ప్రాణాంతక ‘గడ్డిమందు’ నిషేధం అవసరం
ABN , Publish Date - Nov 05 , 2024 | 03:27 AM
గడ్డిమందుగా రైతులు పిలుచుకొనే పెరాక్వెట్ డైక్లోరైడ్‌ను వారు కలుపు నాశనానికి వాడడం పరిపాటి. ప్రస్తుత వ్యవసాయ కూలీల ఖర్చుల దరిమిలా ఈ మందును రైతులు ఆశ్రయించడంలో ఆశ్చర్యం లేదు....
గడ్డిమందుగా రైతులు పిలుచుకొనే పెరాక్వెట్ డైక్లోరైడ్‌ను వారు కలుపు నాశనానికి వాడడం పరిపాటి. ప్రస్తుత వ్యవసాయ కూలీల ఖర్చుల దరిమిలా ఈ మందును రైతులు ఆశ్రయించడంలో ఆశ్చర్యం లేదు. కానీ, గత పదేళ్లలో దేశవ్యాప్తంగా ఈ మందు దుర్వినియోగ మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. వర్షాధారిత భారతావనిలో అతివృష్టి, అనావృష్టి వల్ల పంటనష్టం వాటిల్లి, తీర్చలేని అప్పుల బారిన పడిన రైతన్నలు తమకు అందుబాటులో ఉన్న పురుగు మందులు, కలుపు నాశినులు సేవించి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇందులో ఈ గడ్డిమందు ప్రథమస్థానం ఆక్రమించింది. దీనికి కారణం– ఈ మందుకు ఎటువంటి విరుగుడు లేకపోవడం. అలాగే కొన్ని మిల్లీలీటర్లు తీసుకున్నా మరణం తథ్యమన్న నమ్మకం జనబాహుళ్యంలో నాటుకుపోవడం.
అసహజ మరణాలకు కారణాలు కనుక్కోవడానికి చేస్తున్న శవపరీక్షలలో 15–20 శాతం పురుగుమందులు, కీటక నాశినులు, కలుపు నాశినులు సేవించి మరణించిన వారివే ఉంటున్నాయి. ఈ గడ్డి మందును హత్యలకు, బంధువులను బెదిరించి పనులు సాధించేందుకు కూడా వాడటం చూస్తున్నాం. ప్రతినిత్యం సరైన రక్షణ తొడుగులు లేక, మూతికి గుడ్డ కట్టుకోకుండా పొలంలో గడ్డిమందును పిచికారీ చేసే రైతులు కూడా ప్రమాదవశాత్తూ దీనిబారిన పడుతున్నారు. ఇటువంటి వారిలో పార్కిన్‌సన్ వ్యాధి, కాళ్లూ–చేతులు మంటలు రావడం లేదా స్పర్శ తగ్గడం వంటివి సంభవిస్తున్నాయి.
స్విట్జర్‌లాండ్‌కి చెందిన ఒక సంస్థ 1960వ దశకం నుంచి గడ్డిమందును తయారుచేసి విపణిలో ఉంచింది. ఈ మందు వల్ల సంభవించే స్వల్పకాలిక, దీర్ఘకాలిక విషప్రభావాలు, పర్యావరణంపై దీని దుష్ర్పభావాలను అంచనా వేసి ఆ దేశంతో సహా 60 అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు దీనిని నిషేధించాయి. ఈ సంస్థకు గడ్డిమందు ప్రభావం గురించి ముందుగానే తెలుసని, అయినా ఆ పరిశోధన పత్రాలను దాచిపెట్టి, వ్యాపార కాంక్షతో ఈ మందును తయారుచేసి ప్రపంచ జనాభాను బలిచేసిందని ‘ది గార్డియన్’ పత్రిక ‘పెరాక్వెట్ ఫైల్స్’ అన్న శీర్షికతో గత ఏడాది ప్రచురించింది. ప్రస్తుతం ఈ గడ్డిమందు వాడకంలో అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అర్జెంటినా, జపాన్ ఉన్నాయి. చైనా, ఇంకా చాలా దేశాలు వారి భూభాగంపై దీనిని వినియోగించడాన్ని అనుమతించకపోయినా, ఎగుమతులకు ఉత్పత్తి చేయడం వారి ద్వంద్వ వైఖరికి తార్కాణం. అమెరికాలో ఈ గడ్డిమందు వల్ల పార్కిన్‌సన్ వ్యాధి బారిన పడినవారు చాలా రాష్ట్రాల్లో సామూహిక దావాలు వేశారు.
ఈ గడ్డిమందు సేవించినప్పుడు నోటిలో, గొంతులో కాలిన గాయాల వలె పుండ్లు పడి మింగడానికి ఇబ్బంది కావడం, వాంతులు–విరేచనాలు అవడం, కామెర్ల బారిన పడడం, శరీరం పసుపుపచ్చగా మారడం, మూత్రం పసుపురంగులో రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్రమేపీ కాలేయం, మూత్రపిండాలు చెడిపోవడం, చివరకు ఊపిరితిత్తులు పనిచేయక మనిషి మరణిస్తాడు. దీనికి ప్రత్యేక విరుగుడు మందు లేదు. మరో విషయం ఏమిటంటే తొలుత విషం ప్రభావం విరామం ఇచ్చినట్లు కనిపించినా, తర్వాత వారి ఆరోగ్యం క్రమేపీ క్షీణిస్తుంది. ఇది వైద్యులకు ఓ పెను సవాలు. ప్రమాదం నుంచి బయటపడ్డాడు అని వైద్యులు చెప్పిన తరువాత కూడా ఆకస్మిక మరణం పాలయిన అనేక సందర్భాలున్నాయి. ఇది వైద్యులపై దాడులకు కూడా కారణమయింది. ప్రతి ఏడాది వేల సంఖ్యలో సంభవిస్తున్న గడ్డిమందు ఆత్మహత్యలు వైద్యులను కూడా భయాందోళనలకు గురిచేశాయి. దీంతో ఈ మందును సంపూర్ణంగా నిషేధించాలని ఒరిస్సాలోని వైద్యులంతా పెద్దయెత్తున ఉద్యమించారు.
మన దేశంలో కీటకనాశినుల తయారీ, అమ్మకాలని ‘కీటకనాశిని చట్టం–1968’ నియంత్రిస్తుంది. అయితే విష ప్రభావంపై ఎటువంటి అంచనా లేకుండా, పర్యావరణం, జంతుజాలం, మనుషులపై ఇది చూపించే ప్రభావాలను విశ్లేషించకుండా ఈ గడ్డిమందును సురక్షితంగా పరిగణిస్తూ భారత్‌లో వినియోగించడానికి అనుమతించారు. తరువాత కేరళలో దీని విషప్రభావంపై అధ్యయనం జరిపి, అక్కడి ఉన్నత న్యాయస్థానం ఆదేశానుసారం కొంతకాలం ఈ మందును నిషేధించారు. అయితే కీటకనాశినుల నియంత్రణలో కేంద్రానిదే పైచేయి కావడం, 90 రోజులకు మించి ఒకసారి వీటిని నిషేధించే అధికారం రాష్ట్రాలకు లేకపోవడం గడ్డిమందును నిషేధించాలన్న సంకల్పంతో ఉన్న రాష్ట్రాలకు సమస్యాత్మకంగా మారింది. అంతేకాక కొత్త పురుగుమందుల యాజమాన్యం చట్టం–2020 చాలాకాలంగా పార్లమెంటులో మగ్గుతుండడానికి గల కారణం ఈ మొత్తం వ్యవస్థపై పురుగు మందు సంస్థల గుత్తాధిపత్యం.
చాలా కొన్ని సాంద్రతలలో మాత్రమే గడ్డిమందును అనుమతిస్తున్నామని, వాడకాన్ని చాలావరకు నియంత్రిస్తున్నామని కేంద్రప్రభుత్వం వల్లెవేస్తున్నా, వాస్తవంలో నిర్దేశిత పంటలు దాటి రైతులు దీనిని వాడుతున్నారు. అలాగే సేద్యానికి మించి ప్రాణహానికి వాడడం చూస్తూనే ఉన్నాం. ప్రపంచ దేశాల పరిశోధకులు గడ్డిమందును అత్యంత ప్రమాదకర పురుగుల మందుగా నిర్ధారించారు. వారి పరిశోధనను గౌరవిస్తూ భారత్ కూడా ఈ మహమ్మారిని నిషేధించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి లక్షల కోట్లు గడించిన గడ్డిమందు తయారీ సంస్థ దీని విరుగుడు కోసం ఒక్క రూపాయి అయినా ఖర్చుపెట్టిందా అన్న విషయం దేవుడికే ఎరుక. ఉన్నపళంగా ఈ మందును నిషేధించలేమని ప్రభుత్వాలు భావిస్తే, క్రమేపీ నిషేధించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. ఏటికేడాది పెరిగిపోతున్న జనాభాకు తిండిపెట్టడానికి గడ్డిమందు లేకుండా వ్యవసాయం చేయలేమని చెప్పేవారూ లేకపోలేదు. అయితే ఈ మందుకు మునుపు కూడా వ్యవసాయం చేసి, విజయవంతంగా రెట్టింపు సంపద సృష్టించిన రైతుల గాథలు భారతదేశంలో చాలానే ఉన్నాయి. రెప్పపాటులో అద్భుతాలు సృష్టించాలనే పేరాశకు పోకుండా, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, కృషి సంవర్థక విధానాలతో గడ్డిమందు లేకుండా వ్యవసాయం చేయవచ్చు.
నారు నాటే మూడు నెలల ముందు నుంచి రెండు లేదా మూడుసార్లు పొలం దున్నడం వల్ల ఇసుక నేలలో కలుపు సమస్య తక్కువగా ఉంటుంది. రేగడి నేలల్లో గడ్డిమందు వాడకం ఎలాగూ తక్కువే. ఈ నేలను దున్నినప్పుడు పెరుగులాగా ఉండే మట్టి, అధిక నీటి సాంద్రత కలిగి కలుపును, వాటి విత్తులను చీకిపోయేలా చేస్తుంది. చీనీ, నిమ్మతోటల్లో ప్లాస్టిక్ షీట్స్ వినియోగిస్తూ, డ్రిప్ ఇరిగేషన్ వినియోగించడం వల్ల కలుపును చాలా వరకూ నివారించవచ్చు. గడ్డిమందు ప్రత్యామ్నాయ కలుపునాశినులు కూడా చాలానే ఉన్నాయి. వాటి భద్రతపై సరైన వివేచన జరిపి అనుమతులు జారీ చేయాల్సిన అవసరం ఉంది. గడ్డిమందు స్థానంలో వాటి వాడకాన్ని నిర్దేశించవచ్చు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఈ దిశగా పరిశోధనలు జరిపి, వాటి వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తే ప్రయోజనకరం. మనం తినే ఆహారంలో కూడా గడ్డిమందు అవశేషాలు ఉన్నట్లు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఆత్మహత్యలకే కాక హత్యలకు కూడా వాడుతున్న ఈ గడ్డిమందు వ్యవసాయదారులను దాటి, ప్రజారోగ్య, ప్రజారక్షక సమస్యగా పరిణమించింది. అందువల్ల ఈ గడ్డిమందును నిషేధించడం అత్యవసరం.
కట్టంరెడ్డి అనంత రూపేష్‌రెడ్డి
సహాయ ఆచార్యులు, ఆంధ్రా వైద్య కళాశాల