కోటా తీర్పుపై శాసనిక చర్యలేవీ?
ABN , Publish Date - Oct 24 , 2024 | 02:28 AM
ఎస్సీ, ఎస్టీల్లో అత్యంత వెనుకబడిన కులాలు, జాతులకు విద్య, ఉద్యోగ రంగాల్లో తగిన రిజర్వేషన్లు అందించేలా రాష్ట్రాలు ప్రాధాన్యతలతో కూడిన చర్యలు తీసుకోవాలని, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం...
ఎస్సీ, ఎస్టీల్లో అత్యంత వెనుకబడిన కులాలు, జాతులకు విద్య, ఉద్యోగ రంగాల్లో తగిన రిజర్వేషన్లు అందించేలా రాష్ట్రాలు ప్రాధాన్యతలతో కూడిన చర్యలు తీసుకోవాలని, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు ఒకటిన తీర్పునిచ్చింది. దీనికి వ్యతిరేకంగా న్యాయ సమీక్ష చెయ్యాలని దాఖలైన 32 పిటిషన్లను విచారించనవసరం లేదని, ఇదే రాజ్యాంగ ధర్మాసనం తాజాగా కొట్టి వేసింది. ఈ నేపథ్యంలో, మన రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి, ఎస్సీ కులాలు, ఎస్టీ తెగలన్నీ ఏకరూప అభివృద్ధి సాధించేందుకు మార్గాన్ని సుగమం చేయాలి.
ఎస్సీ కులాల్లో సంచార, అర్ధ సంచార, స్థిర జీవితం కలిగిన కులాలు ఉన్నాయి. ఎస్సీ కులాల్లో వృత్తిపరమైన శ్రేణీయ వ్యవస్థ ఉంది. అట్టడుగున పారిశుద్ధ్య కులాలు, ఆపైన చర్మకార కులాలు పూర్తిస్థాయి పైన నేత, నీరుకట్టు వృత్తి కులాలు ఉన్నాయి. శ్రేణీయ వ్యవస్థలో అట్టడుగున పారిశుద్ధ్య పనిలో ఉన్న రెల్లి, తోటి, మెహతార్, పాకి, పంచమ, గొడగలి, గొడారి వంటి కులాల వారికీ; చర్మకారులైన మాదిగ, అరుంధతీయ, ఆది జాంబవ, డక్కలి, చిందు, బైండ్ల, మోచి, సమగర, మాంగ్, మాతంగ, మాదిగ దాసు, మాదిగ మాష్టి మొదలగు కులాల వారికీ; సంచార, అర్ధ సంచార జీవనంలో వున్న బుడగ జంగం, డక్కలి, చిందు, మాష్టీ మొదలగు అనేక కులాల వారికీ విద్యా, ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం లేని, అసలే ప్రాతినిధ్యం లేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. పేదరికం, కుల వివక్ష, నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
ఎస్టీలలో అటవీ ప్రాంత, కొండ ప్రాంతాల్లో చెంచు, కోయ, గోండు మొదలగు ఆదివాసీ తెగలు ఉన్నాయి. అలాగే మైదాన ప్రాంతంలో యానాది, ఎరుకల, లంబాడి, సుగాలి మొదలగు ఆదివాసి తెగలున్నాయి. ఇందులో యానాది జాతి ఆదిమ జాతి. ఈ తెగ ఇప్పటికీ పంట పొలాలలో చెట్లు, పుట్టలు తిరిగి ఎలుకలు, పాములు పట్టుకునే దుర్భర నిరుపేద పరిస్థితుల్లోనే ఉన్నారు. కాగా ఎస్టీ రిజర్వేషన్లలో విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రిజర్వేషన్లను ఎరుకల, లంబాడి, సుగాలి తెగలవారే సింహభాగం అనుభవిస్తున్నారు.
దేశంలో ఎస్సీ, ఎస్టీలు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను ఉపయోగించుకున్న తీరుతెన్నుల మీద పరిశీలనకు కేంద్ర న్యాయశాఖ 1965లో బి.ఎన్. లోకూర్ కమిటీని నియమించింది. ఈ కమిటీ అదే ఏడాది తన తుది నివేదికను సమర్పించింది. ఎస్సీ, ఎస్టీల మధ్య అభివృద్ధి వ్యత్యాసాలు తీవ్రంగా పెరిగాయని ఈ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాకుండా, తమ జనాభా నిష్పత్తుల కంటే రిజర్వేషన్లలో సింహభాగం అనుభవించిన పద్నాలుగు ఎస్సీ, ఎస్టీ సమూహాలను రిజర్వేషన్ జాబితా నుంచి తొలగించమని, నాటి లోకూర్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి తుది నివేదికలో స్పష్టంగా సూచనలు చేసింది. లోకూర్ కమిటీ నాడు డీ రిజర్వ్ చెయ్యమని సూచించిన కులాల జాబితాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మాల కులం కూడా ఉందనేది వాస్తవం.
తెలుగు రాష్ట్రాల్లో మాదిగ ఉద్యమ ప్రభావంతో అత్యంత వెనుకబడిన ఆదివాసులు తుడుం దెబ్బ ఉద్యమాన్ని ప్రారంభించారు. బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలు ఎంబీసీ ఉద్యమాన్ని ప్రారంభించారు. వామపక్ష, కమ్యూనిస్టులు కూడా కుల నిర్మూలన పోరాట సమితి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి వంటి సంఘాలను పెట్టారు. ముస్లిం మైనారిటీలలో వెనుకబడిన సమూహాలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్యమం ముందుకు వచ్చింది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే ఉద్యమం ప్రారంభమైంది. ఇండియా సంయుక్త రాష్ట్రాల బహుజన కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపన దాకా, మాదిగ ఉద్యమం ప్రభావం చూపింది. గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన ప్రాజెక్టుల రూపకల్పనలు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాలు రూపొందాయి. పంపకంలో హేతుబద్ధీకరణ (వర్గీకరణ) లేకపోవడం వల్ల, ఈ చట్టాల అమలు ద్వారా కూడా ఎస్సీ, ఎస్టీల్లో సాపేక్షికంగా బలమైన కులాలు, జాతులు, తెగలవారే సింహభాగం లబ్ధిని కైవశం చేసుకున్నారు.
వర్గీకరణ సమస్య పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకూ ఎటువంటి శాసనిక ప్రక్రియలు, చర్యలూ చేపట్టకపోవడంతో ఆంధ్రప్రదేశ్ మాదిగలు అసంతృప్తితో ఉన్నారు. ఇక తెలంగాణలో రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ పన్నెండున మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు అయింది. అలాగే, సమస్య అధ్యయనానికి ఏకసభ్య జుడిషియల్ కమిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 2018లో ప్రభుత్వ గజెట్‌లో ప్రచురింపబడిన, ఇప్పటికి తాజా గణాంకాలైన 2011 జనాభా లెక్కల ఆధారంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ ప్రక్రియను పూర్తిచేయాలి.
ఎస్సీలు, ఎస్టీలకు చాలాకాలంగా దీర్ఘకాలికమైన, విధానపరమైన అపరిష్కృత సమస్యలు ఎన్నో ఉన్నాయి. అందులో– 1. పెరిగిన జనాభా శాతానికి అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచుకోవడం. 2. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు జరిపించుకోవడం 3. భూమి, ఉపాధి, గృహ వసతులు కల్పించుకోవడం. 4. పారిశ్రామిక, వ్యాపార, పెట్టుబడి నైపుణ్యాలు పెంచుకోవడం. 5. నిరుద్యోగ నిర్మూలన, కులవివక్ష, అత్యాచారాల నిర్మూలన. 6. ఎస్సీ, ఎస్టీల్లో సంపన్న శ్రేణిని రిజర్వేషన్ల విధానం నుంచి మినహాయించడం మొదలైనవన్నీ కొన్ని ముఖ్య సమస్యలు. అయితే, ఇవేవీ కూడా, ఎస్సీ, ఎస్టీల మధ్య వున్న ఏ సమస్య పరిష్కారానికీ మరొక సమస్య పోటీ కాదు, కాకూడదు. పోటీ పెట్టజాలని, పెట్టకూడని, అడ్డుగా నిలపకూడని సమస్యలుగా ప్రభుత్వం, వర్గీకరణ వ్యతిరేకులు, సమాజమూ గుర్తించాలి. ప్రాధాన్యతలను బట్టి ఏ సమస్యకు ఆ సమస్యనే విడివిడిగా పరిష్కరించాలి. వర్గీకరణ లేకుండానే మెడికల్ సీట్ల భర్తీ, ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు జారీ కావడం... మాదిగలకు, మిగిలిన ఎస్సీ, ఎస్టీ తెగలకు మరింత అన్యాయం చేయడమే. రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకూ అన్ని రకాల ఉద్యోగాల నియామకాలను, అన్ని ఉన్నత విద్యా, వృత్తివిద్యా అడ్మిషన్ల ప్రవేశాలను భర్తీ చేయకూడదు. రిజర్వేషన్ల హేతుబద్ధీకరణలో జాప్యాన్ని నివారించి, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లలో పంపిణీలో న్యాయం చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీలలో ఏకరూప అభివృద్ధికి తక్షణం చర్యలు తీసుకోవాలి.
కృపాకర్ మాదిగ
వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి,
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి