Share News

అంబేడ్కర్‌ భావాలకు కవిత్వ రూపమిచ్చిన కవి

ABN , Publish Date - Apr 15 , 2024 | 12:43 AM

‘‘హరిజనులలో నేడు మంచి కవులు పుట్టినారు. పుట్టుచున్నారు. మనము ఏర్పాటు చేయబోవుచున్న ఒకానొక సామ్యవాద రాజ్యాంగమునకు ఇది గొప్ప శుభసూచికము’’ (జ్ఞానానంద కవి ‘అక్షరాభిషేకం’ కావ్యానికి ముందుమాట) అని...

అంబేడ్కర్‌ భావాలకు కవిత్వ రూపమిచ్చిన కవి

‘‘హరిజనులలో నేడు మంచి కవులు పుట్టినారు. పుట్టుచున్నారు. మనము ఏర్పాటు చేయబోవుచున్న ఒకానొక సామ్యవాద రాజ్యాంగమునకు ఇది గొప్ప శుభసూచికము’’ (జ్ఞానానంద కవి ‘అక్షరాభిషేకం’ కావ్యానికి ముందుమాట) అని విశ్వనాథ సత్యనారాయణ ప్రకటించడం విశేషంగా భావించవచ్చు. మిగతా కవుల కంటే హరిజన కవులు కరుణ రసముట్టిపడునట్లు కవిత్వం రాస్తున్నారని విశ్వనాథ ప్రశంసించాడు. నెత్తుటి సిరాతో తన జాతి కవులు కఠినాత్ముల హృదయాలు ద్రవించేలా కరుణరస భరితమైన అనేక కావ్యాలు రచిస్తున్నారని గుర్రం జాషువ గబ్బిలం కావ్యంలో చాటిచెప్పాడు. వీరివురి మాటల్లో దళిత వర్గానికి చెందిన అప్పటి కవుల సృజన ప్రాభవం అర్థమవుతుంది.

భాగ్యరెడ్డి వర్మ, కుసుమ ధర్మన్న అందించిన రాజకీయ, సాహిత్య ప్రేరణతో, జాషువ కవిత్వ ప్రభావంతో, హరిజనోద్యమ సాహిత్య స్ఫూర్తితో, ఈ వర్గాల నుండి వచ్చిన ఎంతో మంది కవులు ఆధునిక తెలుగు పద్య కవిత్వానికి జవజీవాలను అందించారు. తరతరాలుగా అక్షరానికి దూరం చేయబడిన జాతిలో నుండి దూసుకు వచ్చిన ఈ కవులు కఠోరమైన సాధన జేసి, పద్య రచనా నైపుణ్యాన్ని వశ పరచుకొని ఆత్మగౌరవ స్పృహతో మహాకావ్యాలు రాశారు. తక్షణ సామాజిక గౌరవాన్ని అందుకోవడానికి, తమ జాతిని తృణీకరించే ప్రాబల్య వర్గాల కవి పండితుల ఆదరణను పొందడానికి ఈ కవులు పద్య కావ్య సృజనను సరియైున ఆలంబనగా భావించారని అనిపిస్తుంది. అందుకే జాషువతో పాటు, బోయి భీమన్న, జ్ఞానానంద కవి, గద్దెల జోసెఫ్‌, బీర్నీడి మోషే, ప్రసన్న, నంబూరు దుర్వాస మహర్షి, అత్తోట రత్నకవి, నూతక్కి అబ్రహం, మల్లవరపు జాన్‌, దైద వేములపల్లి దేవేందర్‌, కొలకలూరి స్వరూపరాణి లాంటి ఎంతోమంది కవులు పట్టుబట్టి పద్య కవిత్వమే రాశారు. వీరిలో ప్రధానంగా జాషువ, భీమన్నల కేంద్రంగా సాహిత్యంలో విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా గుర్రం జాషువా కవితా ప్రభంజనంలో చాలామంది విస్మృత కవులుగా మిగిలిపోయారు. ఇలాంటి విస్మృతకవుల్లో చోడగిరి చంద్రరావు ఎంతో ప్రాసంగికత ఉన్న కవి.

చంద్రరావు గురించి ఆధునిక సాహిత్యంలో, దళిత సాహిత్యంలో చర్చ జరగ లేదు. కల్లూరి ఆనందరావు పరిశోధనా గ్రంథంలో తప్ప ఈ కవికి సంబంధించిన రచనల ప్రస్తావన ఆధునిక సాహిత్య చరిత్రలో మృగ్యం. డెబ్బయ్యో దశకం లోనే విప్లవ కవితా ఉధృతికి భిన్నంగా స్పష్టమైన దళిత తాత్త్వికతతో చంద్రరావు ప్రభావశీలమైన పద్య కవిత్వం రాయడం గొప్ప విషయం.

‘భీమ’ కవిగా సాటి కవుల నీరాజనాలందుకున్న చోడగిరి చంద్రరావు గోదావరి తీరంలో కోరుమిల్లి గ్రామంలో 1932 జూలై 15న జన్మించాడు. తల్లితండ్రులు బుల్లెమాంబ, వెంకటస్వామి. చంద్రరావు కొంతకాలం రక్షణ శాఖలో సైనికుడిగా, ఆ తరువాత భారతీయ రైల్వే శాఖలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించి, సూపర్‌వైజర్‌గా పదవీ విరమణ చేశాడు. రెండుపదుల వయసులోనే కవిత్వ రచనను ప్రారంభించిన చంద్రరావు మూడున్నర దశాబ్దాల పాటు అప్రతిహతంగా సాహిత్య సృజన కొనసాగించాడు. వేమన, వేదుల సత్యనారాయణ, జాషువ, భీమన్నలను సాహిత్య గురువులుగా భావించాడు. గేయం, ఖండ కావ్యం, శతకం, పాట లాంటి ప్రక్రియల్లో చైతన్యభరితమైన రచనలు చేశాడు. వేకువ, మన గేయాలు, హృదయవీణ, చంద్రరావు గీతాలు, భీమ త్రిశతి తదితర రచనలతో కవిగా గుర్తింపు పొందాడు. మధుర కవిగా ప్రఖ్యాతి గాంచిన చంద్రరావు సుమధుర గాయకుడు, హార్మోనిస్టు కూడా. తాను రాసిన సామాజిక చైతన్య గీతాలను స్వయంగా తానే స్వరపరిచి, శ్రవణ శుభగంగా గానం చేస్తుంటే, ఆయన రాగవాహినిలో శ్రోతలు ఆనంద పరవశులయ్యే వారు. ‘చంద్రరావు కవిత’ అనే ఖండ కావ్యం అమెరికన్ల ఆదరణ అందుకున్నదని, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘వాషింగ్‌టన్‌’ గ్రంథాలయంలో ఈ కావ్యానికి చోటు లభించందని ఈ గ్రంథ ప్రచురణకర్తలు తెలియజేశారు.

కవిత్వం పట్ల, కవిత్వ ప్రయోజనం పట్ల చంద్రరావు స్పష్టమైన అభిప్రాయాలను ప్రకటించాడు. పీడితుల దుఃఖ విముక్తికి దోహద పడేదే ఉత్తమ కవిత్వమని సూత్రీకరించాడు. ‘చంద్రరావు గీతాలు’ సంపుటిలోని వస్త్రా పహరణం, ఘన కార్యం తదితర కవితల్లో చంద్రరావు తన కాలం నాటి కవితాధోరణులను విమర్శించాడు. కవి దుశ్శాసనులు తమ దుష్ట సృజన చేష్టలతో కవితా ద్రౌపదికి వస్త్రాహరణం చేస్తున్నారని ఆవేదన చెందాడు. వర్ణాశ్రమ ధర్మసూత్రాలను కవిత్వంలో వల్లిస్తూ ‘‘జాతిని రాతియుగం గుహలోనికి రమ్మని పిలిచే’’ తిరోగమన కవిత్వాన్ని ఈ కవి తిరస్కరించాడు. నవ్య సంప్రదాయ కవుల తీరుతెన్నులను వ్యంగ్యంగా ఎత్తి చూపాడు. ‘‘నీవు కన్న వారు నిన్ను కొల్చెడి వారు/ నీకు భర్తలంచు నిక్కువారు/ భాష యనెడి పాడు బావిలో పడ్డారు’’ అంటూ పాండిత్య ప్రకర్షతో సాధారణ పాఠకులను గంగవెర్రులెత్తించే కవి పుంగవులను వ్యతిరేకిం చాడు. వీరంతా సమాజాన్ని విడిచి, సగటు మనిషిని విస్మరించి సాహిత్య సాము చేసి, ‘‘బంధ కవితలల్లి తెలుగు సొగసును పాడు జేశారని’’ చంద్రరావు ఆక్షేపించాడు. కేవలం శాబ్దిక పరమైన ఆడంబరంతో, భావ పరమైన క్లిష్టతతో కొంతమంది కవులు కవితాసారాన్ని పాఠకులకు అందకుండా చేస్తున్నా రని చంద్ర రావు నిరసించాడు. ‘‘పేరు వచన కవిత నోరైన తిరగని/ బండరాళ్ళు నింపి, బండినిండ/ దుష్ట కృతులు జెప్పి దుంపతెంచదరయ్య’’ అని కొంతమంది వచవ కవుల విపరీత ధోరణులను ప్రశ్నించాడు. వచన కవిత్వాన్ని ఆవరించిన అస్పష్టతను ఈ కవి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఏ ఎండకా గొడుగు పట్టే వారిని ‘‘కాకా కవీశ్వరుల్‌’’ అని నిందించాడు.

దివాకర్ల వేంకటావధాని చెప్పినట్లుగా ప్రారంభ దశలో చంద్రరావు ‘‘నిష్కపటాను రాగమునకు, మాధుర్యమునకు నిలయమైన భావగీతములు’’ రచించాడు. ఆత్మాశ్రయ ధోరణిలో ప్రణయ వేదనను కవిత్వంలో రసరమ్యంగా పలికించాడు. ‘‘నన్ను కన్నభూమి, నా అన్నదమ్ములన్‌/ చిత్రహింస జెసి చితుల ద్రోయ/ ప్రేమ కవిత నేను ఏ మొగమ్మున వ్రాతు’’ నని ఆత్మవిమర్శ చేసుకొని, అసమ సమాజంలో దుర్భరమైన అణచివేతతో కునారిల్లుతున్న తన జాతి జనుల బతుకు వెతలను ఆర్ద్రంగా కవిత్వీకరించాడు. తీయనైన అబద్ధాలను శిల్పశోభితంగా వర్ణించడం కంటే వేదనాభరితమైన చేదునిజాలను సరళ సుందరంగా ప్రజలకు తెలియజెప్పాలనే సమున్నత సంకల్పంతో అట్టడుగు జన సమూహం వైపు చంద్రరావు చూపు సారించాడు. ‘‘విసిరేసిన విస్తరి కోసం కుక్కలతో పోరాడే’’ ఆగర్భదరిద్రులను, రూపాయి కోసం మండే ఎండలో తమ రూపాన్ని కరిగించు కుంటున్న మట్టిమనుషులను, రక్కసిమూకల కర్కశత్వానికి బలవుతున్న దిక్కులేని మానవతులను దర్శించి, వారి వేడి కన్నీటి భాష్పాలకు కవితాభాష్యం చెప్పాడు. ‘‘దీనుల బాధల చీకటి/ దీపావళినే మ్రింగును/ దీనుల కన్నీటి ఝరులు/ దిక్కులన్నీ ముంచెత్తును’’ అని దీన మానవ జీవన స్థితిగతుల ఎరుకతో దీపావళిని అభివర్ణించాడు. బూర్జువా వర్గం నశించి, కార్మిక వర్గం గెలిచినప్పుడే నిజమైన దీపావళి యని చంద్రరావు భావించాడు. ‘‘భక్తులు పుట్టిన దేశంలో, శక్తులు పుట్టిన దేశంలో, భక్తి మరిగిన దేశంలో’’ కొందరికి భుక్తి ఎందుకు కరువైందని చంద్రరావు ప్రశ్నించాడు.

కవికి భావుకత ఎంత ముఖ్యమో భావజాలపరమైన పరిణతి కూడా అంతే ముఖ్యం. వైవిధ్యంతో పాటు, వైరుధ్య భరితమైన భారతీయ సమాజ స్వరూప స్వభావాలను అర్థం చేసుకొని కవితా రచన చేయడానికి స్పష్టమైన తాత్త్విక మార్గం అవసరం. చంద్రరావు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ తాత్త్విక పథంలో వడి వడిగా ముందుకు సాగిపోయాడు. కాకినాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అంబేడ్కర్‌ చైతన్యం గోదావరి నదిలా పరవళ్లు తొక్కుతుంది. ఈలి వాడవల్లి, కుసుమ ధర్మన్న తదితర నాయకుల, కవుల ప్రభావంతో చంద్రరావు అంబేడ్కర్‌ ఆలోచనలను, ఆశయా లను అందిపుచ్చుకున్నాడు. యుక్త వయస్సు నుండే ఈ కవి అంబేడ్కర్‌ను గురువుగా, ప్రియనేతగా ఆరాధించాడు. అంబేడ్కర్‌ మరణించినపుడు తెలుగులో తొలి స్మృతి గీతం రాసింది కూడా చంద్రరావే. ‘‘నీ జీవితమును ఆదర్శముగ నిడుకొని బ్రతికెదమయ్య/ నీ ఆశయములు నెరవేరగ నిరతము పోరెద మయ్య/ నీ నవయానమును మేలగు పథముగ నెంచి/ నీవు నడిచిన పథమును విడువగా లేము’’ అంటూ అంబేడ్కర్‌కు ఈ కవి గేయ నీరాజనం సమర్పించాడు. ఆ మహనీయుని ఆశయ సాధనకు పునరంకితం కావడమే ఆయనకు నిజమైన నివాళి అనిభావించిన చంద్రరావు ఈ దిశగాతన కవిత్వాన్ని పుటం పెట్టుకున్నాడు. కాకినాడలో ‘భీమ సాహితీ స్రవంతి’ అనే సంస్థను స్థాపించి అంబేడ్కర్‌ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు. ‘భీమ కవిని’ నేను అని సగర్వంగా చెప్పుకున్నాడు. ‘‘ఏమి చెప్పనయ్య! భీమ రాయ!’’ అనే మకుటంతో మూడు భాగాలుగా భీమశతకం రచించాడు. చంద్రరావు రచనల్లో భీమ శతకం అత్యంత విశిష్టమైనది. దళిత సాహిత్యానికి తాత్త్విక భూమికను అందించిన ఈ శతకం ఆధునిక సాహిత్యంలో అంబేడ్కర్‌ ప్రభావాన్ని అర్థం చేసుకో వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యక్తిపూజతో చంద్రరావు ఈ శతకం రాయలేదు. బహుముఖీనమైన ‘భీమ’ తాత్త్విక ఎరుకతో ఆయన ఈ శతకాన్ని రాశాడు. ‘‘కవిత నీవు నాదు కావ్య వస్తువు నీవు/ కంఠ మందు నీవు, కనుల నీవు/ నీవు లేని నేను నిర్జీవ ప్రతిమనే/ ఏమి చెప్పనయ్య భీమరాయ’’ అంటూ చంద్రరావు అసామాన్యమైన అంబేడ్కర్‌ స్ఫూర్తిని ఆవాహన చేసుకొని, ఆయన రాజకీయ, సామాజిక లక్ష్యాలను సుబోధకంగా పద్యీకరించాడు. అంబేడ్కర్‌ ఆలోచనల వెలుగుల్లోనే కుల మత, వర్గాల ప్రాతిపదికగా రూపుదిద్దుకున్న మనువాదాన్ని, సమాజంలో వేళ్లూనుకున్న మూఢనమ్మకాలను చంద్రరావు తన కవిత్వం ద్వారా ఖండించాడు. మనిషి బతుకును మతంతో ముడివేసి, మనిషి గుండెను గుడిలో దాచిపెట్టి, మనిషి తెలివిని మంటగలిపారని అర్ధ శతాబ్దం క్రితం చంద్రరావు రాసిన కవిత్వానికి ఈనాటికీ ప్రాసంగికత ఉందని చెప్పవచ్చు. ‘‘ఆవు పేడ కన్న అంత తక్కువ వీడు/ మంత్రియైున ముఖ్య మంత్రియైున/ ఎవడు సృష్టి జేసె నీ కులమ్ముల తండ్రీ’’ అని ఎందెందు వెదకినా అందందు బుసలు కొట్టే నాలుగు పడగల నాగరాజు కుటిలత్వాన్ని చంద్రరావు బట్ట బయలు చేశాడు. సర్పంచి నుండి దేశాధ్యక్షుడి వరకు ప్రోటోకాల్‌ కతీతంగా కులసర్పం చేసిన గాయాలకు లెక్కలేదు. ‘‘కులహీనుడని గొడ్డళ్లతో గొట్టి/ గునపములను దించి గుండెలందు/ ఇళ్ళు తగుల బెట్టనేమి మా నేరమ్ము’’ అని కులం పేరుతో జరుగుతున్న సామాజిక హింసను చంద్రరావు వాస్తవ దృష్టితో అక్షరబద్ధం చేశాడు. కులాధిపత్యాన్ని, దళిత ఉపకులాల మధ్య రగులుతున్న అంతరాలను తద్వారా సంభవించే ప్రమాదాలను హెచ్చరించి, కులనిర్మూలన ఆవశ్యకతను చంద్రరావు తన పద్యాల ద్వారా ఆమోదయోగ్యంగా నిరూపించాడు.

గౌతమబుద్ధుని ఔన్నత్యాన్ని, ఆయన బోధించిన శాంతి సందేశాన్ని, ప్రేమైక దృష్టిని, జీవకారుణ్యాన్ని చంద్రరావు కవిత్వంలో పలికించాడు. అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో ఈనాడు వెలువడుతున్న సాహిత్య తత్త్వానికి చంద్రరావు రచనలు వెలుగు దారులుగా నిలుస్తాయి. అంబేడ్కర్‌ గురించి విశ్వవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో భీమ దృక్పథాన్ని సమర్థవంతంగా చాటి చెప్పిన చోడగిరి చంద్రరావు కవిత్వాన్ని మరింత గాఢంగా అధ్యయనం చేయవలసిన అవసరముంది.

కోయి కోటేశ్వరరావు

94404 80274

Updated Date - Apr 15 , 2024 | 12:43 AM