అపురూపం
ABN , Publish Date - Dec 09 , 2024 | 01:00 AM
ఉండాల్సిన దృష్టి ఉండాలే గానీ సృష్టిలో ఏ మనిషైనా సౌందర్య శిల్పమే మానవ దేహ నిర్మాణమే జవ జవలాడే జీవకణజాలం...
ఉండాల్సిన దృష్టి ఉండాలే గానీ
సృష్టిలో ఏ మనిషైనా సౌందర్య శిల్పమే
మానవ దేహ నిర్మాణమే
జవ జవలాడే జీవకణజాలం
ఎర్రటి బొగ్గుల మీద చక చకా
కంకులు కాల్చి ఆకలి తీర్చుతున్న
ఆమె నుదురు మీది తడి తడి స్వేదం
మనోహరమై మెరుస్తున్న ప్రతిబింబం
ఒక చేత్తో విసురుతున్న విసనకర్ర
మరోక చేత్తో నిప్కల మీద మర్లేస్తున్న కంకి
అంటుకున్న బొగ్గుల వేడి విస్తరించి
చిప్పిరి చిప్పిరైన తల వెంట్రుకల మీదా
చెమట పట్టిన చామనఛాయ ముఖమ్మీదా
ఎగిరి పడుతున్న తెల్లని బూడిద నుసి
వెండి పువ్వుల నవ్వుల్లా మెరుస్తున్నాయి
రగ రగ బొగ్గుల మీద బొర్లిచ్చిన
మక్కంకిని చేతికందిస్తూ నవ్విన నల్లని నవ్వు
సహజ సుందర ఫోటోజెనిక్ సొగసు
ఆమె పెదవులకు లిప్‌స్టిక్ పూతా లేదు
ఆమె చెక్కిళ్లకూ పౌడర్ దట్టించిన దాఖలా లేదు
కనుబొమ్మల కత్తిరింపులూ కనపడలేదు
శ్రమించే చలాకీ రూపమే అపురూప సౌందర్యం.
అన్నవరం దేవేందర్
94407 63479