Share News

ఆదివాసీలది అరణ్యరోదనేనా?

ABN , Publish Date - May 16 , 2024 | 05:54 AM

ఆదివాసీలు నివసించే దండకారణ్యంలో, ప్రభుత్వ సాయుధ బలగాలు ఈ ఏప్రిల్ 16న జరిపిన కాల్పుల్లో, 29 మంది ఆదివాసీ స్త్రీ పురుషులు చనిపోయినట్టు, పత్రికల్లో వార్త! ఆ కాల్పులకు గురైన వారిలో, 27 మంది...

ఆదివాసీలది అరణ్యరోదనేనా?

ఆదివాసీలు నివసించే దండకారణ్యంలో, ప్రభుత్వ సాయుధ బలగాలు ఈ ఏప్రిల్ 16న జరిపిన కాల్పుల్లో, 29 మంది ఆదివాసీ స్త్రీ పురుషులు చనిపోయినట్టు, పత్రికల్లో వార్త! ఆ కాల్పులకు గురైన వారిలో, 27 మంది మొహాల ఫోటోల్ని పత్రికల్లో చూపించారు! దాదాపు అందరి మొహాలూ రక్తాలతో తడిసి వున్నాయి!

తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంతవరకూ, ఎన్కౌంటర్లు అనేవి, 1969 నించీ ఇప్పటివరకూ దాదాపు ‘3 వేలకు పైగా’ జరిగినట్టు ఒక లెక్క. ఆ ఎన్కౌంటర్లన్నీ, పోలీసులూ– నక్సలైట్లూ నిజంగా రెండు పక్షాలుగా ఎదురుపడడం వల్ల జరిగినవి కావు అనీ; నిజంగా జరిగిన ఎన్కౌంటర్లు అతి తక్కువ అనీ; హక్కుల సంఘాల నిర్ధారణ! ఇలాంటి వేలాది ఎన్కౌంటర్లలో, ఏప్రిల్ 16న జరిగినది కొత్తదీ కాదు, చివరిదీ కాదు! నిన్న గాక మొన్న కూడా ఎన్కౌంటర్లు జరిగాయి. మే 11న 12 మందినీ, 13న 11 మందినీ కాల్చి చంపారు. కాకపోతే, కొత్త విషయం ఏమిటంటే, దాదాపు 30, 40 ఏళ్ళ కిందటి వరకూ ఎన్కౌంటర్లు జరిగితే, ఇతర ప్రజల్లో కొన్ని చోట్ల అయినా నిరసన ప్రదర్శనలు జరిగేవి. ప్రస్తుతం అవి కనబడడం లేదు! మైదాన ప్రాంతాల ప్రజల్లో కనీస స్పందన కూడా లేకపోవడం, అమానుషంగా వుంది!


ఎవరైనా ఇలా అడగవచ్చు: ‘‘గిరిజనుల ప్రాణాలూ, మావోయిస్టుల ప్రాణాలూ మాత్రమేనా విలువైనవి? పోలీసులు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలతో, ఉద్యోగ ధర్మం పాటించడం గాక ఏం చెయ్యగలరు? అటువంటి పోలీసుల్ని మావోయిస్టులు చంపడం అయితే న్యాయమా?’’– అని ప్రశ్నిస్తే, దానికి జవాబు ఏమిటంటే, మావోయిస్టులు, శ్రమ దోపిడీ ప్రభుత్వాన్ని శతృవుగా చూస్తారు గానీ, పోలీసుల్ని శతృవులుగా చూడరు! పోలీసులు కూడా పేద శ్రామిక కుటుంబాల వారేననీ, వారికి పెద్ద చదువులూ, పెద్ద పెద్ద ఉద్యోగాలూ లేక, ప్రభుత్వం చెప్పినట్టు, విప్లవకారుల్ని అణిచివేసే ఉద్యోగాల్లోకి చేరారనీ, వారు శతృవులు కాదనీ, మావోయిస్టులకు తెలుసు. అడవుల్లో బ్రతికే ఆదివాసీల్నీ, వారిని పోరాటాల్లోకి సమీకరించే మావోయిస్టుల్నీ చంపెయ్యమని ప్రభుత్వం ఆదేశిస్తే, విప్లవకారులు ఆత్మరక్షణ కోసం పోలీసుల్ని ఎదుర్కోక తప్పదు కదా?


గిరిజనులు అడవుల్లో నిరుపేదలుగా జీవించే శ్రామికులే. వాళ్ళు నివసించే అడవుల్ని ప్రభుత్వం పెట్టుబడిదారీ కంపెనీల పెత్తందార్లకి, గనుల తవ్వకాలకూ; అనేక రకాల పరిశ్రమల్ని స్తాపించడానికీ, అప్పజెప్పేస్తోంది! మావోయిస్టులు అడవుల బాట ఎందుకు పట్టారు? గిరిజనులను ఏకం చేసి, వారికి శ్రామిక వర్గ చైతన్యాన్ని కలగజేసి, వారి తరఫున పోరాడాలనే! అంతేగానీ, మావోయిస్టులు, తమ పొట్టకూటి కోసం ఆ మార్గాన్ని ఎంచుకున్నవారు కాదు. వారు ఒక ఆశయం కోసం వచ్చినవారు! వారి ఆలోచనల్లోనూ, చర్యల్లోనూ, ఎత్తుగడల్లోనూ, పొరపాట్లున్నా, తప్పులున్నా, గిరిజనుల కోసం పోరాడడమనేదే వారి ప్రధాన ఆశయం! అది ఎటువంటి ఆశయమో అర్థమైతే పోలీసులు, ఆ ఆదర్శవాదుల మీదా, నిర్భాగ్యులైన గిరిజనుల మీదా, కాల్పులు జరిపే ఉద్యోగాల్లో ఉండగలరా?

మావోయిస్టులు, ఒక విషయమై స్వయం పరిశీలన చేసుకోవాలి. ‘మైదాన ప్రాంతాలలోని శ్రామిక ప్రజలు, ఆదివాసీల మరణాల పట్లా, వారికి నాయకత్వం వహిస్తున్న వారి మరణాల పట్లా, ఎందుకు స్పందించడం లేదు’– అని గ్రహిస్తున్నారా? ఆత్మ విమర్శగా ఏదో చెప్పుకుంటే కాదు! ఉదాహరణకి, ఉద్యమాలలోకి గతంలో వచ్చినట్టు యువకులు రాకపోవడానికి కారణాన్ని, ప్రపంచీకరణ కారణంగా, హైటెక్ ఉద్యోగాలకీ, పెద్ద జీతాలకీ, యువతీ యువకులు ఎగబడుతున్నారు– అన్నదేనా కారణం? మరి గతంలో, డాక్టర్లూ, ఇంజినీర్లూ, లాయర్లూ, టీచర్లూ వంటి వారు, విప్లవోద్యమాలలోకి చేరేవారు కాదా? గతంలో, ఎంతోమంది ప్రజలు, కార్యకర్తలుగానో, సానుభూతి పరులుగానో వుండేవారు కాదా? ‘ఇప్పుడు ప్రభుత్వ నిర్బంధానికి భయపడి మైదాన ప్రాంతాల ప్రజలు నిరసనలు తెలపలేక పోతున్నారు’– అనడం సరైనదా? ‘నిర్బంధ విధానాలు’ అనేవి చరిత్రలో ‘ప్రభుత్వాలు’ అనేవి ఏర్పడినప్పటినించీ జరుగుతూనే వున్నాయి. ‘రాజ్యాంగ యంత్రం అనేది, పాలకవర్గం, పాలిత వర్గాన్ని అణచడానికి ఏర్పడ్డ పనిముట్టు’– అని మార్క్సిజం చెబుతుంది! ఆ ‘దోపిడీ రాజ్యాంగ యంత్రాంగం’ ఇరవై నాలుగు గంటలూ, విరామం లేకుండా పాలక వర్గాలకు సేవలు చేస్తుంటుంది. ఎన్నికలు జరగనీ, దేశాధినేతలు మరణించనీ, వర్షాలు కురవనీ, ఎండలు మండనీ, మంచుముద్దలు పడనీ, నిర్బంధ యంత్రాంగం నిరంతరం పనిచేస్తూనే వుంటుంది.


‘ఉద్యమకారుల ఆచూకికీ, వారిని దెబ్బకొట్టడానికీ, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి ప్రభుత్వాలు. అందుకే ప్రజలు నిరసనలు చూపలేరు’– అనేది ఒక వాదన! ‘వియత్నాం విప్లవ చరిత్ర’ని చూస్తే, అప్పటికే వున్న అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి, బాంబుల వర్షం కురిపించిన అమెరికాని వియత్నాం ఓడగొట్టలేదా?

అసలు సమస్య ఎక్కడుందీ – అంటే, ‘విప్లవం అంటే కొద్దిమంది చైతన్యవంతులైన వారే, ప్రజల తరఫున చేసే పోరాటం’– అని యాంత్రికంగా అనుకోవడంలోనే వుంది. శ్రామిక ప్రజల్లోనే అనేక రకాల విభాగాల వారు వున్నారనీ, వారిని ప్రజా సంఘాల లోనో, వర్గ సంఘాల లోనో ఏకం చెయ్యాలనీ, వారి చొరవని పెంచాలేగానీ, ఆ సంఘాలను పార్టీ జేబు సంస్తలుగా నడపకూడదు– అనే, గ్రహింపు విప్లవకారుల్లో మొదటినించీ తక్కువగా ఉన్నట్టు కనపడుతుంది. ‘దళ చర్యలే సాయుధ పోరాటం’ అనే భావన కూడా వుంది. కమ్యూనిస్టు సిద్ధాంత అవగాహన కనీసంగా లేని యువకుల్ని కూడా ‘మిలిటెన్సీ’ పేరుతో, వారి వ్యక్తిగత పరాక్రమాన్నే గీటురాయిగా పార్టీలోకి తీసుకోవడాలూ, అలా చేరిన వాళ్ళలో కొందరు, పార్టీ నేతల్నే నిద్రల్లో హతమార్చే ద్రోహులుగా తయారై అదృశ్యం కావడాలూ కనపడతాయి. విప్లవ సిద్ధాంతం నేర్చుకోవడానికి మార్క్సు మూల గ్రంధం అయిన, ‘పెట్టుబడి’లో సారాంశాన్ని గ్రహించి నడవడం ప్రధానం అనే దాన్ని ఎంత గ్రహించారు?


ఏ ప్రభుత్వాన్నైతే సాయుధంగా కూలదోస్తామని ప్రకటించుకున్నారో, ఆ ప్రభుత్వంతోనే చర్చలు పనికి రావు అనీ, తోటి విప్లవ గ్రూపులతో ఎంత వరకూ ఏకం కాగలరో అంతవరకూ చర్చలు జరపాలి– అనీ అంటే, ‘నీకు చరిత్ర పరిగ్న్యానం లేదు’ అంటారు. ఎన్నో అవగాహనా లోపాల్ని సరిచేసుకుని, సరికొత్తగా మళ్ళీ మొదటి నించీ ప్రారంభించనక్కర లేదా? శ్రామిక ప్రజల్నీ కూడగట్టే పని గురించి ఉద్యమకారులకు దారి చూపే ఎంగెల్సు చెప్పిన మాటలు గుర్తు చేసుకుందాం.

ఎంగెల్స్‌: ‘‘వర్గ చైతన్యం లేని శ్రామిక జనాలకు, అతి కొద్ది మంది చైతన్యవంతులైనవారు మాత్రమే నాయకత్వం వహించి చేసే ఆకస్మిక దాడులూ; విప్లవ పోరాటాలూ; చేసే కాలం గతించింది. సామాజిక వ్యవస్థను సంపూర్ణంగా పరివర్తన చెందించడం – అనేదే ప్రశ్న అయినప్పుడు, శ్రామిక జనాలు తమంతట తాము వర్గ పోరాటంలో వుండి తీరాలి! సమస్య ఏదో, తాము దేని కోసం పోరాడుతున్నారో, అప్పటికే గ్రహించి వుండి తీరాలి! ఏమి చేయాలో, జనాలు అర్ధం చేసుకోవాలీ అంటే, సుదీర్ఘమైన, నిరంతరమైన పని అవసరం.’’

ఇలాంటి కృషి ఇప్పటికైనా జరగకపోతే, ప్రజలు నిస్పృహలో కూరుకుపోతారు. ఆదివాసీలదే కాదు, ప్రజలందరిదీ అరణ్య రోదనగానే మిగిలిపోతుంది.

రంగనాయకమ్మ

Updated Date - May 16 , 2024 | 05:54 AM