు, తాత్విక ధోరణుల విశ్లేషణ’ విభాగంలో విశ్వ సాహిత్యంలో అనేక మంది రచయితలు, అనేక ధోరణులకు సంబంధించిన వ్యాసాలు ఉన్నాయి. కాఫ్కా, బెకెట్, బోర్హెస్, కోర్తజార్, మార్క్వెజ్ వంటి ఆధునిక రచయితలపైన, మాజిక్ రియలిజం, ఎగ్జిస్టెన్షియలిజం తదితర అంశాలపై చాలా educativeగా , informativeగా రాశారు. ‘దిక్చక్రం’కి ముందుమాట రాస్తూ కె. శివారెడ్డి ‘ఆడెపు లక్ష్మీపతి గారు తెలుగు సాహిత్యానికి ఒక పెన్నిధి లాంటి అమూల్య గ్రంథాన్ని అందించారు’ అన్న మాట అక్షరాలా నిజం.
బాణాల శ్రీనివాసరావు
94404 71423