Share News

మరో బీభత్సం...!

ABN , Publish Date - Apr 26 , 2024 | 06:06 AM

రెండువందలరోజులు దాటిన గాజాయుద్ధం మరో బీభత్సకాండదిశగా అడుగులువేస్తున్నది. దక్షిణప్రాంత నగరమైన రాఫా లోపలకు ఇజ్రాయెల్‌ సైన్యం ఏ క్షణమైనా చొరబడవచ్చు...

మరో బీభత్సం...!

రెండువందలరోజులు దాటిన గాజాయుద్ధం మరో బీభత్సకాండదిశగా అడుగులువేస్తున్నది. దక్షిణప్రాంత నగరమైన రాఫా లోపలకు ఇజ్రాయెల్‌ సైన్యం ఏ క్షణమైనా చొరబడవచ్చు. కొద్దిరోజులుగా రాఫా నగరంమీద జరుగుతున్న వైమానికదాడులు గురువారం మరింత తీవ్రమైనాయని, ఈజిప్టుతో సరిహద్దులు పంచుకుంటున్న ఈ నగరంనుంచి ప్రజలను వెళ్ళగొట్టే ప్రయత్నాలు జోరందుకున్నాయని వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు మూడులక్షలమంది జనాభా ఉండే రాఫానగరం ఇజ్రాయెల్ దమనకాండ ఆరంభమైన తరువాత శరణార్థులుగా తరలివచ్చిన మరో పదిలక్షలమందితో కలిసి క్రిక్కిరిసిపోతున్నది. పదమూడులక్షలమందికి కాస్తోకూస్తో నీడనిస్తున్న ఈ నగరంలోకి ఇజ్రాయెల్‌ సైన్యం ప్రవేశిస్తే ఆ బీభత్సం ఊహకు అందనిది. రాఫాలో చొచ్చుకుపోయేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉన్నదని, అది సమధికోత్సాహంతో ఎదురుచూస్తున్న ఆదేశాలు ఏ క్షణాన్నయినా వెలువడవచ్చునని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమీన్‌ నెతన్యాహూ అధికార ప్రతినిధి అంటున్నారు.

రాఫా దాడికి వ్యతిరేకంగా ఈజిప్ట్‌ ఏవో హెచ్చరికలు చేస్తున్నది కానీ, నెతన్యాహూ వీటిని లక్ష్యపెట్టే అవకాశాలు ఎంతమాత్రం లేవు. ఇప్పటివరకూ ఇజ్రాయెల్‌ గ్రౌండ్‌ ఆపరేషన్స్‌ చేపట్టని కీలకమైన నగరం ఇదే. హమాస్‌ ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న ఆరోపణతో మిగతానగరాలను నాశనం చేయడం, జల్లెడపట్టడం పూర్తిచేసిన ఇజ్రాయెల్‌కు రాఫానగరంమీద చాలా అనుమానాలున్నాయి. నాలుగు హమాస్‌ బెటాలియన్లకు ఈ నగరం స్థావరమని, వీరికితోడు ఆర్నెల్లయుద్ధంలో వేర్వేరు ప్రాంతాలనుంచి పారిపోయివచ్చిన వేలాదిమంది హమాస్‌ ఫైటర్లు ఇక్కడే తలదాచుకుంటున్నారని ఇజ్రాయెల్‌ వాదిస్తోంది. హమాస్‌ అపహరించుకుపోయిన ఇజ్రాయెలీలను విడిపించుకోవాలంటే ఈ నగరాన్ని జల్లెడపట్టాల్సిందేనని అంటోంది. హమాస్‌ను నాశనం చేయడం పేరిట ఈ ఆర్నెల్లకాలంలో ఇజ్రాయెల్‌ ఎంత అమానుషంగా వ్యవహరించిందో తెలుసు. పక్షంరోజుల క్రితం దక్షిణగాజానుంచి ఇజ్రాయెల్‌ వ్యూహాత్మక అవసరాల రీత్యా సైన్యాన్ని ఉపసంహరించుకున్న తరువాత, అక్కడ అది పాల్పడిన అరాచకాలు ఇప్పుడు వెలుగుచూస్తున్నాయి. ఇజ్రాయెల్‌ సైన్యం ప్రజలను చంపివేసి, సామూహికంగా ఖననం చేసిన ప్రాంతాలను పాలస్తీనా అధికారులు గత కొద్దిరోజులుగా తవ్వితీస్తున్నారు. ఖాన్‌ యూనిస్‌ ప్రాంతంలోని నాసర్‌ ఆస్పత్రి ప్రాంగణంలో నాలుగువందల మృతదేహాలు బయటపడ్డాయి. రోగులని కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టి వారిని చంపివేశారని, కొందరి చేతులు కాళ్ళు కట్టివేశారని పాలస్తీనా అధికారులు ఆరోపిస్తున్నారు. గాజా సిటీలోని అతిపెద్ద ప్రధాన ఆస్పత్రి అల్‌ షిఫా ప్రాంగణంలోనూ సజీవంగా ఖననమైన పాలస్తీనియన్ల మృతదేహాలు బయటపడ్డాయి.


ఇవన్నీ అసత్యప్రచారాలని ఇజ్రాయెల్‌ కొట్టిపారేస్తున్నప్పటికీ, చిన్నపిల్లల మృతదేహాలు కూడా అక్కడ బయటపడటం ఇజ్రాయెల్‌ అరాచకాలకు పరాకాష్ట. రోగులు, వైద్యుల ముసుగులో హమాస్‌ ఉగ్రవాదులు తిరుగుతున్నారని, ఆసుపత్రుల నేలమాళిగల్లో వారి ఆయుధనిల్వలున్నాయని ఆరోపిస్తూ వాటిని నేలమట్టం చేసిన ఇజ్రాయెల్‌ రోగుల పట్ల కూడా ఎంత అమానుషంగా వ్యవహరించిందో ఈ ఉదంతాలు చెబుతున్నాయి.


అక్టోబర్‌ ఏడునుంచి మొదలైన ఈ పాశవిక, ప్రతీకార దాడిలో హమాస్‌ ఎంతగా దెబ్బతిన్నదో తెలియదు కానీ, ముప్పైఐదువేలమంది పాలస్తీనియన్ల ప్రాణాలు తీసింది ఇజ్రాయెల్‌. మరో డెబ్బయ్‌ ఐదువేలమంది క్షతగాత్రులైనారు. 23లక్షలమంది జనాభా గల గాజానుంచి ౮5శాతంమంది తరలిపోయి అది మరుభూమిగా మిగిలింది. చివరకు శరణార్థులకు అన్నం కూడా దక్కనివ్వకుండా, వారంతా ఆకలితో మరణించేట్టుగా ఇజ్రాయెల్‌ కుట్రకు పాల్పడింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని యుఎన్‌ఆర్‌డబ్ల్యూఏలో కొందరు ఉద్యోగులు ఇజ్రాయెల్‌ పై హమాస్‌ జరిపిన దాడికి సహకరించారని ఆరోపించి, అమెరికా సహా పదహారు దేశాలతో సదరు సంస్థకు విరాళాలు దక్కకుండా చేసింది. కానీ, ఆ ఆరోపణలన్నీ అబద్ధాలని ఇటీవల తేలిపోయింది. ఇజ్రాయెల్‌మీద అలిగినట్టుగా, ఆగ్రహించినట్టుగా నటిస్తూనే దానిని ఆయుధాలతో ఆదుకుంటున్న అమెరికా అద్భుతమైన నాటకాన్ని ప్రదర్శిస్తోంది. భద్రతామండలిలో ఇజ్రాయెల్‌ వ్యతిరేక తీర్మానాలకు అడ్డుతగులుతూ, అది తనకు నచ్చిన రీతిలో ఊచకోతలు కోసేందుకు వీలుకల్పిస్తోంది. ఇజ్రాయెల్ జీనోసైడ్‌కు పాల్పడుతున్నదని అంతర్జాతీయ న్యాయస్థానం అప్పట్లో నేరుగా అనలేదు కానీ, జరుగుతున్నది అదే. రఫాలోకి ఇజ్రాయెల్‌ సేనలు అడుగుపెట్టినపక్షంలో అక్కడ జరగబోయేది ఊహకు కూడా అందనంత ఘోరంగా ఉంటుంది.

Updated Date - Apr 26 , 2024 | 06:06 AM