Share News

అస్పష్ట వాక్యం

ABN , Publish Date - Nov 25 , 2024 | 05:37 AM

గోడకుర్చీ వేయించాను గుంజిళ్ళు తీయించాను బెంచీ ఎక్కించాను బడి చుట్టూ తిప్పించాను బుద్ధి మారదు ససేమిరా కుక్కతోక వంకరన్నట్లు...

అస్పష్ట వాక్యం

గోడకుర్చీ వేయించాను

గుంజిళ్ళు తీయించాను

బెంచీ ఎక్కించాను

బడి చుట్టూ తిప్పించాను

బుద్ధి మారదు ససేమిరా

కుక్కతోక వంకరన్నట్లు

ఉత్తరంవైపు అడుగు పెట్టద్దంటే

అటే పరుగులు

చండికలా వద్దన్నదే ముద్దు

అరచేతిలో వాలిన చిలుకలను

అక్కర్లేదని వదిలేస్తుంది

అందరాని వాటికోసం

కాళ్ళెత్తి ఎగురుతుంది

నిజంగా దేనితో చేస్తారో

తెలిస్తే బాగుండు

ప్లాస్టిక్కా ప్లాటినమా

మృత్తికతోనా పసిడితోనా

అంతు చిక్కని రహస్యం

రికాబులో కాళ్ళు పెట్టి

కోర్కెల వారువానికి కళ్ళెం బిగించి

కొయ్యగుర్రంగా మార్చెయ్యాలనుకుంటా

కింద పడేసి రెక్కల గుర్రమై

పొగరుగా ఎటో దౌడు తీస్తుంది

ఒకసారి

తడిసిన పిట్టలా

ఒక మూల ఒదిగి కూర్చుంటుంది

దిగులు బొమ్మలా

ఒకసారి

ఎన్నికల్లో ఓడిపోయి ఎవరికీ కనిపించని

ప్రతిపక్ష నాయకునిలా

ఓసారి మట్టి ముద్దలా

ఓసారి ఉత్తుంగ శిఖరం హిమాలయంలా

ఓసారి అంతర్వాహిని సరస్వతిలా

ఓసారి వరద గోదారిలా

అర్థం కాదెప్పటికీ

అస్పష్ట వాక్యంలా...

మందరపు హైమవతి

94410 62732

Updated Date - Nov 25 , 2024 | 05:37 AM