Share News

‘హైడ్రా’పై రాజకీయ కుట్రలు మానండి!

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:41 AM

ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాత అందరి దృష్టీ హైదరాబాద్ మీద పడింది. అంచనాకు మించిన జనం, కంపెనీలు వేగంగా తరలిరావడంతో దాని ప్రభావం మూసీ నది మీద పడింది. 1990 నాటికి మూసీలోకి మానవ వ్యర్థాలు, ఫ్యాక్టరీ నుంచి...

‘హైడ్రా’పై  రాజకీయ కుట్రలు మానండి!

ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాత అందరి దృష్టీ హైదరాబాద్ మీద పడింది. అంచనాకు మించిన జనం, కంపెనీలు వేగంగా తరలిరావడంతో దాని ప్రభావం మూసీ నది మీద పడింది. 1990 నాటికి మూసీలోకి మానవ వ్యర్థాలు, ఫ్యాక్టరీ నుంచి వచ్చే రసాయన వ్యర్థాలు కలగలిసి వచ్చి మూసీ కాలుష్య కాసారంగా మారింది. అప్పటికే ప్రధాన జలాశయాలుగా ఉన్న ఉస్మాన్ సాగర్‌, హిమాయత్ సాగర్ సరస్సులను ఈ కాలుష్య కోరల నుంచి కాపాడాలన్న ప్రధాన లక్ష్యంతో నాటి పాలకులు 1996లో జీవో నెంబర్ 111 తీసుకొచ్చారు. ఈ జీవో ప్రకారం ఈ రెండు సరస్సుల చుట్టూ 10కిమీ మేర అంటే దాదాపు 1,30,000 ఎకరాల భూమి కలిగిన 84 గ్రామాలలో ఆంక్షలు విధించబడ్డాయి. వీటి ప్రకారం– వ్యవసాయ భూముల్ని పారిశ్రామీకరించడానికి వీలులేదు; భారీ కాలుష్యకారక పరిశ్రమలు, పెద్ద పెద్ద హోటళ్లు, విశాల నివాస స్థలాలు, భారీ వినోద కేంద్రాలు నిర్మించకూడదు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల చేతుల్లో చిక్కి, ధనార్జనే పరమావధిగా భావించి జీవో నెంబర్ 111 ఎత్తివేసింది. దీంతోటే అభివృద్ధికి బాటలు పడ్డాయని అబద్ధపు ఢంకా మోగించి ప్రజల కళ్ళల్లో మరింత మురికి మట్టిని కొట్టింది.


నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం దగ్గరికి పర్మిషన్ల కోసం వినతులు, అలాగే పర్మిషన్లు వద్దని ప్రజల నుంచి నిరసనలు రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై దృష్టి సారించారు. సుందరమైన హైదరాబాద్ కల నిజం కావాలంటే మూసీ నది ప్రక్షాళన జరగాలని, దానికోసం 111 లాంటి జీవోనే ఉండాలని, అప్పుడే అందమైన ఆరోగ్యకరమైన భవిష్యత్ హైదరాబాద్ సాధ్యమవుతుందని అంచనాకి వచ్చారు. ఈ ఆలోచనల పరంపర నుంచే హైడ్రా ఉద్భవించింది.

అభివృద్ధి వైపు వేగంగా పరుగులు పెట్టించే గొప్ప వ్యూహంగా మూసీ ప్రక్షాళన కోసం హైడ్రాను ఏర్పాటు చేశారు. రూ. 1,50,000కోట్ల అంచనా వ్యయంతో, కేవలం 36 నెలల్లోనే మూసి ప్రాజెక్టును పునర్నిర్మించి సుందరీకరణ పూర్తి చేయాలన్న లక్ష్యంతో కొనసాగుతున్నారు. నది పొడవునా వాణిజ్య, వినోద, పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించనున్నారు. ఈ గొప్ప కార్యం కోసం ప్రత్యేక కమిషన్‌ను తయారు చేశారు. దీనికి చైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. సభ్యులుగా ఉమ్మడి రంగారెడ్డి–హైదరాబాద్ జిల్లాల మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ, జీహెచ్‌ఎంసీ మేయర్‌లు ఉంటారు. ఇట్లా పటిష్టమైన నిర్మాణం, స్పష్టమైన లక్ష్యంతో హైడ్రా ముందుకు సాగుతున్నది.


దాదాపు పదేళ్ళు పాలించిన బీఆర్ఎస్ నాయకులు నాడు మూసీ ప్రక్షాళనపై కల్లబొల్లి మాటలతో మభ్యపెట్టారు. కనీసం ఒక్క అడుగు కూడా కార్యరూపం దాల్చలేదు. ఒక సంవత్సరం కూడా నిండని రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం వేగంగా అడుగులేస్తుంటే ఇప్పుడు వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించిన విలాసరాయుళ్లు ఇప్పుడు కన్నీళ్లు మింగుతున్నారు. జన్వాడ ఫామ్ తమది కాదని, అది లీజు మాత్రమే అని తేలు కుట్టిన దొంగల్లాగా కొత్త రాగం అందుకుంటున్నారు. మరో బీఆర్ఎస్ నేత తన చుట్టూ ఉన్న చెరువు ఆక్రమించుకొని ఇంజనీరింగ్ కాలేజీ కట్టాడు. అనంతరం దానిని యూనివర్సిటీగా కూడా మార్చాడు. ఇప్పుడు కోర్టుకెళ్లి ‘నా యూనివర్సిటీని కాపాడండి మహాప్రభో’ అని పొర్లు దండాలు పెడుతున్నాడు. మరొక నేత అక్షర జ్ఞానం లేకున్నా భూకబ్జాలలో ఘనాపాటి. ఆయన తన ‘మెడికల్ కాలేజ్‌ను ఇప్పుడే కూల్చవద్దు, కాస్త సమయం ఇవ్వండి’ అంటూ గగ్గోలు పెడుతున్నాడు. ఇంకా మిగతా నేతల వివరాల్లోకి వెళ్తే ఇక్కడ చాట భారతం అవుతుంది. ఆక్రమించుకున్న కోట్ల విలువ చేసే భూములు తమవి కాకుండా పోతున్నవనేసరికి సినీ ప్రముఖులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, బీఆర్ఎస్ నేతలు ఒకే జట్టుకట్టి ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోసే కుట్రకు తెరతీశారు. వీరికి ఇప్పుడు పేదలపై విపరీతమైన ప్రేమానురాగాలు వస్తున్నాయి. అరవై గజాలకు మించని జాగాలో ఈగలూ దోమల బాధతో, రోగాలతో చెత్తాచెదారం మధ్యన, మూసీ మురుగు ప్రక్కన బతుకుతున్న వీరి కనీస అవసరాలు ఇన్నాళ్లూ ఏ మాత్రం పట్టించుకోని వాళ్లు, వీరికై పక్కా ఆవాసాలు నిర్మించని వాళ్లు ఇప్పుడు పేదలకు న్యాయం చేయాలంటూ సరికొత్త నాటకానికి శ్రీకారం చుట్టారు. హైడ్రా అధికారులు ఎఫ్‌టీఎల్‌ భూమిని గుర్తించి అక్కడ ఎఫ్‌టీఎల్‌ అని రాస్తే ఆ స్థానంలో కేసీఆర్ అని రాసుకోవాలని ప్రజలను రెచ్చగొట్టి కేసులపాలు చేయచూస్తున్నారు. ఈ క్రమంలో కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ప్రతిపక్షాలతో కుమ్మక్కై ప్రభుత్వానికి నష్టం చేయ చూశారు. హైడ్రా పనులకు విఘాతం కలిగిస్తున్నప్పుడు ప్రభుత్వం వారిపైన కూడా కేసులను నమోదు చేయించి తన నిష్పక్షపాతాన్ని చాటుకుంది.


హైదరాబాద్ సుందరీకరణ అభివృద్ధిని, మూసీ మురుగు కాలువ జీవితాలను పట్టించుకోని బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు వారి గురించి మాట్లాడే నైతికత ఉందా అనేది బుద్ధిజీవుల నుంచి ఉద్భవిస్తున్న ప్రశ్న. పేదల విషయంలో రేవంత్‌రెడ్డి గారి మాటలు ‘‘ఇళ్ళు పోగొట్టుకున్న పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అందజేస్తాం. దాంతోపాటు కొంత ఆర్థిక సాయం కూడా అందిస్తాం’’ అన్నవి స్పష్టంగానే ఉన్నాయి.

చివరిగా ఒక్క విషయాన్ని తప్పక చర్చించి తీరాలి. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యవసాయ సంబంధిత సాగునీరు ప్రధానంగా మూసీపైనే ఆధారపడి ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చే మురుగు పెరగడం వలన ఉమ్మడి నల్లగొండ పొడవునా ఉన్న మూసీ కూడా కాలుష్యమైంది. బోర్లు, కాలువలు, చెరువుల ద్వారా వచ్చే సాగునీరు కలుషితం కావడం వల్ల పంట దిగుబడి సమృద్ధిగా లేదు. పైగా విషతుల్యమైన నీటి ద్వారా వచ్చే పంట కూడా విషతుల్యమవుతుందనే వాదన సహేతుకమైనది. ఇది కేవలం నల్లగొండకే పరిమితం కాదు, హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతంలో కూడా అనేక పంటలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. ఈ కలుషిత నీళ్లతో పండిన ఆహారాన్ని తినడం ద్వారా జరిగే ఇబ్బందులను ఊహించలేం. మూసీ సుందరీకరణ కోసమే కాదు, మానవ మనుగడ కోసం సైతం జరుగుతున్న మహా యజ్ఞం– ఈ హైడ్రా. ఎలాంటి కుటిల రాజకీయాలు లేకుండా ఈ మహా యజ్ఞంలో అందరూ పాలుపంచుకోవాలి.

చనగాని దయాకర్

పరిశోధక విద్యార్థి, ఉస్మానియా యూనివర్సిటీ, కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్

Updated Date - Oct 23 , 2024 | 01:41 AM